విచ్చుకత్తుల... విషాద గాంధారం | Sakshi Editorial On Afghanistan Crisis | Sakshi
Sakshi News home page

Afghanistan Crisis: విచ్చుకత్తుల... విషాద గాంధారం

Published Wed, Aug 18 2021 12:46 AM | Last Updated on Wed, Aug 18 2021 12:46 AM

Sakshi Editorial On Afghanistan Crisis

భయం... బ్రతుకు భయం. ఎలాగోలా అక్కడ నుంచి బయటపడితే చాలన్నంత భయం. విమానంలో ఖాళీ లేకపోతే కనీసం రెక్కల మీదైనా సరే ప్రమాదాన్ని లెక్కచేయకుండా ప్రయాణించేయాలనే వెర్రి సాహసం. జాగా లేని విమానంలో ప్రాణాలు అరచేత పట్టుకొని, 640 మంది క్రిక్కిరిసిన దైన్యం. పాలు కూడా దొరకని పసిపిల్లలు... మూతబడ్డ షాపులు... బ్యాంకులు... ఎప్పుడెవరు దాడి చేస్తారో, ఎక్కడ దాక్కోవాలో తెలియని ప్రజలు... స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయిన స్త్రీలు... అన్నీ అక్కడే వదిలేసి పిల్లాజెల్లాతో పారిపోతే చాలని విమానాశ్రయంలో పరుగులు తీస్తున్న పౌరులు... సాయుధ తాలిబన్ల పహారాలో శ్మశాన నిశ్శబ్దం. 50 లక్షల మందికి నివాసమైన అఫ్గానిస్తాన్‌ రాజధాని కాబూల్‌లోని ఈ దృశ్యాలను చూస్తే, గుండె కలుక్కుమంటుంది. అపురూప కళా, సంస్కృతులకు నెలవైన ప్రాచీన విమల గాంధార దేశం (నేటి కాంధహార్‌తో కూడిన అఫ్గాన్‌) ఇప్పుడు విషాద గాంధార స్వరాలాపనతో విలపిస్తోంది. అమెరికా తొందరపాటు సైనిక ఉపసంహరణ, అఫ్గాన్‌ ప్రభుత్వ వైఫల్యం, ఆ దేశసైనికుల అసమర్థత, అంతర్జాతీయ సమాజం నిర్లిప్తత – అన్నీ కలసి అఫ్గాన్‌ను అప్పనంగా తీవ్రవాద సాయుధ మూక తాలిబన్లకు అప్పగించాయి. అమెరికాపై తాలిబన్ల దాడితో అహం దెబ్బ తిన్న అగ్రరాజ్యం ‘తీవ్రవాదం పోరు’ అంటూ ఇరవై ఏళ్ళ క్రితం మొదలెట్టిన పనికి ఇప్పుడు అర్థం లేకుండా పోయింది. 3 లక్షల కోట్ల డాలర్ల ఖర్చు, వేలాదిగా సైన్యనష్టం – ఇప్పుడు బూడిదలో పోసిన పన్నీరయ్యాయి. 

అఫ్గాన్‌ భవితకు ఏర్పాట్లు చేయకుండానే, అక్కడి పౌర భద్రతకు బాధ్యత వహించకుండానే, తాలిబన్లకు ముకుతాడు వేసే షరతులేమీ లేకుండానే – ఎలాగోలా ఆ దేశం నుంచి తాము వెనక్కి వచ్చేస్తే చాలన్నట్టు అమెరికా వ్యవహరించింది. ఆ వ్యూహాత్మక తప్పిదం ఇప్పుడు ఓ మానవ సంక్షోభానికి దారి తీసింది. అంతర్జాతీయంగా అమెరికాకు తలవంపులు తెచ్చింది. అఫ్గానీయులకు తిప్పలు మిగిల్చింది. గత ఏడాది ఫిబ్రవరిలో దోహాలో తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అనేక లోపాల పుట్ట. అమెరికా గత అధ్యక్షుడు ట్రంప్‌ తీసుకున్న ఆ నిర్ణయాన్నే కొత్త ప్రెసిడెంట్‌ బైడెన్‌ సైతం కొనసాగించడం అఫ్గాన్‌లో అస్థిరతకు కారణమైంది. తాజా పరిణామాలతో విహారయాత్ర నుంచి హుటాహుటిన తిరిగొచ్చిన బైడెన్‌ తప్పంతా తాలిబన్లతో పోరాడకుండా లొంగిపోయిన అఫ్గాన్‌ ప్రభుత్వానిదే అన్నట్టు సోమవారం మాట్లాడారు. తమకెలాంటి ప్రభుత్వం కావాలో నిర్ణయించుకోవాల్సింది, పోరాడాల్సింది అఫ్గానీయులే అంటూ సూత్రీకరించారు. ఇరవై ఏళ్ళ క్రితం ఆ సూత్రం తామెలా మర్చిపోయారో మాత్రం చెప్పలేదు. 

ప్రజాస్వామ్యం పోయి, తాలిబన్ల చేతిలోకి అఫ్గాన్‌ రావడం సహజంగానే భారత్‌ లాంటి శాంతికాముక దేశాలకు రుచించదు. కానీ పాక్, చైనా, టర్కీ లాంటివి కొత్త పాలనలో స్వప్రయోజనాలను చూస్తున్నాయి. ఇరవై ఏళ్ళ క్రితంతో పోలిస్తే, ఇప్పుడు తాలిబన్లను 2.0 వెర్షన్‌ అంటున్నారు. కానీ, వారి మాటలే తప్ప చేతలు మారాయా అన్నది అనుమానమే. ప్రపంచం తమను గుర్తించాలని కోరుతున్న తాలిబన్లు ఎవరికీ హాని చేయబోమంటున్నారు. అందరికీ క్షమాభిక్ష పెడుతున్నామన్నారు. కానీ, కఠిన ‘షరియత్‌’ చట్టాన్ని అమలు చేస్తామంటున్నారు. స్త్రీలు ఉద్యోగం చేసుకోవచ్చు కానీ, ‘హిజాబ్‌’ (మేలి ముసుగు) ధరించాలంటున్నారు. పక్కన మగతోడు లేకుండా బయటకు తిరగకూడదంటున్నారు. ఇప్పటికే వివిధ ప్రావిన్స్‌లలో తాలిబన్‌ పోరాట యోధులనిచ్చి పెళ్ళి అనే ముసుగులో, మహిళల లైంగిక బానిసత్వానికి తెర తీసినట్టు వార్తలు వస్తున్నాయి. వీధుల్లో మహిళల పోస్టర్లు, సెలూన్లకు రంగులు పులుముతున్నారు. టీవీలో వినోదం స్థానంలో మత ప్రబోధాలు మొదలయ్యాయి. స్వేచ్ఛకు సంకెళ్ళు పడ్డ ఈ వార్తలే ఇకపై అఫ్గాన్‌ నుంచి వినాలి. అది చేదు నిజం. 

నిజానికి, తాలిబన్ల గత పాలనకు అమెరికా దళాలు చరమగీతం పాడిన 2001 నాటికీ, ఇప్పటికీ అఫ్గాన్‌ చాలా పురోగతి సాధించింది. ఒకప్పుడు అక్కడ ఆడపిల్లల చదువులే నిషిద్ధమైతే, ఇప్పుడు విద్యార్థుల్లో వాళ్ళు 39 శాతం వారే. అఫ్గాన్‌ జీడీపీ 4 బిలియన్‌ డాలర్ల నుంచి 20 బిలియన్‌ డాలర్లకు చేరింది. సగటు ఆయువు 56 నుంచి 65 ఏళ్ళకు పెరిగింది. అఫ్గాన్‌ అభివృద్ధిలో భారత్‌ ఇప్పటికి 3 బిలియన్‌ డాలర్లు పెట్టింది. మన నుంచి ఆ దేశానికి 80 కోట్ల డాలర్ల మేర ఎగుమతులు జరుగుతున్నాయి. తాలిబన్ల విజృంభణతో ఇవన్నీ సమస్యల్లో పడినట్టే. అఫ్గాన్‌ అభివృద్ధికీ, పునర్నిర్మాణానికీ కట్టుబడిన భారతప్రభుత్వం ఇరకాటంలో పడింది. తాలిబన్లను పూర్తిగా దూరం పెట్టి, భౌగోళికంగా కీలకమైన ప్రాంతాన్ని పాక్, చైనాల ఇష్టారాజ్యంగా వదిలేయలేం. అలాగని తీవ్రవాద మూకలతో చర్చించలేం. ఈ సందిగ్ధంలో ఖతార్‌ లాంటి సన్నిహిత దేశాల సాయం తీసుకోవాలి. అఫ్ఘాన్‌ పునర్నిర్మాణంలో భారత్‌కు వ్యూహాత్మక భాగస్వామ్యం కొనసాగేలా చూసుకోవడం కొంత తెలివైన పని. 

ఇక, అఫ్గాన్‌ వ్యవహారం ప్రపంచానికి మరో పాఠం నేర్పింది. ప్రజాస్వామ్యం ఎంతో గొప్పదే. కానీ, దాని కోసం పోరాడే నేతలు జనంలో నుంచి రావాలి. బయటి శక్తులు వచ్చి బలవంతాన ప్రజాస్వామ్యాన్ని ప్రతిష్ఠించాలనుకొంటే కష్టం. అఫ్గాన్‌లో అమెరికా తన సేనలతో చేసిన పొరపాటు అదే. అక్కడి ప్రజలను ఇరవై ఏళ్ళ పాటు బులిపించి, తీరా నడి సంద్రంలో నావలా వదిలేయడం చారిత్రక ద్రోహం. ఈ పరిస్థితుల్లో తాలిబన్లతో పాటు తిరిగొచ్చిన మధ్యయుగపు ఆలోచనలు, మానవ హక్కుల ఉల్లంఘనపై ప్రపంచం పెదవి విప్పాలి. మౌనంగా ఉంటే అది మరింత విషాదం. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement