రష్యాలో దేశీ సంస్థల చమురు వేట | ONGC Videsh Ltd, IOC consortium to buy Russian oil fields for $4.2 billion | Sakshi
Sakshi News home page

రష్యాలో దేశీ సంస్థల చమురు వేట

Published Thu, Mar 17 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 7:54 PM

రష్యాలో దేశీ సంస్థల చమురు వేట

రష్యాలో దేశీ సంస్థల చమురు వేట

రాస్‌నెఫ్ట్‌కు చెందిన రెండు క్షేత్రాల్లో వాటాల కొనుగోలు
ఒప్పందాలు కుదుర్చుకున్న ఐవోసీ కన్సార్షియం, ఓఎన్‌జీసీ విదేశ్
డీల్స్ విలువ దాదాపు రూ. 28,253 కోట్లు

 న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఆయిల్ కంపెనీలు.. విదేశాల్లో చమురు క్షేత్రాలను దక్కించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. రష్యన్ సంస్థ రాస్‌నెఫ్ట్‌కు సైబీరియాలో ఉన్న రెండు చమురు క్షేత్రాల్లో వాటాలు కొనుగోలు చేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సారథ్యంలోని కన్సార్షియం, ఓఎన్‌జీసీ విదేశ్ (ఓవీఎల్) ఇందుకు సంబంధించి బుధవారం ఒప్పం దాలు కుదుర్చుకున్నాయి. ఈ డీల్స్ విలువ 4.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 28,253 కోట్లు). టాస్-యురియాఖ్(టీఎన్‌కే-బీపీ) చమురు క్షేత్రం లో 29.9% వాటాల కోసం ఐవోసీ, ఆయిల్ ఇండియాతో పాటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) విభాగం.. రాస్‌నెఫ్ట్‌తో సేల్ పర్చేజ్ అగ్రిమెంటు (ఎస్‌పీఏ) కుదుర్చుకున్నాయి. ఈ డీల్ విలువ 1.28 బిలియన్ డాలర్లని అధికారులు తెలిపారు. ఇక ఇదే కన్సార్షియం వాంకోర్ క్షేత్రంలో 23.9% వాటాల కోసం రాస్‌నెఫ్ట్‌తో మరో ఒప్పందం కుదుర్చుకుంది. వాంకోర్‌లోని సుజున్‌స్కోయ్, టాగుల్‌స్కోయ్, లోడోష్నోయ్ క్షేత్రాల అభివృద్ధిలో వాటాలు తీసుకునే అంశాన్ని పరిశీలించేలా ఇంకో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది.

 వాంకోర్‌లో ఓవీఎల్ వాటాల పెంపు..
అటు వాంకోర్ క్షేత్రంలో ఓవీఎల్ తన వాటాలను 26 శాతానికి పెంచుకునేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇందుకోసం అదనంగా 925 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. గతేడాది సెప్టెంబర్‌లోనే 1.26 బిలియన్ డాలర్లు వెచ్చించి.. వాంకోర్‌లో ఓవీఎల్ 15 శాతం వాటాలు కొనుగోలు చేసింది. రాస్‌నెఫ్ట్ సీఈవో ఐగర్ సెషిన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా రెండో రోజున ఈ ఒప్పందాలు కుదిరాయి. రష్యా చమురు ఉత్పత్తి రంగంలో భారత సంస్థలు భాగస్వాములయ్యేందుకు ఈ డీల్స్ దోహదపడగలవని, అదే సమయంలో ఇక్కడి మార్కెట్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ఉపయోగపడగలవని విలేకరుల సమావేశంలో సెషిన్ తెలిపారు.

 క్షేత్రాల ప్రత్యేకతలివీ..
టాస్-యురియా ఆయిల్‌ఫీల్డ్‌లో వెలికితీయతగ్గ చమురు నిక్షేపాలు 137 మిలియన్ టన్నుల మేర ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో నుంచి రోజుకు 20,000 బ్యారెళ్లు (బీపీడీ) ఉత్పత్తవుతోంది. ఇది రెండేళ్లలో 1,00,000 బీపీడీకి పెరగగలదని అధికారులు తెలిపారు. భవిష్యత్ పెట్టుబడి వ్యయాల్లో తమ వాటా కింద ఐవోసీ-ఆయిల్-భారత్ పెట్రోరిసోర్సెస్ మరో 180 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు వివరించారు. రాస్‌నెఫ్ట్ గతేడాది 750 మిలియన్ డాలర్లకు టాస్-యురియాలో 20% వాటా విక్రయించింది. ఇక భారత కంపెనీలతో డీల్ తర్వాత ఈ ప్రాజెక్టులో రాస్‌నెఫ్ట్‌కు 50.1 శాతం వాటాలు ఉంటాయి.

మరోవైపు, వాంకోర్‌లో వెలికితీయతగ్గ చమురు నిక్షేపాలు 2.5 బిలియన్ బ్యారెళ్లు ఉన్నాయి. ఇందులో ఇంతక్రితం కొన్న 15 శాతం వాటాతో ఓవీఎల్‌కు ఏటా 3.3 మిలియన్ టన్నుల ఆయిల్ దక్కుతోంది. తాజా డీల్స్‌తో ఓవీఎల్ , ఐవోసీ కన్సార్షియంలు మొత్తం 49.9 శాతం వాటాలు దక్కించుకున్నాక భారత్‌కు 12 మిలియన్ టన్నుల చమురు అందుబాటులోకి రానుంది. అలాగే ఈ క్షేత్రంలో రాస్‌నెఫ్ట్ వాటా 50.1 శాతానికి పరిమితమవుతుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు ఎదుర్కొంటున్న రాస్‌నెఫ్ట్.. రుణభారాన్ని తగ్గించుకునేందుకు చమురు క్షేత్రాల్లో వాటాలు విక్రయిస్తోంది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement