ONGC Videsh
-
వాంకోర్‌నెఫ్ట్‌లో ఓవీఎల్ వాటా కొనుగోలు పూర్తి
♦ 15% వాటాను 127కోట్ల డాలర్లకు కొనుగోలు ♦ మరో 11 శాతం వాటా కొనుగోలు! న్యూఢిల్లీ: రష్యాలో రెండో అతి పెద్ద చమురు క్షేత్రం వాంకోర్‌లో 15 శాతం వాటా కొనుగోలును ఓఎన్జీసీ విదేశ్ పూర్తి చేసింది. వాంకోర్ చమురు క్షేత్రాన్ని నిర్వహించే జేఎస్సీ వాంకోర్‌నెఫ్ట్ కంపెనీలో ఈ 15% వాటాను ఓఎన్జీసీ విదేశ్ 126.8 కోట్ల డాలర్లకు రష్యా జాతీయ చమురు సంస్థ రాస్‌నెఫ్ట్ కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. ఓఎన్జీసీ విదేశ్కు ఇది నాలుగో అతి పెద్ద కొనుగోలు లావాదేవీ. వాంకోర్‌నెఫ్ట్ డెరైక్టర్ల బోర్డ్‌లో రెండు డెరైక్టర్ల పదవులు ఓఎన్జీసీ విదేశ్కు లభిస్తాయి. 250 కోట్ల బ్యారె ళ్ల రికవరబుల్ రిజర్వ్‌లు ఉన్న ఈ చమురు క్షేత్రం నుంచి ఓవీఎల్ వాటా కింద ఏడాదికి 33 లక్షల టన్నుల చమురు వస్తుందని అంచనా. ఈ చమురు క్షేత్రంలో రోజుకు 4.42,000 బ్యారెళ్ల చమురు ఉత్పత్తి అవుతోందని, దీంట్లో ఓవీఎల్ వాటా రోజుకు 66 వేల బ్యారెళ్లుగా ఉంటాయని అంచనాలున్నాయి. ఈ వాటా కొనుగోలుతో రష్యాలో ఓవీఎల్ స్థితి మరింతగా పటిష్టమవుతుందని, భారత ఇంధన భద్రత మరింత మెరుగుపడుతుందని, అంతేకాకుండా ఇరు దేశాల మధ్య సహకారం మరింతగా బలపడుతుందని ఓవీఎల్ పేర్కొంది. మరో 11% వాటాను కూడా విక్రయించడానికి రాస్‌నెఫ్ట్ అంగీకరించింది. దీనికి సంబంధించిన ఒప్పందం ఖరారు కావలసి ఉంది. -
ఓవీఎల్ - వాంకోర్ డీల్ కు రష్యా ఆమోదం
♦ 15 శాతం వాటాల కొనుగోలుకు ఓకే ♦ జూన్‌లోగా పూర్తి కానున్న ప్రక్రియ న్యూఢిల్లీ: రష్యా చమురు దిగ్గజ కంపెనీ రాస్‌నెఫ్ట్ నుంచి వాంకోర్ చమురు క్షేత్రంలో ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్) 15% వాటాలు కొనుగోలు చేసే డీల్‌కు రష్యా ప్రభుత్వం ఆమోదముద్ర వేసింది. ఇందుకు సంబంధించి అక్కడి ఫెడరల్ యాంటీమోనోపొలీ సర్వీస్ (ఎఫ్ఏఎస్) నుంచి అనుమతులు లభించినట్లు ఓవీఎల్ ఎండీ నరేంద్ర కె వర్మ తెలిపారు. ఇక వాంకోర్ క్షేత్ర డెవలపింగ్ సంస్థ వాంకోర్‌నెఫ్ట్‌లో తమకు బోర్డు పదవులు కేటాయిస్తుందని, తద్వారా కంపెనీని విక్రయ సంస్థ రాస్‌నెఫ్ట్ పునర్వ్యవస్థీకరిస్తుందని ఆయన వివరించారు. ఈ ప్రక్రియంతా జూన్ నాటికి పూర్తి కాగలదని అంచనా. ఓఎన్జీసీ ఇప్పటిదాకా కుదుర్చుకున్న అతి పెద్ద డీల్స్‌లో వాంకోర్ది నాలుగోది అవుతుంది. సుమారు 1.268 బిలియన్ డాలర్ల విలువ చేసే 15% వాటాల కొనుగోలుకు ఓవీఎల్ గతేడాది సెప్టెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకుంది. దీన్ని 26 శాతానికి పెంచుకునేందుకు ఈ ఏడాది మార్చిలో ప్రాథమిక ఒప్పందం కుదుర్చుకుంది. అదనంగా వాటాల కొనుగోలుకు కూడా ఎఫ్ఏఎస్ నుంచి ఆమోదముద్ర అవసరమా లేదా అన్నదానిపై ఇంకా స్పష్టత లేదని వర్మ పేర్కొన్నారు. -
రష్యాలో దేశీ సంస్థల చమురు వేట
♦ రాస్‌నెఫ్ట్‌కు చెందిన రెండు క్షేత్రాల్లో వాటాల కొనుగోలు ♦ ఒప్పందాలు కుదుర్చుకున్న ఐవోసీ కన్సార్షియం, ఓఎన్జీసీ విదేశ్ ♦ డీల్స్ విలువ దాదాపు రూ. 28,253 కోట్లు న్యూఢిల్లీ: దేశీ దిగ్గజ ఆయిల్ కంపెనీలు.. విదేశాల్లో చమురు క్షేత్రాలను దక్కించుకోవడంపై మరింతగా దృష్టి పెడుతున్నాయి. రష్యన్ సంస్థ రాస్‌నెఫ్ట్‌కు సైబీరియాలో ఉన్న రెండు చమురు క్షేత్రాల్లో వాటాలు కొనుగోలు చేశాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ సారథ్యంలోని కన్సార్షియం, ఓఎన్జీసీ విదేశ్ (ఓవీఎల్) ఇందుకు సంబంధించి బుధవారం ఒప్పం దాలు కుదుర్చుకున్నాయి. ఈ డీల్స్ విలువ 4.2 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 28,253 కోట్లు). టాస్-యురియాఖ్(టీఎన్కే-బీపీ) చమురు క్షేత్రం లో 29.9% వాటాల కోసం ఐవోసీ, ఆయిల్ ఇండియాతో పాటు భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) విభాగం.. రాస్నెఫ్ట్తో సేల్ పర్చేజ్ అగ్రిమెంటు (ఎస్పీఏ) కుదుర్చుకున్నాయి. ఈ డీల్ విలువ 1.28 బిలియన్ డాలర్లని అధికారులు తెలిపారు. ఇక ఇదే కన్సార్షియం వాంకోర్ క్షేత్రంలో 23.9% వాటాల కోసం రాస్నెఫ్ట్తో మరో ఒప్పందం కుదుర్చుకుంది. వాంకోర్లోని సుజున్స్కోయ్, టాగుల్స్కోయ్, లోడోష్నోయ్ క్షేత్రాల అభివృద్ధిలో వాటాలు తీసుకునే అంశాన్ని పరిశీలించేలా ఇంకో అవగాహన ఒప్పందం(ఎంవోయూ) కుదుర్చుకుంది. వాంకోర్‌లో ఓవీఎల్ వాటాల పెంపు.. అటు వాంకోర్ క్షేత్రంలో ఓవీఎల్ తన వాటాలను 26 శాతానికి పెంచుకునేందుకు అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది. ఇందుకోసం అదనంగా 925 మిలియన్ డాలర్లు చెల్లించనుంది. గతేడాది సెప్టెంబర్‌లోనే 1.26 బిలియన్ డాలర్లు వెచ్చించి.. వాంకోర్‌లో ఓవీఎల్ 15 శాతం వాటాలు కొనుగోలు చేసింది. రాస్‌నెఫ్ట్ సీఈవో ఐగర్ సెషిన్ రెండు రోజుల భారత పర్యటన సందర్భంగా రెండో రోజున ఈ ఒప్పందాలు కుదిరాయి. రష్యా చమురు ఉత్పత్తి రంగంలో భారత సంస్థలు భాగస్వాములయ్యేందుకు ఈ డీల్స్ దోహదపడగలవని, అదే సమయంలో ఇక్కడి మార్కెట్లో తమ కార్యకలాపాలు విస్తరించేందుకు ఉపయోగపడగలవని విలేకరుల సమావేశంలో సెషిన్ తెలిపారు. క్షేత్రాల ప్రత్యేకతలివీ.. టాస్-యురియా ఆయిల్‌ఫీల్డ్‌లో వెలికితీయతగ్గ చమురు నిక్షేపాలు 137 మిలియన్ టన్నుల మేర ఉన్నాయి. ప్రస్తుతం ఇందులో నుంచి రోజుకు 20,000 బ్యారెళ్లు (బీపీడీ) ఉత్పత్తవుతోంది. ఇది రెండేళ్లలో 1,00,000 బీపీడీకి పెరగగలదని అధికారులు తెలిపారు. భవిష్యత్ పెట్టుబడి వ్యయాల్లో తమ వాటా కింద ఐవోసీ-ఆయిల్-భారత్ పెట్రోరిసోర్సెస్ మరో 180 మిలియన్ డాలర్లు చెల్లించనున్నట్లు వివరించారు. రాస్‌నెఫ్ట్ గతేడాది 750 మిలియన్ డాలర్లకు టాస్-యురియాలో 20% వాటా విక్రయించింది. ఇక భారత కంపెనీలతో డీల్ తర్వాత ఈ ప్రాజెక్టులో రాస్‌నెఫ్ట్‌కు 50.1 శాతం వాటాలు ఉంటాయి. మరోవైపు, వాంకోర్‌లో వెలికితీయతగ్గ చమురు నిక్షేపాలు 2.5 బిలియన్ బ్యారెళ్లు ఉన్నాయి. ఇందులో ఇంతక్రితం కొన్న 15 శాతం వాటాతో ఓవీఎల్‌కు ఏటా 3.3 మిలియన్ టన్నుల ఆయిల్ దక్కుతోంది. తాజా డీల్స్‌తో ఓవీఎల్ , ఐవోసీ కన్సార్షియంలు మొత్తం 49.9 శాతం వాటాలు దక్కించుకున్నాక భారత్‌కు 12 మిలియన్ టన్నుల చమురు అందుబాటులోకి రానుంది. అలాగే ఈ క్షేత్రంలో రాస్‌నెఫ్ట్ వాటా 50.1 శాతానికి పరిమితమవుతుంది. అమెరికా, యూరోపియన్ యూనియన్ ఆంక్షలు ఎదుర్కొంటున్న రాస్‌నెఫ్ట్.. రుణభారాన్ని తగ్గించుకునేందుకు చమురు క్షేత్రాల్లో వాటాలు విక్రయిస్తోంది. -
రష్యా చమురు క్షేత్రంలో ఓఎన్జీసీ విదేశ్కు 15% వాటా
► నేడు మోదీ, పుతిన్‌ల సమక్షంలో ఒప్పందంపై సంతకాలు ► డీల్ విలువ 1.268 బిలియన్ డాలర్లు... న్యూఢిల్లీ: రష్యాలోని రెండో అతిపెద్ద చమురు క్షేత్రం ‘వాంకోర్’లో ప్రభుత్వ రంగ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్(ఓవీఎల్) 15 శాతం వాటా కొనుగోలు కార్యరూపం దాల్చుతోంది. ఈ డీల్ విలువ 1.286 బిలియన్ డాలర్లు(దాదాపు రూ.8,300 కోట్లు). ప్రధాని నరేంద్ర మోదీ రష్యా పర్యటనలో భాగంగా గురువారం ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరగనున్నాయి. ఓఎన్జీసీకి చెందిన విదేశీ పెట్టుబడుల అనుబంధ సంస్థ ఓవీఎల్.. ఈ ఏడాది సెప్టెంబర్‌లో దీనికి సంబంధించి ప్రాథమిక అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. వాంకోర్ చమురు, గ్యాస్ క్షేత్రం డెవలపర్ అయిన రాస్‌నెఫ్ట్ అనుబంధ కంపెనీ వాంకోర్నెఫ్ట్తో షేర్ల కొనుగోలు, వాటాదారుల ఒప్పందంపై ఓవీఎల్ సంతకాలు కూడా చేసింది. దీని ప్రకారం అవసరమైతే అక్టోబర్ 31లోపు ఓవీఎల్‌కు ఈ డీల్ నుంచి వైదొలిగే అవకాశం కల్పించారు. అయితే, ఈ ఒప్పందానికి కట్టుబడేందుకు ఓవీఎల్ నిర్ణయించింది. ఇప్పుడు మోదీ పర్యటన సందర్భంగా ఈ ఫేజ్-1 డీల్ పూర్తయ్యే విధంగా సంతకాలు జరుగుతాయని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత ఒక చమురు పీఎస్‌యూ చేపడుతున్న తొలి విదేశీ కొనుగోలు ఒప్పందం ఇదే కావడం గమనార్హం. వాంకోర్ క్షేత్రంలో 2.5 బిలియన్ బ్యారెళ్ల ముడిచమురు నిల్వలు ఉన్నట్లు అంచనా. తాజా ఒప్పందం ప్రకారం ఓవీఎల్‌కు ఈ క్షేత్రాల నుంచి వార్షికంగా 3.3 మిలియన్ టన్నుల చమురు ఉత్పత్తికి అవకాశం లభిస్తుంది. కాగా, విదేశాల్లో ఓవీఎల్‌కు ఇది నాలుగో అతిపెద్ద కొనుగోలు ఒప్పందంగా నిలవనుంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 17 దేశాల్లో 36 ప్రాజెక్టులను ఓవీఎల్ నిర్వహిస్తోంది. -
ఓఎన్జీసీ విదేశ్లో పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం
న్యూఢిల్లీ: అనుబంధ సంస్థ ఓఎన్జీసీ విదేశ్లో.. చమురు ఉత్పత్తి దిగ్గజం ఓఎన్జీసీ రూ. 5,000 కోట్లు పెట్టుబడి పెట్టే ప్రతిపాదనకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. దీని ప్రకారం ‘విదేశ్’లో ప్రస్తుత రుణ మొత్తాన్ని అంతే సమానమైన ఈక్విటీ కింద ఓఎన్జీసీ మార్చుకోనుంది. దీంతో విదేశాల్లో ఇంధన అన్వేషణ, ఉత్పత్తి కార్యకలాపాలు మరింతగా చేపట్టేందుకు ఓఎన్జీసీకి వెసులుబాటు లభించగలదు. ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. -
వియత్నాంలో ఓవీఎల్‌కు 5 బ్లాకులు
న్యూఢిల్లీ: ఆయిల్ రంగ దిగ్గజం ఓఎన్జీసీ విదేశ్కు వియత్నాం 5 ఆయిల్, గ్యాస్ బ్లాకులను కేటాయించింది. బిడ్డింగ్ లేకుండానే ఈ సముద్రగర్భ బ్లాకుల కేటాయింపు జరిగినట్లు ఓఎన్జీసీ విదేశ్ తెలిపింది. దక్షిణ చైనా సముద్ర ప్రాంతం, ఉజ్బెకిస్తాన్‌లోని కొసోర్ బ్లాకులోని ఈ క్షేత్రాలను వియత్నాం ప్రభుత్వ సంస్థ పెట్రోవియత్నాం నామినేషన్ ప్రాతిపదికన కేటాయించినట్లు పేర్కొంది. చైనాకున్న ఆధిపత్యానికి చెక్ పెట్టే ప్రయత్నంలో వియత్నాం వీటి కేటాయింపును చేపట్టింది. ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఓఎన్జీసీకి విదేశాలలో అనుబంధ సంస్థగా ఓఎన్జీసీ విదేశ్ వ్యవహరించే సంగతి తెలిసిందే. వియత్నాం, ఇండియా, తదితర దేశాలలో ఇంధన రంగంలో పరస్పరం సహకరించుకునేందుకు వీలుగా పెట్రోవియత్నాంతో తాజాగా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు ఓఎన్జీసీ విదేశ్ వెల్లడించింది. ఎంవోయూలో భాగంగానే వియత్నాం 5 బ్లాకులను కేటాయించింది. ఓఎన్జీసీ విదేశ్ వీటిని మదింపుచేశాక ఆసక్తి ఉంటే పెట్రోవియత్నాంకు ప్రతిపాదనలు పంపించవచ్చు. ఈ బ్లాకులకు సంబంధించిన డేటాను పరిశీలించాక ఆసక్తి కలిగిన బ్లాకుల కోసమే ఓఎన్జీసీ విదేశ్ ప్రతిపాదనలు చేయవచ్చు. ఈ విషయాలను కంపెనీ సీనియర్ అధికారి ఒకరు ఒక ప్రకటనలో వివరించారు. ఆపై ఆసక్తి కలిగిన బ్లాకుల కోసం ఉత్పత్తి పంపకం కాంట్రాక్ట్(పీఎస్సీ)పై సంతకాలు చేయవచ్చు.