ఆధార్ సీడింగ్ కోసం మల్లగుల్లాలు
ఏలూరు, న్యూస్‌లైన్ : జిల్లాలో ఓ నెల ముందు నుంచే వంటగ్యాస్‌కు ‘నగదు బదిలీ’ పథకం అమలు చేయనుండటంతో అధికారులు తర్జన భర్జన పడుతున్నారు. లక్షల్లో గ్యాస్ కనెక్షన్లకు ఆధార్ సీడింగ్ నమోదు చేయాల్సి ఉండటంతో కొండంత లక్ష్యంతో గ్యాస్ డీలర్లు, సివిల్ సప్లయ్స్ అధికారులు నానా హైరానా పడుతున్నారు. నగదు బదిలీ పథకాన్ని అక్టోబర్ నుంచి అమలు చేస్తామని ప్రభుత్వం గతంలో ప్రకటించడంతో అధికారులు ఈ వ్యవహారాన్ని తేలికగా తీసుకున్నారు. తాజాగా కేంద్రపెట్రోలియం మంత్రిత్వశాఖ సెప్టెంబర్ నుంచే రాష్ట్రంలోని మరో ఏడు జిల్లాల్లో దీన్ని అమలు చేస్తామని ప్రకటించింది.
ఇందులో మన జిల్లా కూడా ఉండటంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుతానికి ఐదు జిల్లాల్లో ఈ పథకం అమల్లో ఉంది. గ్యాస్ సిలిండ ర్ల సబ్సిడీని నేరుగా ఆధార్ కార్డుతో అనుసంధానించిన బ్యాంకు ఖాతాలకు జమ చేస్తారు. ఇప్పుడు సమయం ముంచుకొస్తుండటంతో ఏ విధంగా గట్టెక్కాలనే దానిపైనే అధికారులు కసరత్తు చేస్తున్నారు. నెలాఖరులోగా ఇది పూర్తి చేయగలమా అని అధికారులు మదనపడుతున్నారు. జిల్లాలో మొత్తం 8.67లక్షల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.
ఇందులో 2.56 లక్షల కనెక్షన్లకు మాత్రమే ఆధార్ సీడింగ్ పూర్తి చేశారు. ఆరు లక్షల కనెక్షన్లకు నెలాఖరులోగా ఆధార్ సీడింగ్ పూర్తి చేయడం సాధ్యమయ్యేట్లు కనిపించటం లేదు. గ్యాస్ వినియోగదారులు తమ ఆధార్‌కార్డు, బ్యాంకు ఖాతా నంబర్, గ్యాస్ ధ్రువీకరణ పత్రాలను ఆయా ఏజెన్సీల్లో ఆధార్ సీడింగ్ నమోదుకు ఇవ్వాల్సి ఉంది. చాలా మంది వినియోగదారులకు ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో అర్హతా పత్రాలను సమర్పించలేదు.