vara vara rao
-
వరవరరావు కేసులో సుప్రీం తీర్పు రిజర్వ్
న్యూఢిల్లీ: కోరేగావ్–భీమా అల్లర్ల కేసులో గృహ నిర్బంధంలో ఉన్న వరవరరావుతో పాటు మరో నలుగురు సామాజిక కార్యకర్తలను విడుదల చేయాలని దాఖలైన పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ప్రముఖ చరిత్రకారుడు రొమిల్లా థాపర్‌తో పాటు మరికొందరు సుప్రీంలో పిటిషన్ దాఖలు చేశారు. పిటిషనర్, పోలీసుల తరఫు న్యాయవాదుల వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసులో జరుగుతున్న విచారణకు సంబంధించి వివరాలను 24 లోపు తమ ముందుంచాలని మహారాష్ట్ర పోలీసులను ఆదేశించింది. వరవరరావు, అరుణ్ ఫెర్రీరా, వెర్నాన్ గొన్సాల్వేస్, సుధా భరద్వాజ్, గౌతం నవ్‌లఖాలు ఆగస్టు 29 నుంచి గృహ నిర్బంధంలో ఉన్నారు. -
అమరావతి ఒక విధ్వంసం
అమరావతి పేరుతో ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు జరుపుతున్న వ్యవహారం మహా విధ్వంసకరమని విప్లవరచయితల సంఘం వ్యవస్థాపక సభ్యుడు వరవరరావు విమర్శిం చారు. చంద్రబాబు విధానాలనే కేసీఆర్ పాటిస్తున్నారని, ఏ విషయంలోనూ వీళ్లిద్దరికీ తేడా లేదని ఆరోపించారు. రాష్ట్ర సహజవనరులను అప్పనంగా పెట్టుబడిదారులకు అప్పగించడంలో ఇద్దరు చంద్రులూ ఒకే తానుముక్కలేనని పేర్కొన్నారు. మూడు లక్షల మంది ఆదివాసులను ముంచేస్తున్న ప్రాజెక్టులు ఎవరి అభివృద్ధిలో భాగమని ప్రశ్నిస్తున్న వరవరరావు అభిప్రాయాలు ఆయన మాటల్లోనే... రాని విప్లవాల కోసం మీ జీవితాలను అర్పిస్తున్నారే? రైతు వ్యవసాయం చేయడం మానుకున్నాడా? ఈ ఏడాది పంటపోవచ్చు, వచ్చే ఏడాదీ, ఆ మరుసటి ఏడాదీ పోవచ్చు కానీ రైతు నమ్ముకున్నదే వ్యవసాయాన్నే కదా. ఇక్కడి కమ్యూనిస్టు పార్టీ నమ్ముకున్నదే వ్యవసాయ విప్లవాన్ని. ఆప్తులు ఎన్కౌంటర్లలో పోతుంటే భయమనిపించదా? మానవ సహజ లక్షణాల్లో బాధ ఉంటుంది. నిజానికి క్రిస్టఫర్ కాడ్వెల్ ‘ఒక కంట్లో కన్నీరు ఉంది కాబట్టి మరోకంట్లో కత్తి మొలిచింది’ అంటాడు. తోటివారి బాధను చూసి కమ్యూనిస్టులు బాధ చెందేటట్లు మరెవ్వరూ చెందలేరు. పార్వతీపురం కుట్రకేసులో ముద్దాయిలపై విచారణ సమయంలో కాళోజీ, నేనూ కోర్టుకు వెళ్లాం. ఆరేడేళ్లుగా జైల్లో ఉన్నవాళ్లను చూసి కాళోజీ కన్నీరు కార్చాడు. ఆ తర్వాత వారే ఉత్తరం రాశారు. ‘కాళోజీ కన్నీళ్లను కత్తులుగా మార్చుకోవడం నేర్చుకో’ అని. ఆ బాధనుంచే జీవితమంతా అంత ఆగ్రహంతో జీవించారాయన. అలాగే పెట్టుబడి, అది చేసే దోపిడీపై మార్క్స్ తీవ్ర వేదన చెందారు. మనిషి నెత్తురూ, చెమటా పోసి సరుకును ఉత్పత్తి చేస్తే ఆ సరుకుకే ఆ మనిషి పరాయివాడైపోతున్నాడని బాధ. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కదా. ఇప్పుడెలా ఉంది? ఇట్ల ఉంటుందని ఎవరనుకున్నారు అన్నాడు కాళోజీ 1952లోనే. తెలంగాణలో ఉంటూ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడాలని కోరుకుని ఉద్యమించినవాడు కాళోజీ. శ్రీశ్రీతో కలిసి 1943లోనే వరంగల్‌లో ఆకారం నరసింగరావు తోటలో విశాలాంధ్ర కావాలని సభ పెట్టించి, టాంగాలో పోతుంటే ప్రత్యేక తెలంగాణ వాదులు వారిపై రాళ్లు విసిరారు. అయినా సరే... విశాలాంధ్ర తీర్మానం చేశారు. తర్వాత 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడితే విశాలాంధ్ర ఇట్ల ఉంటుందని ఎవరనుకున్నారు అని రాశారు అదే కాళోజీ. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమిటంటే కాళోజీ ఆరోజు ఇట్లవుతుందని ఎవరనుకున్నారన్నారుగానీ నేటి తెలంగాణ ఇట్లవుతుందనే మేమనుకున్నాం. కేసీఆర్ తెలంగాణ ఇట్లే అవుతుందనుకున్నారా? బాబు గతంలో చెయ్యంది కేసీఆర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడు? టీడీపీకి ఇప్పుడు రెండు రాష్ట్రాలు, రెండు ప్రభుత్వాలు ఏర్పడ్డాయని రాశాను. తెరాస ప్రభుత్వంలో 12 మంది టీడీపీకి చెందినవారు మంత్రు లుగా ఉంటున్నారు. నేటి తెలంగాణను ఈ రూపంలో కోరుకోలేదు. బాబు అనుసరించిన ఏ దోపిడీ విధానాలను కేసీఆర్ అనుసరించకుండా ఉన్నారో చెప్పండి. అదే సామ్రాజ్యవాద ప్రపంచీకరణ, అదే ప్రపంచబ్యాంక్ ఆర్థిక విధానం అమలవుతోందిప్పుడు. అసలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంలోనే ద్రోహం ఉంది. ఏమిటి ఈ ప్యాకేజీలు? మీకు తెలంగాణను ప్యాకేజీగా ఇస్తాం. వాళ్లకు పోలవరం ప్యాకేజీగా ఇస్తాం. కానీ, మీ ప్యాకేజీల మాయలో ఆదివాసులు 3 లక్షలమందికి పైగా చచ్చిపోతున్నారు అక్కడ. ఏ ప్రజలను కొట్టి ఏ ప్రజలకోసం మీరు ప్యాకేజీలను ఇస్తున్నారు? ప్రాజెక్టులే లేకపోతే అభివృద్ధి ఎలా? ప్రజలు కోరుకునే పద్ధతిలో ప్రాజెక్టులు ఉండటం లేదు. జల్, జంగిల్, జమీన్ మాకు కావాలి అని ప్రజలు కోరుకున్నారు. అధికారం వస్తే జల్ని, జంగిల్‌ని, జమీన్ని ఏంచేయాలని ప్రజలు నిర్ణయిం చుకోవాలి కానీ మీరెవరు ప్రజలకు ఏది కావాలో నిర్ణయించడానికి? పోలవరం ప్రాజెక్టుకు అనుమతిస్తే నేను అక్కడ కుర్చీ వేసుకుని కూర్చుని దాన్ని అడ్డుకుంటాను అని ప్రగల్భాలు పలికిన కేసీఆర్ ఇవ్వాళ ఏమైపోయాడు? నీళ్లు రావు, నెత్తురు పారుతుందన్న అదే కేసీఆర్ ఆ ప్యాకేజీమీదే సంతకాలు చేసేసి తెలం గాణ తెచ్చుకున్నాడు. వెంకయ్య, జైరాం రమేష్, చంద్రబాబు ముగ్గురూ చేసిన కుట్ర పథకానికి కేసీఆర్ లోబడి ఏడు మండలాలూ వదులుకున్నాడు. ప్రాజెక్టుకూ సమ్మతించిండు. 3 లక్షల మందిని ముంపునకు అర్పించేశాడు. అక్కడితో ఆగకుండా ఇవ్వాళ గోదావరి నదిమీద ప్రాజెక్టుల పేరుతో ఒక్కో ప్రాంతంలో డజన్ల కొద్దీ ఆదివాసీ గ్రామాలను నీళ్లలో ముంచేయబోతున్నారు. ప్రాజెక్టులతో తెలంగాణ సస్యశ్యామలం కాదా? ఎవరికోసం సస్యశ్యామలం చేస్తున్నారు అనేది ప్రశ్న. లోచన్ అనే కవి భాక్రానంగల్, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు ఇప్పుడు పెద్దవాళ్ల ఇళ్లల్లో షవర్ బాత్ లుగా పనిచేస్తున్నాయని కవిత్వం రాశారు. మరి ఈ ప్రాజెక్టులన్నీ ఎవరికోసం వస్తున్నాయంటారు? భూమిని పంచకుండా ఈ ప్రాజెక్టులేంటి? మీ మోడల్ ప్రకారం అసలు అభివృద్ధి ఎలా? అభివృద్ధి గురించి చీమలను అడగండి. చీమల్లాంటి ప్రజలను అడగండి. అంతే కానీ పాములను అడగొద్దు. పాములకోసం అభివృద్ధి చేయవద్దు. ఆదివాసులను అడగండి. వాళ్ల కాళ్లకింది నేలను లాగేస్తున్న వారిని అడగొద్దు. చీమలనుకున్నవే.. పాములుగా మారుతున్న రోజులివి. కేసీఆర్, చంద్రబాబు పాలనపై మీ అభిప్రాయం? ఇద్దరి ప్రభుత్వాలలో ఏమీ తేడా లేదండి. వాస్తవంగా చెప్పాలంటే చంద్రబాబు ప్రభుత్వం రెండో కొనసాగింపే కేసీఆర్ ప్రభుత్వం. బాబు తొమ్మిదిన్నరేళ్ల కొనసాగింపు తర్వాత ఈ నాలుగేళ్ల కొనసాగింపు కేసీఆర్‌ది. ఎన్టీఆర్ టీడీపీ నుంచి పుట్టినవాడు కేసీఆర్. లాటిన్ అమెరికన్ పాలనలోని రాక్షసత్వాన్ని అమలు చేసిన దుర్మార్గ పాలన ఎన్టీఆర్‌ది. ప్రపంచీకరణ విధానాలను ఒక రిహార్సల్‌గా అమలు చేసినవారు రాజీవ్ గాంధీ, ఎన్టీఆర్. కేసీఆర్ ఆ విధానాలనే అమలు చేస్తున్నారు. మరి చంద్రబాబు పాలనపై..? ఇక చెప్పాల్సిన పనిలేదు. వాస్తవానికి చంద్రబాబు చెప్పుకుంటున్న అమరావతి రాజధాని ఒక భయంకరమైన విధ్వంసం. రాజకీయం అనే భావననే భ్రష్టుపట్టించింది చంద్రబాబు కాగా సరిగ్గా ఆ విధానాలనే కేసీఆర్ పాటిస్తున్నాడు. ఏ విషయంలోనూ వీరిద్దరికీ తేడా లేదు. రైతు బంధు అని కేసీఆర్ తీసుకొచ్చాడు కదా? నమ్మక ద్రోహం ఇది. ఏ రైతులకు ఇస్తున్నాడు, భూమ్మీద సేద్యం చేసే రైతులకు ఇచ్చాడా, సేద్యం చేయని భూ యజమానులకు ఇచ్చాడా. -
వలసవాద విముక్తి గీతం గూగీ
సందర్భం నేను ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్ పేపర్ మీద రాశాను. నా మరో పుస్తకం ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ను జి.ఎన్. సాయిబాబా నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా ఉండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి! సీగుల్ పబ్లిషర్స్ ఆహ్వానంపై ఇండియాకు వస్తున్న సుప్రసిద్ధ కెన్యా రచయిత గూగీ వాథియాంగో ‘మలుపు’ ప్రచురణల ఆహ్వానానికి స్పందిస్తూ ‘ఇండియాకు రావాలని ఉత్సుకతతో ఉన్నాను. ఇంక హైదరాబాదుకు రావడమంటే నాకెంతో ఇష్టం. ప్రత్యేకించి ప్రొ.జి.ఎన్. సాయిబాబా అనువదిం చిన నా బాల్యజ్ఞాపకాలు ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ (Dreams in a Time of War : A Childhood Memoir) పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడమంటే అంతకన్నా ఏంకావాలి. ప్రొఫెసర్ సాయిబాబాను కలిసే అవకాశం ఉంటే ఇంకెంతో బాగుండేది’ అని రాశారు. గూగీ నవలల్లో ఆఫ్రికా ప్రజలు ద్వేషించే యూరపు వలసవాదుల తర్వాత మనకు కనిపించేది గుజరాతీ వ్యాపారులే. కాని ఆయనకు భారతప్రజల పట్ల వాళ్ల పోరాటాల పట్ల ఎంతో ఆసక్తి ఉంది. గూగీ మొదటిసారి 1996 ఫిబ్రవరిలో ఎఐపిఆర్ఎఫ్ (ఆల్ఇండియా పీపుల్స్ రెసిస్టెన్స్ ఫోరమ్) ఆహ్వానంపై ఢిల్లీలో జరిగిన జాతుల సమస్యపై అంతర్జాతీయ సదస్సుకు వచ్చాడు. అక్కడ ఆయన ప్రపంచీకరణ జాతుల సమస్య గురించి చేసిన ప్రసంగానికి సాయిబాబా అధ్యక్షత వహించాడు. అక్కడినుంచి గూగీ హైదరాబాదు, కాకతీయ వర్సిటీ, 1990 వరకు కరీంనగర్ విప్లవోద్యమ అమరుల స్మృతిలో నిర్మించిన హుస్నాబాద్ స్థూపం చూశారు. తన ఇండియా పర్యటన ప్రభావంతోనే ‘విజార్డ్ క్రౌ’ అనే బృహత్తర నవల రాశాడు. నాటినుంచీ తెలంగాణ ప్రాంతంలోని విప్లవోద్యమం, ఇక్కడి జీవితానికి, పోరాటానికి తాను ఎంచుకున్న ఒక సంభాషణ వంటి సాయిబాబాతో తనకు గాఢానుబంధం ఏర్పడింది. గూగీని ఢిల్లీ జాతీయ సదస్సుకు పిలిచిన నవీన్‌బాబు, ఆ తర్వాత కాలంలో విప్లవోద్యమంలో ఎన్కౌంటర్లో అమరుడయినాడని రాసినపుడైనా, పీపుల్స్‌వార్ కేంద్రకమిటీ సభ్యుల ఎన్కౌంటర్ తర్వాత 1999 డిసెం బర్ ఆఖరులో రాజ్యం హుస్నాబాదు స్థూపాన్ని కూల్చేసిందని రాసినా ఆయన ఈ చీకటిమబ్బు అంచున ఎప్పుడూ మీ వర్తమానంలో ఒక మెరుపుతీగ వంటి ఆకాంక్ష, ఆశ మిగిలే ఉంటాయి అని రాసేవాడు. మీకు పోరా టం ఉంటుంది, అమరుల జ్ఞాపక చిహ్నాలను తుడిచేసినా వాళ్ల ఆకాంక్షలను జెండాలుగా పూని నడిచే పోరాటం ఉంటుందని రాశారు. మనసును వలసవాదం నుంచి విముక్తం చేయాలని, భాషను ఒక పదునైన అస్త్రంగా, సాహిత్యాన్ని అత్యంత ఆధునిక, సాంకేతిక నైపుణ్యంతో మెత్తటి మట్టిలాగ మార్చగలగాలంటే భాషా సాహిత్యాలు కూడ మానవశ్రమ నుంచి ఉత్పత్తి అయినవేననే ఎరుక కలగాలని ఆయన ఢిల్లీ సదస్సులోనూ, నిజాం కాలేజి సభలోను, చలసాని ప్రసాద్ అధ్యక్షతన బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో జరిగిన విరసం సభలోనూ మాట్లాడాడు. తెలుగు భాషలో వస్తున్న ప్రజా విప్లవ సాహిత్యాన్ని నేరుగా గికియు భాషలోకి తీసుకుపోగలిగితే ఎంత బాగుండునని ఆశించాడు. ఈ అవగాహనే గూగీని ప్రజాస్వామిక పోరాటయోధుడైన సాయిబాబాతో నిరంతర అనుబంధంలో కొనసాగించింది. గూగీ తన నవలలు, నాటకాలు, ప్రజారంగస్థల నిర్మాణం వలన కెన్యాలోని నియంతలకు కన్నెర్ర అయి 1978–79 కెన్యా ఆత్యయికస్థితి కాలంలో జైలుపాలయినట్లుగానే సాయిబాబా తన గ్రీన్‌హంట్ వ్యతిరేక పోరాటం వలన జైలుపాలయ్యాడు. బెయిలుపై విడుదల కావడానికన్నా ముందే నాగపూర్ హై సెక్యూరిటీ జైల్లోని అండా సెల్లోనే గూగీ ఆత్మకథను తెలుగు చేశాడు. ‘‘అది అక్షరాలా ఒక యుద్ధకాలంలో పుట్టిన శిశువు స్వప్నాలకు ఒక యుద్ధఖైదీ చేసిన అనుసృజన. ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా దీన్ని అనువదించడం నాకు చాలా సంతోషం కలిగింది. 1996 ఫిబ్రవరిలో ఢిల్లీలో కలిసినపుడు ఆయనతో నా కలయిక జ్ఞాపకాలను నేనెన్నటికీ మరచిపోలేను. హైదరాబాదులో ఒక పుస్తకాల దుకాణంలో అనుకో కుండా దొరికిన నా పుస్తకం ‘డెవిల్ ఆన్ ది క్రాస్’ తన జీవితం మీద ఎంత ప్రభావం వేసిందో తాను చెప్పడం నాకింకా గుర్తుంది. నేను ఆ నవలను కెన్యాలోని కామిటి మాగ్జిమమ్ సెక్యూరిటీ జైలులో 1978లో టాయిలెట్ పేపర్ మీద రాశాను. నా పుస్తకాల్లో మరొకదాన్ని (యుద్ధకాలంలో స్వప్నాలు) అదే సాయిబాబా మహారాష్ట్రలోని నాగపూర్ హై సెక్యూరిటీ జైలులో ఖైదీగా ఉండి అనువాదం చేయడం ఎంత చారిత్రక వైచిత్రి! దుర్భరమైన పరిస్థితులో అనువాదం చేయడం! ఆయన తన జీవిత, సాంస్కృతిక కార్యాచరణ కోసం జైలుజీవితం గడుపుతున్నాడంటే నాకు ఆయనతో ఇప్పుడు, మరొకసారి, ఒక ప్రత్యేకమైన బంధం ఉందనిపిస్తుంది’’. ఆ బంధం వల్లనే, ప్రపంచవ్యాప్తంగా సాయిబాబా అతని సహచర ఖైదీలు, ఇతర రాజకీయ ఖైదీల విడుదల కోసం, నిర్బంధాలు లేని, వ్యవస్థ కోసం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న సంఘీభావ పోరాటంలో తన వంతు కర్తవ్యంగా గూగీ వా థియాంగో ఈ ఫిబ్రవరి 18న జి.ఎన్. సాయిబాబా అనువదించిన తన పుస్తకావిష్కరణ సభలో పాల్గొనడానికి హైదరాబాదుకు వస్తున్నాడు. కానీ మన మధ్యన మన భాషలో గూగీ యుద్ధకాలపు బాల్య జ్ఞాపకాలు వివరించిన సాయిబాబా ఉండకపోవచ్చు. తానాశించినట్లుగా నాగపూర్‌కు వెళ్లి గూగీ సాయిబాబాను కలు సుకోలేక పోవచ్చు. ఇప్పటికీ ఇరువురి భావజాలంతో పెనవేసుకొని సుదృఢమవుతున్న మన స్వేచ్ఛాకాంక్షల్ని పంచుకోవడానికి ఒక సాహిత్య, సాంస్కృతిక పోరాట సాయంత్రం కలుసుకుందాం. ముఖ్యంగా ఈ బాధ్యత మనపై ఎందుకుందో తాను జైలులో బందీ అయిన రోజుల్లోనే 1978లో, కార్ల్‌మార్క్స్ మాటల్లో చెప్పాడు. అవి కార్ల్ల్ మార్క్స్‌కు ఒక కార్మిక ప్రతినిధి రాసినవి. కార్ల్‌మార్క్స్ 25 ఆగస్టు 1852 న్యూయార్క్ డెయిలీ ట్రిబ్యూన్‌కు చేసిన రచనలో ఉల్లేఖించాడు. ‘‘నేను నీ హక్కుల్ని విస్తృతపరచడానికి ప్రయత్నించాను. కాబట్టే నా హక్కుల్ని హరించారు. మీ అందరికోసం స్వేచ్ఛామందిరాన్ని నిర్మిం చాలని ప్రయత్నించాను. కాబట్టే నన్ను హంతకుణ్ణి చేసి జైల్లోకి తోసేశారు, నేను సత్యానికి స్వరాన్ని ఇవ్వడానికి ప్రయత్నించాను. కాబట్టి నన్ను నిశ్శబ్దంలోకి తోసివేశారు. జైల్లో ఒంటరి నిర్బంధంలో నిశ్శబ్ద వ్యవస్థలో ఉంచారు. నువ్వు ఇది ప్రజా సంబంధమైన సమస్య కాదనవచ్చు. కానీ ఇది అయితీరుతుంది. ఎందుకంటే ఖైదీ భార్య గురించి పట్టించుకోని మనిషి కార్మికుని భార్య గురించి కూడ పట్టించుకోడు. బంధితుని పిల్లల గురించి వ్యగ్రత చూపనివాడు శ్రామిక సేవకుని పిల్లల గురించి కూడ వ్యగ్రత చూపడు. అందువల్ల ఇది ప్రజాసమస్య. (గూగీ వా థియాంగో జైలు డైరీ ‘బందీ’ జైలు నోట్స్ నుంచి) (ప్రొఫెసర్ జి.ఎన్. సాయిబాబా అనువదించిన గూగీ వా థియాంగో ‘యుద్ధకాలంలో స్వప్నాలు’ పుస్తకాన్ని హైదరాబాదు, తెలుగు విశ్వవిద్యాలయంలో రేపు సాయంత్రం 5.30 గంటలకు ఆవిష్కరిస్తారు) వ్యాసకర్త విరసం వ్యవస్థాపక సభ్యులు వరవరరావు -
యువతరం గుండెల్లో నిలిచిన 'వివేక్': వరవరరావు
సూర్యాపేట (నల్లగొండ): వివేక్ యువతరం గుండెల్లో చిరకాలంగా నిలిచిపోయాడని, తమ కుటుంబంలో వీరన్న, ఎమ్మెస్సార్‌లా మెలిగాడని విప్లవ ప్రజాస్వామ్య ఫ్రంట్ (ఆర్డీఎఫ్) జాతీయ అధ్యక్షుడు, విరసం నేత వరవరరావు తెలిపారు. ఆదివారం నల్లగొండ జిల్లా సూర్యాపేట పట్టణంలో ఆయన ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్లో చనిపోయిన వివేక్ మృతదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన భావోద్వేగంతో కన్నీరు పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ కరీంనగర్‌కు చెందిన నల్లా ఆదిరెడ్డే అంటే వివేక్ కు ఎంతో ఆదర్శమని.. అతని పేరునే తనకు అలియాస్ రఘుగా పెట్టి పిలవాలని.. కోరినట్లు తెలిపారు. వివేక్ మేధావి కాబట్టే సమ సమాజ నిర్మాణం కోసం దళ సభ్యునిగా కొనసాగుతూ.. లంకపల్లి గ్రామంలోని ఆదివాసీల గుండెల్లో చెరగని ముద్రవేసుకున్నారని తెలిపారు. శుక్రవారం ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీల సమస్యలను తెలుసుకొని తిరిగి వస్తుండగా పోలీసులు ఎన్కౌంటర్లో చంపారని తెలిపారు. వివేక్ అంతిమయాత్ర.. పట్టణంలోని భగత్‌సింగ్‌నగర్‌లోని వివేక్ అలియాస్ రఘు నివాసం నుంచి చేపట్టిన అంతిమయాత్రలో విప్లవయోధులు, ప్రజలు లాల్ సలాం పలికారు. వివేక్ మృతదేహం వద్ద పలువురు ఆలపించిన విప్లవ గేయాలు అందరినీ కంటతడి పెట్టించాయి. వివేక్ అంతిమయాత్రలో విరసం నేత వరవరరావు ముందుభాగంలో నిలిచారు. వివేక్‌కు నివాళులర్పించిన వారిలో ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాల, ఆయా పార్టీల నాయకులు ఉన్నారు.