శంకర్రామన్ హత్య కేసులో నేడు తుది తీర్పు
కాంచీపురంలోని వరదారాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ హత్య కేసుకు సంబంధించిన పుదుచ్చేరి జిల్లా కోర్టు బుధవారం ఉదయం 11.00 గంటలకు తన తీర్పును వెలువరించనుంది. శంకర్రామన్ హత్య కేసులో కంచి పీఠాధిపతి జయేంద్ర సరస్వతి, విజయేంద్ర సరస్వతి సహా 23 మంది ఆ కేసులో నిందితులుగా ఉన్నారు. వారంతా ఇప్పటికికే పుదుచ్చెరి చేరుకున్నారు. శంకర్రామన్ హత్య కేసులో కోర్టు తీర్పు నేడు వెలువడనున్న నేపథ్యంలో దేశ ప్రజలంతా ఆసక్తితో ఎదురు చేస్తున్నారు.
2004లో సెప్టెంబర్3న కాంచీపురంలోని వరదాజ పెరుమాళ్ ఆలయం మేనేజర్ శంకర్రామన్ ఆలయ ప్రాంగణంలో అత్యంత దారుణంగా హత్య కావించబడ్డారు. దాంతో ఆ హత్య దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించింది. ఆ హత్యలో కంచి పీఠాధిపతులు పాత్ర ఉందని ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో కంచి పీఠాధిపతులు జయేంద్ర, విజయేంద్ర సరస్వతులతోపాటు పలువురిపై వివిధ సెక్షన్ల కింద నిందితులుగా కేసులు నమోదుయ్యాయి. కంచీపురం జిల్లాలోని చెంగల్పట్లు కోర్టు ఈ కేసు విచారణ చేపట్టింది.
అయితే శంకరామన్ హత్య కేసు స్వేచ్ఛగా, నిష్పక్షపాతమైన విచారణ తమిళనాడులో సాధ్యం కాదని జయేంద్ర సరస్వతి అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దాంతో శంకర్రామన్ హత్య కేసును సుప్రీంకోర్టు పుదుచ్చేరి జిల్లా సెషన్స్ కోర్టుకు బదిలి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి పుదువై కోర్టు 9 సంవత్సరాల పాటు 189 మంది సాక్షులను విచారించారు. విచారణ పూర్తి కావటంలో ఈ హత్య కేసుకు సంబంధించిన తీర్పును పుదుచ్చేరి జిల్లా కోర్టు జడ్జి బుధవారం వెలువరించనున్నారు.