varahapatnam
-
ఉపాధి పనులు కల్పించండి
► కైకలూరు ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడించిన కూలీలు కైకలూరు : ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ స్వగ్రామం వరహాపట్నంతో పాటు సమీప గ్రామాల్లోనూ పూర్తిస్థాయి ఉపాధి పనులు ఉండటం లేదని వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు కైకలూరు ఎంపీడీవో కార్యాలయం వద్ద సోమవారం ఆందోళన చేశారు. రాచపట్నం, చింతలచెరువు, గోపవరం గ్రామాలకు చెందిన ఉపాధిహామీ పథకం మేట్లు, కూలీలు ఆందోళనలో పాల్గొన్నారు. ఎంపీడీవో కార్యాలయం నుంచి బయటకు వచ్చి సమాధానం ఇవ్వాలని పట్టుబట్టారు. గ్రూపులకు కేవలం ఆరు రోజులు పని మాత్రమే కల్పిస్తున్నారన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం తూర్పు కృష్ణా కార్యదర్శి మురాల రాజేష్ మాట్లాడుతూ సీఎం చంద్రబాబు ఉపాధిహామీ నిధులను గృహనిర్మాణాలకు కేటాయిస్తున్నారని వాపోయారు. పని కోసం ఎవరైనా జాబ్‌కార్డుతో దరఖాస్తు చేసుకుంటే 14 రోజుల్లో పని కేటాయించాలన్నారు. అలా జరగకపోతే ఉపాధి చట్టం ప్రకారం సదరు వ్యక్తికి కూలి డబ్బులు చెల్లించాలని చెప్పారు. ఆందోళన తీవ్రమవ్వడంతో ఇన్చార్జి ఎంపీడీవో పార్థసారథి బయటకు వచ్చి కూలీలతో మాట్లాడారు. సోషల్ ఆడిట్ కారణంగా పనులు కేటాయింపు ఆలస్యమైందన్నారు. మండలంలో 20 గ్రామాల్లో పనులు జరుగుతున్నాయన్నారు. జాబ్ కార్డు, ఆధార్ నంబరు నమోదు కాకపోతే ఖాతాలో నగదు జమ కాదన్నారు. చేసిన పని కొలతలు ఖచ్చితంగా ఉంటేనే నగదు కేటాయిస్తారని తెలిపారు. రాచపట్నంలో 6000 పని దినాలు చేసుకునే పనులు ఉన్నాయన్నారు. ఈ సమయంలో వ్యవసాయ కార్మిక సంఘ నాయకులు మాట్లాడుతూ కైకలూరు మండలంలో కేవలం 7 గ్రామాల్లో మాత్రమే పనులు జరుగుతున్నాయన్నారు. పూర్తి స్థాయిలో అందరికీ పనులు కేటాయించాలన్నారు. ఉపాధి హామీ పథకంలో సిబ్బంది కొరత కారణంగా పనులు ఆలస్యం అవుతున్నాయన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం కైకలూరు, కలిదిండి నాయకులు కురేళ్ల లాజర్, డి.టి.మూర్తి చైతన్య, ఉపాధి హామీ పథకం టెక్నికల్ అసిస్టెంట్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. -
కరెంటు కోతలు లేని ప్రభుత్వం ఇది
వరహాపట్నం (కైకలూరు) : గతంలో కరెంటు కోతలతో ప్రజలు ఇబ్బందులు పడేవారని, నేడు కోతలు లేని గ్రామాలను చూస్తున్నారని ఎమ్మెల్యే, రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ అన్నారు. ఆయన స్వగ్రామైన వరహాపట్నంలో దీన్ దయాల్ ఉపాధ్యాయ గ్రామీణ జ్యోతి యోజన పథకంలో రూ.కోటీ 20 లక్షలతో మంజూరైన 33/11కెవీ విద్యుత్ సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ ఇక్కడ నిర్మించే సబ్‌స్టేషన్ వల్ల 14 గ్రామాలకు మేలు జరుగుతుందన్నారు. అక్వా చేపల రైతు సాగుదారులకు సబ్‌స్టేషన్ నుంచి నాణ్యమైన కరెంటు అందుతుందన్నారు. ఇంటి అవసరాల నిమిత్తం మట్టిని తరలించే వాహనాలపై చర్యలు వద్దని పోలీసులకు సూచించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పళ్ళెం సరవమ్మ, ఎంపీటీసీ జయదేవ్‌కుమార్, కైకలూరు, కలిదిండి ఏఎంసీ చైర్మన్లు వీరరాజరాజేశ్వరీ, తాడినాడ బాబు, టీడీపీ నాయకులు గుర్రాజు, త్రినాథరాజు, విజయవాడ ఆపరేషన్ ఎస్ఈ ఎం.విజయ్‌కుమార్, గుడివాడ డీఈఈ కేవీఎస్.సూర్యనారాయణ, కైకలూరు ఏడీఈ జీబీ.శ్రీనివాసరావు, కైకలూరు రూరల్ ఏఈ బి.లక్ష్మానాయక్‌లు పాల్గొన్నారు. క్రిస్మస్ సరుకులు పంపిణీ కైకలూరులో క్యాంపు కార్యాలయం వద్ద చంద్రన్న క్రిస్మస్ కానుక సరుకులను మంగళవారం మంత్రి శ్రీనివాస్ అందించారు. క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇద్దరికి సీఎం రిలీఫ్ ఫండ్‌ను అందించారు. కార్యక్రమంలో ఎంపీపీ బండి సత్యవతి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వేంపాటి విష్ణురావు, సర్పంచ్ నర్సిపల్లి అప్పారావు, గుడివాడ ఆర్డీవో చక్రపాణి, కైకలూరు తహశీల్దారు శ్రీనునాయక్, రేషన్ డీలర్లు పాల్గొన్నారు. 20కెకెఎల్‌ఆర్06–27040006– వరహాపట్నంలో సబ్‌స్టేషన్‌కు శంకుస్థాపన చేస్తున్న మంత్రి కామినేని