వాసవీ బ్యాంకు డిపాజిటర్లకు చెల్లింపులు
హైదరాబాద్: వాసవీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు డిపాజిటర్లకు గురువారం చెల్లింపులు జరిగాయి. డిపాజిట్ దార్లకు వారు డిపాజిట్ చేసిన మొత్తం, డిపాజిట్ నుంచి ఈక్విటీ షేర్హోల్డర్లకు మారిన వారికి, ఇతర సంస్థల డిపాజిటర్లకు (పి.డి.ఐ) మొత్తంలో ఐదు శాతం చెల్లింపులు చేస్తున్నట్టు డిప్యూటీ రిజిస్ట్రార్ ఎన్.వేణుగోపాల్‌శర్మ తెలిపారు. గురువారం మలక్‌పేటలోని బ్యాంకులో రూ.లక్ష పైన డిపాజిట్ దార్లకు నగదు చెల్లింపులు చేశారు. ఈ సందర్భంగా చిత్తూర్టౌన్ బ్యాంకుకు రూ.71 లక్షలు, భీమవరం అర్బన్‌బ్యాంకుకు రూ. 62 లక్షలు, విజయనగరం బ్యాంకుకు రూ.20 లక్షలు, వైజాగ్ బ్యాంకుకు రూ. 20 లక్షలు, ఇతర వ్యక్తిగత డిపాజిటర్లకు ఆయన చెక్కులను అందజేశారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ... రుణగ్రహీతలపై కఠిన చర్యలు చేపట్టి రికవరీలు పెంచడానికి ప్రయత్నం చేస్తున్నామని తెలిపారు. కోర్టు కేసుల వలన ఆగిన వాటిపై దృష్టి పెట్టినట్టు చెప్పారు. ఇప్పటి వరకు రూ. 10 కోట్లు చెల్లింపులు చేశామని, ఈ విడత రూ.7 కోట్లు చెల్లింపులు చేస్తున్నామని తెలిపారు. డిసాజిటర్లు మే 31లోగా మలక్‌పేటలోని ప్రధాన కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. కాగా, జూన్ 1 నుంచి సికింద్రాబాద్‌లోని ఎంజీఎం రోడ్డు శాఖ నుంచి బ్యాంకు కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు.