VAT hike
-
వినియోగదారులకు మరో బురిడీ
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు 20 ఏళ్ల కనిష్ట స్థాయికి పడిపోగా, ఆ ప్రయోజనాన్ని మన ప్రభుత్వాలు వినియోగదారులకు చేరనివ్వడం లేదు. సొంత ఖజానాలో జమ చేసుకుంటున్నాయి. ముడి చమురు ధరలు తగ్గితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గాల్సింది పోయి కొన్ని రాష్ట్రాల్లో పెరిగాయి. పెట్రోల్, డీజిల్‌పై కేంద్రం తాజాగా ఎక్సైజ్ సుంకం పెంచగా, కొన్ని రాష్ట్రాలు విలువ ఆధారిత పన్ను(వ్యాట్) పెంచాయి. లీటర్ పెట్రోల్‌పై రూ.10, లీటర్ డీజిల్‌పై రూ.13 చొప్పున కేంద్రం ఎక్సైజ్ సుంకం పెంచింది. పెట్రోల్, డీజిల్ మొత్తం ధరలో పన్నుల వాటా 70 శాతానికి చేరింది. ఈ పెంపుతో ఈ ఆర్థిక సంవత్సరంలో కేంద్రానికి దాదాపు రూ.1.6 లక్షల కోట్ల అదనపు ఆదాయం రానుంది. ప్రస్తుతం ఎక్సైజ్ సుంకం పెంచినప్పటికీ వినియోగదారులపై ఎలాంటి ప్రభావంపడదు. ఇప్పుడున్న పెట్రోల్, డీజిల్ ధరల్లో మార్పు ఉండదు. అంతర్జాతీయంగా ముడి చమురు ధర పడిపోయింది. ఆ లాభాన్ని పొందుతున్న ఆయిల్ కంపెనీల నుంచి ఎక్సైజ్ సుంకాన్ని కేంద్రం వసూలు చేయనుంది. రెండు నెలల కంటే తక్కువ వ్యవధిలో పెట్రోల్, డీజిల్‌పై ఎక్సైజ్ సుంకం పెంచడం ఇది రెండోసారి. సుంకాన్ని కేంద్రం పెంచకపోయి ఉంటే చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలు కొంతైనా తగ్గించేందుకు ఆస్కారం ఉండేది. దాంతో వినియోగదారులకు ప్రయోజనం చేకూరేది. రాష్ట్రాల నిర్వాకం పెట్రోల్, డీజిల్‌పై ఢిల్లీ ప్రభుత్వం వ్యాట్‌ను పెంచేసింది. దీంతో అక్కడ పెట్రోల్ ధర లీటర్‌కు రూ.1.67, డీజిల్ ధర రూ.7.10 చొప్పున పెరిగింది. దీనివల్ల ఢిల్లీ సర్కారుకు రూ.700 కోట్ల అదనపు ఆదాయం రానుంది. తమిళనాడు ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్ పెంచేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఈ పెంపు ద్వారా రూ.2,500 కోట్లు ఆర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. హరియాణా సర్కారు సైతం పెట్రోల్‌పై రూపాయి, డీజిల్‌పై రూ.1.1 చొప్పున వ్యాట్‌ను పెంచింది. మహారాష్ట్ర, కర్ణాటక, పశ్చిమబెంగాల్ ప్రభుత్వాలు ఇప్పటికే వ్యాట్‌ను పెంచాయి. ధరల పెంపును వెనక్కి తీసుకోవాలి: రాహుల్ గాంధీ ప్రజలను ఆదుకోవాల్సిన కేంద్ర ప్రభుత్వం వారిపై మరింత భారం మోపుతోందని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ సభ్యుడు రాహుల్ గాంధీ మండిపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచడం దారుణమని ధ్వజమెత్తారు. ఈ మేరకు బుధవారం హిందీ భాషలో ట్వీట్ చేశారు. ఈ ధరల పెంపును వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
పెట్రో వాత : అక్కడ పెట్రోలు ధర రూ. 2 పెంపు
సాక్షి,ముంబై : కరోనా వైరస్ , లాక్ డౌన్ సంక్షోభంతో అంతర్జాతీయ చమురు ధరలు దిగి వస్తోంటే.. మరోవైపు దేశంలోని పలు రాష్ట్రాలు పెట్రో వాతకు సిద్ధమవుతున్నాయి. ఈ కోవలో ఇప్పటికే వ్యాట్ పెంపుతో ఢిల్లీ పెట్రోలు, డీజిల్ ధరలను భారీగా పెంచి వాహనదారులకు షాకిచ్చింది. తాజాగా ఉత్తరప్రదేశ్, పంజాబ్ రాష్ట్రాలు ఇంధన ధరలను పెంచేశాయి. (పెట్రోపై పన్ను బాదుడు) పంజాబ్ ప్రభుత్వ వ్యాట్ పెంపు నిర్ణయంతో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలు రూ .2 చొప్పున పెరుగనున్నాయి. డీజిల్‌పై విలువ ఆధారిత పన్ను (వ్యాట్) 11.80 శాతం నుంచి 15.15 శాతానికి, పెట్రోల్ పై 20.11 శాతం నుంచి 23.30 శాతానికి పెంచినట్లు పంజాబ్ అధికారి తెలిపారు. ఈ అర్థరాత్రి నుంచి సవరించిన ధరలు అమల్లోకి వస్తాయి. పెట్రోల్ రిటైల్ రేటు లీటరుకు రూ .70.38 నుండి 72.43 కు పెరుగుతుంది, డీజిల్ రేటు లీటరుకు 62.02 నుండి 64.06 రూపాయలకు పెరగనుంది. మరోవైపు ఈ నిర్ణయంపై పంజాబ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. పెట్రోలియం డీలర్ల ప్రయోజనాలకు వ్యతిరేకంగా తీసుకున్న ఈ నిర్ణయం ఇంధన అక్రమ రవాణాను ప్రోత్సహిస్తుందని అసోసియేషన్ ప్రతినిధి అశ్విందర్ మొంగియా ఆరోపించారు. వ్యాట్ పెరిగిన తరువాత, చండీగడ్ తో పోలిస్తే పంజాబ్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు వరుసగా రూ.6.61, రూ .4.86 ఎక్కువ పెరగనున్నాయి. చండీగఢ్ లో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా రూ.65.82, రూ .59.30 గా ఉన్నాయి. లక్నోలో ప్రస్తుత ధర పెట్రోలు లీటరుకు రూ. 71.92 గాను, డీజిల్ ధర రూ. 62.87 గా వుంది. ఇక ఉత్తరప్రదేశ్ లో కూడా పెట్రోలు ధరలు మోత మోగనున్నాయి. పెట్రోలు ధర రూ. 2 లు, డీజిల్ పై రూ .1 చొప్పున పెరగనుంది. వ్యాట్ పెంపుతో సవరించిన ధరలు ఈ రోజు (బుధవారం) అర్ధరాత్రి నుండి వర్తిస్తాయని ఉత్తరప్రదేశ్ ఆర్థిక మంత్రి సురేష్ ఖన్నా వెల్లడించారు. (హెచ్1బీ ఉద్యోగుల వేతనాలపై షాకింగ్ రిపోర్టు ) -
పెట్రో ధరలకు వ్యాట్ షాక్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరంలో పెట్రో ధరలు ఒక్కసారిగా పుంజుకున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం విలువ ఆధారిత పన్ను (వ్యాట్) పెంచిన దాదాపు 50 రోజుల తరువాత మంగళవారం పెట్రోల్ ధర లీటరుకు రూ. 1.67లు పెరగ్గా, డీజిల్ ధర ఒక్కసారిగా రూ. 7.10 పెరిగింది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ అధికారిక వెబ్సైట్ ప్రకారం సోమవారం రూ .69.59 పలికిన లీటరు పెట్రోలు ధర ప్రస్తుతం రూ .71.26 పలుకుతోంది. అలాగే సోమవారం నాటి డీజిల్ ధర రూ .62.29 నుంచి రూ .69.29 కు పెరిగింది. చెన్నైలో కూడా పెట్రోల్ రూ .3.26 పెరిగింది. లీటరు పెట్రోలు ధర రూ. 75.54 డీజిల్ ధర 68.22 రూపాయలు పలుకుతోంది. రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన వ్యాట్ పెరుగుదల కారణంగా అసోం, హర్యానా, నాగాలాండ్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్లో కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. అయితే ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలు మారలేదు. ముంబైలో పెట్రోల్ లీటరు ధర రూ .76.31, డీజిల్ ధర లీటరుకు రూ. 66.21 గా వుంది. కోల్‌కతాలో, పెట్రోల్ ధర లీటరుకు 73.30 రూపాయలు కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 65.62. అటు హైదరాబాద్, అమరావతిలో పెట్రోల్, డీజిల్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 73.97 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 67.82 అమరావతిలో పెట్రోల్ ధర లీటరుకు రూ.74.61 కాగా, డీజిల్ ధర లీటరుకు రూ. 68. 52 సాధారణంగా పెట్రోల్, డీజిల్ ధరలు ప్రతి రోజు మారుతూ వుంటాయి. విదేశీ మారకపు రేటుతో ప్రపంచ మార్కెట్లో ముడి చమురు ధరల ఆధారంగా ప్రతి రోజు పెట్రోల్, డీజిల్ ధరల సవరణ వుంటుంది. -
వ్యాట్ వాత!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెరగనున్నాయి. ఇతర అంశాలెలా ఉన్నా.. ఈ విషయంలో మాత్రం పొరుగు రాష్ట్రం తెలంగాణ సహా పలు ఇతర రాష్ట్రాలను చంద్రబాబు ప్రభుత్వం అనుసరించనుంది. గత ఐదు నెలలుగా చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తుండటంతో ఎంతోకొంత సంతోషంగా ఉన్న వాహనదారులను నిరాశకు గురిచేయనుంది. పెట్రోల్, డీజిల్ అమ్మకాలపై ప్రస్తుతం విధిస్తున్న వ్యాట్‌ను.. వాటి ధర ల్లో లీటర్‌కు రూ.2 చొప్పున పెంపునకు ప్రభుత్వం భావిస్తోంది. తద్వారా ఖజానాకు నెలకు రూ.100 కోట్లకు పైగానే ఆదాయం సమకూరనుంది. వ్యాట్ పెంపు పరిశీలనలో ఉన్నట్లు ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వల్ల వ్యాట్ రూపంలో రాష్ట్రానికి రావాల్సిన ఆదాయంలో రూ.400 కోట్ల మేర నష్టం వస్తోందని చెప్పారు. డీజిల్, పెట్రోల్ ధరలు తగ్గినప్పటికీ కేంద్ర ప్రభుత్వమే లీటర్‌పై రెండు శాతం చొప్పున సెస్ విధించిందని, తెలంగాణ సహా పలు రాష్ట్రాలు కూడా డీజిల్, పెట్రోల్‌పై ఇటీవల వ్యాట్‌ను పెంచాయని చెప్పుకొచ్చారు. జీతాలకు కూడా డబ్బులు లేవంటున్నారనే ప్రశ్నకు స్పందిస్తూ జీతాలిస్తామని, వేస్ అండ్ మీన్స్ (ఆర్బీఐ నుంచి చేబదులు)కు, అప్పులకు వెళ్తామని అన్నారు.ఉద్యోగ సంఘాల ప్రతినిధులు ఏకంగా 69 శాతం ఫిట్మెంట్ కావాలని డిమాండ్ చేశారన్నారు. దీంతో ఆర్థిక పరిస్థితి బాగోలేదని, అర్థం చేసుకోవాలని చెప్పామన్నారు. కాగా వచ్చే అర్థిక సంవత్సరం బడ్జెట్‌పై ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు అన్ని శాఖల మంత్రులు, అధికారులతో సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు. మార్చి తొలి వారంలో అసెంబ్లీ సమావేశమవుతుందని తెలిపారు.