ఏయూలో రెండు కొత్త కోర్సులు
ఏయూక్యాంపస్: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఏయూ వాణిజ్య నిర్వహణ విభాగం రెండు నూతన కోర్సులను ప్రారంభించనుందని ఏయూ ఉప కులపతి ఆచార్య గొల్లపల్లి నాగేశ్వరరావు చెప్పారు. మంగళవారం హైదరాబాదులో జరిగిన ఫిన్టెక్ సమావేశంలో చర్చించిన ఆంశాలను బుధవారం ఆయన వెల్లడించారు. బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, క్యాపిటల్ మార్కెట్, కార్డ్స్, పేమెంట్స్ రంగాల అవసరాలను తీర్చే దిశగా విద్యార్థులను తయారు చేయడానికి సమావేశంలో చర్చించామన్నారు. దీనిలో భాగంగా ఏయూ డీసీఎంఎస్ విభాగంలో రెండు సంవత్సరాల పీజీ కోర్సు, ఏడాది కాలవ్యవధి కలిగిన పీజీ డిప్లమో కోర్సులను నిర్వహించడం జరుగుతుందన్నారు. పీజీ కోర్సులో ఎనిమిది నెలలు వర్సిటీలో బోధన, మరో ఎనిమిది నెలలు పారిశ్రామిక నిపుణుల సహకారంతో బోధన, చివరి ఎనిమిది నెలలు పూర్తిగా పరిశ్రమలో ప్రత్యక్ష శిక్షణ అందిస్తామన్నారు. ఏడాది కోర్సులో ఆరు నెలలు వర్సిటీలో బోధన, మిగిలిన ఆరు నెలలు పరిశ్రమలో బోధన జరుగుతుందన్నారు. సమావేశానికి ప్రముఖ విత్త నిర్వహణ సంస్థలు బ్రాడ్రిడ్జ్, సైకుల్, థామస్ రాయిటర్స్, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, హెచ్ఎస్బీసీ, క్యాపిటల్ ఐక్యూ, భారతీ ఏక్సా, వెల్స్ ఫార్గో వంటి సంస్థల ఉన్నతాధికారులు పాల్గొని వారి సమస్యలను వివరించారన్నారు. ప్రధానంగా సాంకేతిక ఉపయోగాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్ధిక రంగాన్ని వద్ధి చేయడం లక్ష్యంగా ఈ సమావేశం జరిగిందన్నారు.