అర‘వీర’ అక్రమార్కుడు
ఎన్నెమ్మార్ నుంచి ఏఈఈ స్థాయికి..
అదే స్థాయిలో అక్రమాస్తులు
ఏఈఈ ఆస్తులపై ఏకకాలంలో ఏసీబీ సోదాలు
రూ.1.50 కోట్ల ఆస్తులు స్వాధీనం
బహిరంగ మార్కెట్లో వాటి విలువ రూ.15 కోట్ల పైమాటే
ద్వారకానగర్: బుధవారం తెల్లవారు జామున.. 5 గంటల ప్రాంతంలో.. కొందరు వ్యక్తులు దసపల్లా హిల్స్‌లోని సాయిమహరాజ్ అపార్ట్‌మెంట్‌కు వెళ్లారు. ఫ్లాట్ నెం. 502 తలుపు తట్టారు. తలుపు తీసిన ఇంట్లోని వ్యక్తులు వచ్చిన వ్యక్తులు ఏసీబీ అధికారులని తెలుసుకుని గతుక్కుమన్నారు. వారు సర్దుకునేలోపే అధికారుల బందం తమ పని మొదలుపెట్టేసింది. జీవీఎంసీ జోన్–2 ఏఈఈ(అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్) వీరమాధవరావుకు చెందిన ఆ ఇంట్లో సోదాలు ప్రారంభించింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ముందస్తు ప్లాన్ ప్రకారం ఏసీబీ అధికారులు వీరమాధవరావు ఇంటితోపాటు నగరం, జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఉన్న ఆయన బంధువులు, కుటుంబ సభ్యులతోపాటు, డ్రైవర్ ఇళ్లలోనూ ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. డాబాగార్డెన్స్, ఎండాడ, దసపల్లా, పెందుర్తి, పి.ఎం.పాలెం, భీమిలి, దేవరాపల్లితో పాటు పలు ప్రాంతాల్లో జరిపిన ఈ సోదాల్లో కళ్లు చెదిరే ఆస్తులు, విలువైన డాక్యుమెంట్లు లభించాయి.
ఆస్తుల వివరాలు
ఈ తనిఖీల్లో కోట్ల రూపాయల విలువైన ఆస్తులతో పాటు బంగారం, వెండి ఆభరణాలు, నగదు, ఇళ్లు, స్థలాలకు చెందిన పత్రాలు బయటపడ్డాయి. సాయంత్రం వరకు జరిపిన సోదాల్లో ప్రభుత్వ లెక్కల ప్రకారం రూ. 1.5 కోట్ల విలువైన ఆక్రమ ఆస్తులు గుర్తించారు. వెతుకుతున్న కొద్దీ ఆస్తులు బయటపడుతున్నాయని దాడులకు నాయకత్వం వహించిన ఏసీబీ డీఎస్పీ కె.రామకష్ణప్రసాద్ చెప్పారు. ఆయన చెప్పిన వివరాల ప్రకారం.. మాధవరావుకు డాబాగార్డెన్స్‌లో మూడు జీ+2, ఒక జీ+1 భవనాలు ఉన్నాయి. దేవరాపల్లి మండలం ఈతంపేటలో 8 ఎకరాల పామాయిల్ తోట, పెందుర్తి ఎస్వీఎల్ఎన్ టవర్స్‌లో ఒక ఫ్లాట్, ఎండాడలో ఒక ప్లాటు, భీమిలి మండలం కొత్తవలస 500 గజాలు, భీమిలిలో 300 గజాలు, చీమలాపల్లిలో 187 గజాలు, డాబాగార్డెన్స్‌లో 145 గజాలు, దేవరాపల్లి మండలం తాడువాయిలో 50 సెంట్ల స్థలాలు ఉన్నట్లు లభించిన డాక్యుమెంట్లను బట్టి తేలింది. అలాగే ఒక ఫోర్డు కారు, 20 తులాల బంగారం, ఆర కేజీ వెండితో పాటు రూ. 50 వేల నగదు సోదాల్లో లభించాయి. దొండపర్తి ఆంధ్రా బ్యాంక్‌కు చెందిన లాకర్ తాళాలు, మాధవరావు కుమార్తె పేరుతో పి.ఎం.పాలెంలోని కెనరా బ్యాంక్ లాకర్‌కు సంబంధించి తాళాలు లభించాయి. మాధవరావు డ్రైవర్ ఇంట్లో ఎస్వీఎన్ఎల్ టవర్స్‌లోని ఫ్లాట్‌కు చెందిన పత్రాలు స్వాధీనపరుచుకున్నారు. ఇప్పటివరకు వేసిన లెక్కల ప్రకారం ఈ ఆస్తుల విలువ సుమారు రూ. 1.50 కోట్లు ఉంటుందని డీఎస్పీ తెలిపారు. అయితే బహిరంగ మార్కెట్లో వీటి విలువ రూ. 15 కోట్లపైగా ఉంటుందని చెప్పారు. మాధవరావుకు ఇంకా ఎక్కడెక్కడ ఆస్తులు ఉన్నాయన్నది ఏసీబీ అధికారులు ఆరా తీస్తున్నారు.
ఎన్నెమ్మార్ స్థాయి నుంచి..
కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టిన మాధవరావు స్వస్థలం విశాఖ నగరమే. స్థానిక సింగ్ హోటల్ జంక్షన్‌కు చెందిన ఆయన 1987లో సాధారణ ఎన్నెమ్మార్గా జీవీఎంసీలో ఉద్యోగ జీవితం ప్రారంభించారు. డిపో్లమా చేసి 1997లో వర్క్ ఇన్స్పెక్టర్ ఉద్యో గం పొందారు. 2005–06లో బీఈ చేసి అసిస్టెంట్ ఇంజినీర్ హోదా పొందారు. తరువాత బిల్డింగ్ ఇన్స్పెక్టర్గా ఐదేళ్లు చేసిన అనంతరం ప్రస్తుతం వర్క్స్ ఏఈఈగా పని చేస్తున్నారు.
అగ్రిగోల్డ్ డైరెక్టర్‌గానూ..
ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ఇతర ఏ సంస్థల్లోనూ పని చేయరాదు. కానీ వీరమాధవరావు. కొంతకాలం క్రితం ఖాతాదారులకు టోపీ పెట్టి మూతపడిన అగ్రిగోల్ట్ సంస్థలో డైరెక్టర్‌గా కూడా చేసినట్లు ఆధారాలు లభించాయి. దానికి సంబంధించిన గుర్తింపు కార్డు ఏసీబీ సోదాల్లో దొరికింది. అలాగే చిట్టీలు నిర్వహిస్తున్నట్లు కూడా తెలిసింది.