ఐక్యతే వీరశైవులకు బలం
- వీరశైవుల మహాసభలో శ్రీశైలం పీఠాధిపతి శివాచార్య మహాస్వామి
మడకశిర : వీరశైవులకు ఐక్యతే బలమని శ్రీశైలం పీఠాధిపతి, డాక్టర్ చెన్న సిద్ధరామ పండితారాధ్య శివాచార్య మహాస్వామి తెలిపారు. మడకశిరలో బుధవారం టీటీడీ కళ్యాణ మండపంలో అఖిల భారత వీరశైవ మహాసభ జరిగింది. ముందుగా పట్టణంలో నిర్వహించిన ఊరేగింపులో మహాస్వామిని వెండిరథంపై కళ్యాణ మండపం వరకు తీసుకొచ్చారు. 108 మంది మహిళలు పూర్ణకుంభాలతో ఽఈ ఊరేగింపులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో మహాస్వామి మాట్లాడుతూ సమైక్యంగా ఉంటేనే వీరశైవలు అన్ని విధాలుగా బలపడుతారని చెప్పారు.
10 వేల మందికి పైకా సభకు హాజరవడం సంతోషంగా ఉందన్నారు. మహాసభకు అధ్యక్షత వహించిన వీరశైవుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కృషితోనే వీరశైవులను బీసీలుగా గుర్తించారని అనగానే సభికులు చప్పట్లు కొట్టి ఈలలు వేశారు. వీరశైవులంతా సమైక్యంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. స్థానిక మాజీ ఎమ్మెల్యే కే సుధాకర్ మాట్లాడుతూ ఐక్యతతోనే ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుందని తెలిపారు. మాజీ మంత్రి నర్సేగౌడ్ మాట్లాడుతూ వీరశైవులను ఓబీసీలుగా గుర్తించడానికి కేంద్ర ప్రభుత్వంపై కాపు రామచంద్రారెడ్డి ఒత్తిడి తీసుకురావాలని కోరారు.
ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి మాట్లాడుతూ శ్రీశైలం మహాస్వామి మడకశిర ప్రాంతంలో అడుగుపెట్టడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. మాజీ ఎమ్మెల్యే వైటీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ వీరశైవులు ఐక్యంగా ఉండి అభివృద్ధి సాధించాలని కోరారు. మడకశిర వైఎస్సార్సీపీ సమన్వయకర్త డాక్టర్ తిప్పేస్వామి మాట్లాడుతూ వీరశైవులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలిపారు. అనంతరం 85 మంది వీరశైవ విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలను అందజేశారు. తర్వాత శ్రీశైలం క్యాలెండర్లను ఆవిష్కరించారు.