Vegetable plants
-
ఆ ఇంటి నిండా మొక్కలే!... ఉద్యానవనాన్ని తలపించే గృహవనం!!
ఒకటి రెండు కాదు, వందలు వేలు పూలు, పండ్లు, ఔషధ మొక్కలతో నిండిపోయింది ఆఇల్లు. ఆహ్లాదంతో పాటు పచ్చదనం, చల్లదనంతో ఇల్లు ఉద్యానవనాన్ని తలపిస్తోంది. పందిరిలా వేలాడే పూల కుండీలతో అందమైన మొక్కలు ప్రకృతి ప్రేమికులను మురిపించటంతోపాటు ఔషధగుణాల మొక్కలు కాలుష్యరహితంగా మనిషి ఆయువు పెంచుతూ ఆందోళన, ఒత్తిడిల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అంటూ ఇంటిగుమ్మం మొదలు దాబాపై వరకు అడుగడుగునా అనేక రకాల మొక్కలతో నిండి ఉంది ఆఇల్లు. పెద్దపల్లిరూరల్: ఇంటి ఆవరణంతా ఆకర్షణీయమైన పూలు, పండ్లు, కూరగాయలు, ఔషధ వివిధ రకాల్లో మొక్కలు పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు పెద్దపల్లి పట్టణం ఫారెన్స్ట్రీట్కు చెందిన సయ్యద్ అతీఫ్. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పూల కుండీలు, గోడలు, దాబాపై వేలాడదీసిన మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రకరకాల, రంగురంగుల మొక్కలు పచ్చటి ప్రకృతిని చూస్తున్నా అనుభూతిని కలిగిస్తుంది. (చదవండి: రిస్క్‌లో ‘కియోస్క్’లు!!) పార్కును తలపించేలా... అతీఫ్ ఇల్లు పార్కును తలపింపిస్తోంది. తన ఇంటి ఆవరణలో వందలాది రకాల మొక్కలను పెంచి పోషిస్తుండడం ప్రకృతిపై ఆయనకు ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. అలాగే మొక్కలను కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు. అతీఫ్ పెంచుతున్న మొక్కలివీ... యాలకులు, ఆల్స్పైస్,ఆరెగాను, అల్లం, వెల్లుల్లితోపాటు ఆపిల్‌బేర్, వాటర్ యాపిల్, డ్రాగన్‌ప్రూట్, మామిడి, సపోట, నారింజ, గ్రేప్స్,స్టాబెర్రీ, జామలాంటి పండ్ల మొక్కలు, రణపాల, ఇన్సూలిన్, తిప్పతీగ, నల్లేరు, వాయు, రకరకాల తులసి, లెమన్‌గ్రాస్ లాంటి ఔషధ గుణాలున్న వాటిని పెంచుతున్నాడు. బీర, దొండ, చిక్కుడు, కాకరలాంటి తీగజాతి మొక్కలతో పాటు మిరప, పుదీన, పాలకూర, తోటకూర, వంకాయ, టమాట వంటి కూరగాయ మొక్కలున్నాయి. మల్లె, లిల్లీ, డాలియా, ఇంపేషంట్స్, జినియా, పింక్ట్రంపెట్, గులాబీ, మందారం, రుమెల్లా, చామంతి, మాస్రోజెస్, కలోంచె, జర్బెరా లాంటి పూలమొక్కలు, ఆగ్లోనెమ, ఫిలోడెండ్రాన్, సింగోనియమ్, మనీప్లాంట్, పోథీస్, స్పైడర్ప్లాంట్స్ కోలియస్, ఆర్నికపామ్, ఇంచ్ప్లాంట్, స్నేక్‌ప్లాంట్, కాక్టస్, డైఫెన్బాచియాలాంటి ఆకర్షణీయ మొక్కలు అతీఫ్ ఇంట్లో దర్శనమిస్తాయి. 800 రకాల మొక్కలు పెంచుతున్నా... మా తాత, తండ్రి తోటల పెంపకంలో ఉండడంతో చిన్నప్పటి నుంచి మొక్కలపై ఆసక్తి పెరిగింది. పచ్చదనమంటే నాకు ప్రాణం. మనసుకు ఎంతో హాయినిస్తుంది, ఇంటి ఆవరణలోని ఖాళీస్థలం, గోడలను ఆసరాగా తీసుకుని దాదాపు 800 వెరైటీల మొక్కలను కుండీల్లో పెంచుతున్నా. ఎక్కడికి వెళ్లినా నావద్ద లేని మొక్కలు కనిపిస్తే ఎంత ఖర్చయినా పెట్టి కొంటాను. ఇప్పటికే దాదాపు మూడు లక్షల దాకా వెచ్చించాను. ఎర్రమట్టి, ఇసుక, కిచెన్ వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువు వాడతాను. షుగర్ పేషెంట్లకు అవసరమైన ఆకులను ఉచితంగా అందించటంతోపాటు కూరగాయలను పంచిపెట్టడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది. – సయ్యద్ అతీఫ్, పెద్దపల్లి (చదవండి: మహిళలను బెదిరించి బంగారం చోరీ) -
ఇంటిపై ఆరోగ్య పంట!
గ్రామాలు కూడా కాంక్రీట్ జంగిళ్లుగా మారిపోతున్న నేపథ్యంలో రసాయనిక పురుగుమందుల అవశేషాలు లేని కూరగాయలు, ఆకుకూరలను తమ ఇంటిపైన సిమెంటు మడుల్లో పండించుకుంటున్నారు కృష్ణాజిల్లా కంకిపాడు మండలం ఈడుపుగల్లు గ్రామానికి చెందిన బిళ్లా వెంకటేశ్వరరావు(93934 36555), రామతులసి దంపతులు. బీసీ కాలనీలో 3 సెంట్ల స్థలంలో మూడేళ్ల క్రితం వారు రెండంతస్తుల ఇల్లు నిర్మించుకున్నారు. సేంద్రియ ఇంటిపంటల సాగు పద్ధతులు, తద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాలను పత్రికలు, టీవీ ప్రసారాల ద్వారా తెలుసుకున్న వెంకటేశ్వరరావు ఇంటి పంటల సాగుపై దృష్టి పెట్టారు. రెండేళ్ల క్రితం డాబాపైన రెండు అడుగుల ఎత్తు, అడుగున్నర వెడల్పు, మూడు–పది అడుగుల పొడవైన సిమెంటు తొట్లు కట్టించారు. వాటి పైన కొంత ఎత్తులో తుప్పుపట్టని తీగతో పందిరి ఏర్పాటు చేయించుకున్నారు. ఎర్రమట్టి, నల్లమట్టి, మాగిన పశువుల ఎరువు కలిపిన మిశ్రమాన్ని నింపి, అందులో అనేక రకాల కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డాబాపై గోరుచిక్కుడు, టమాట, కాకర, బెండ, వంగ, మిర్చితోపాటు పొట్ల, బీర, సొర వంటి తీగజాతి కూరగాయలు సాగు చేస్తున్నారు. తోటకూర, పాలకూర, చుక్కకూర, కొత్తిమీర, గోంగూరను సేంద్రియ పద్ధతుల్లో పెంచుకొని తాజాగా వండుకొని తింటూ ఆరోగ్యంగా, ఆనందంగా జీవిస్తుండడం విశేషం. – ఈడా శివప్రసాద్, సాక్షి, కంకిపాడు బిళ్లా వెంకటేశ్వరరావు, రామతులసి -
సమ్మర్ కేర్!
ఇంటిపంటలు.. జీవామృతం మొక్కలకు ‘సమ్మర్ టానిక్’ మార్చి వచ్చేసింది. ఎండలు రోజురోజుకూ ముదురుతున్నాయి. ఇంటిపంటల సాగుదారులు కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఆకుకూరలు, కూరగాయ మొక్కలు ఎండబారిన పడకుండా చక్కని దిగుబడులు చేతికొస్తాయంటున్నారు శాస్త్రవేత్త డా. జి. రాజశేఖర్ (83329 45368). ఇంటిపంటలను ఎండ దెబ్బ నుంచి రక్షించుకోవాలంటే మొదట చేయాల్సిన పని షేడ్‌నెట్ వేసుకోవటమే. 70% సూర్యరశ్మిని వడకట్టి 30% ఎండను మాత్రమే మొక్కలకు అందించే షేడ్‌నెట్‌తో రక్షణ కల్పించడం ఉత్తమం. ఎండాకాలంలో మొక్కలకు పచ్చిపేడ లేదా పూర్తిగా ఎండని పశువుల ఎరువు వేయకూడదు. వీటిని వేస్తే ఏమవుతుంది? ఇంకా ఎక్కువ వేడి పుట్టి మొక్కలకు హాని కలుగుతుంది. అమ్మోనియా విడుదలవుతుంది (కూరగాయలు, ఆకుకూరలు అమ్మోనియా వాసనొస్తాయి). ఈ-కొలై బాక్టీరియా కొంతమేరకు విడుదలవుతుంది. కనీసం 6 నెలలు మాగిన పశువుల ఎరువు ఉత్తమం. ఒకసారి పూర్తిగా ఎండి.. తర్వాత తడిస్తే పర్వాలేదు. కుండీలు / మడుల్లో అంగుళం లోతు మట్టిని పక్కకు తీసి.. పశువుల ఎరువు లేదా ఘనజీవామృతం తగిన మోతాదులో వేసి.. ఆ తర్వాత మట్టిని వేసుకోవాలి. మట్టిపైనే వేస్తే ఉపయోగం ఉండదు. ఎండ వేళల్లో మట్టిని కదిలించకూడదు. కుండీలు, మడుల్లో పెరిగే మొక్కల చుట్టూతా మట్టిపై ఎండపడకుండా ఆచ్ఛాదన(మల్చింగ్) వేసుకోవాలి. ఇది పంటలను ఎండదెబ్బ నుంచి కాపాడుతుంది. ఎండుగడ్డి, ఎండాకులు, చిన్నాచితకా పుల్లలు, రెమ్మలు, ఎండిన పూలు.. ప్లాస్టిక్ కాని ఏ సేంద్రియ పదార్థాన్నయినా మల్చింగ్‌కు ఉపయోగించవచ్చు. కూరగాయ మొక్కల చుట్టూ వత్తుగా ఆకుకూరలు వేసుకోవచ్చు. కుండీల్లో పెరిగే మొక్కలకు నేల మీద, మడుల్లో పెరిగే మొక్కలకన్నా ఎండ బెడద ఎక్కువగా ఉంటుంది. ప్లాస్టిక్ కుండీలకన్నా మట్టి, సిమెంట్ కుండీలు ఉత్తమం. రోజుకు రెండుసార్లు తగుమాత్రంగా నీరు పోయాలి. డ్రిప్ వేసుకుంటే నీరు సద్వినియోగమవుతుంది. మొక్కల వేసవి తాపాన్ని తగ్గించి, జీవశక్తినివ్వడంలో జీవామృతం పిచికారీ చాలా సమర్థవంతంగా ఉపయోగపడుతుంది. వారం- పది రోజులకోసారి పిచికారీ చేయాలి. పత్రరంధ్రాల నుంచి తేమ ఎక్కువగా ఆవిరైపోకుండా జీవామృతం కాపాడుతుంది. అంతేకాదు.. మొక్కలకు బలవర్థకమైన సమ్మర్ టానిక్‌లా ఉపయోగపడుతుంది. వాతావరణ సంబంధిత వత్తిడిని తగ్గిస్తుంది. ఇంటిపంటలే కాదు పొలాల్లో పంటలపైనా పిచికారీ చేయొచ్చు. -
జాయ్ ఆఫ్ గార్డెనింగ్
ఆహ్లాదకరమైన ల్యాండ్ స్కేప్స్, విభిన్నమైన కూరగాయల మొక్కలు, పూదోటలు... నగరంలో పచ్చదనం పరచుకుంది. మాదాపూర్ హైటెక్స్‌లో గురువారం ప్రారంభమైన ‘హోం గార్డెన్స ఫెయిర్’ మనసు దోస్తోంది. హోటల్ యజమానులు, కొత్త ఇంటిని కొనుగోలు చేసేవారు, హార్టికల్చర్ స్టూడెంట్స్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు... విభిన్న రంగాలకు చెందిన వారంతా ఫెయిర్‌కు క్యూ కట్టారు. ప్రముఖ మ్యూజిక్ డెరైక్టర్ ఆర్పీ పట్నాయక్ ప్రారంభించిన ఈ షోలో నర్సరీ, గార్డెనింగ్ ఉత్పత్తులు, పరికరాలు, వివిధ రకాల మొక్కలు కొలువుదీరాయి. అంతే కాదు... మొక్కలు పెంచే విధానంపై కూడా ఇక్కడ నిపుణులు అవగాహన కల్పించారు. పట్టణ ప్రాంత ఆవాసాలలో తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న ‘మన ఇల్లు- మన కూరగాయలు’ పథకం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపారు. దాంతో పాటు గ్రీన్ వాల్స్, కిచెన్ గార్డెన్స్, బాల్కనీ కాన్సెప్ట్‌ల పైనా అవగాహన పెంచుకున్నారు. గ్రాస్ వరల్డ్‌లో వివిధ దేశాల ‘కార్పెట్ గ్రాస్’, బోన్సాయ్ మొక్కలు, హ్యాంగింగ్ క్రీపర్స్ వంటివెన్నో ఆకర్షణీయంగా ఉన్నాయి. ఈనెల 28 వరకు ఫెయిర్ కొనసాగుతుంది.