ఒకటి రెండు కాదు, వందలు వేలు పూలు, పండ్లు, ఔషధ మొక్కలతో నిండిపోయింది ఆఇల్లు. ఆహ్లాదంతో పాటు పచ్చదనం, చల్లదనంతో ఇల్లు ఉద్యానవనాన్ని తలపిస్తోంది. పందిరిలా వేలాడే పూల కుండీలతో అందమైన మొక్కలు ప్రకృతి ప్రేమికులను మురిపించటంతోపాటు ఔషధగుణాల మొక్కలు కాలుష్యరహితంగా మనిషి ఆయువు పెంచుతూ ఆందోళన, ఒత్తిడిల నుంచి ఉపశమనం కలిగిస్తున్నాయి. చెట్టు ఎక్కడ ఉంటే అక్కడ సంతోషం అంటూ ఇంటిగుమ్మం మొదలు దాబాపై వరకు అడుగడుగునా అనేక రకాల మొక్కలతో నిండి ఉంది ఆఇల్లు.
పెద్దపల్లిరూరల్: ఇంటి ఆవరణంతా ఆకర్షణీయమైన పూలు, పండ్లు, కూరగాయలు, ఔషధ వివిధ రకాల్లో మొక్కలు పెంచుతూ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాడు పెద్దపల్లి పట్టణం ఫారెన్‌స్ట్రీట్‌కు చెందిన సయ్యద్ అతీఫ్. ఇంటి ఆవరణలోని ఖాళీ స్థలంలో పూల కుండీలు, గోడలు, దాబాపై వేలాడదీసిన మొక్కలు చూపరులను ఆకట్టుకుంటున్నాయి. రకరకాల, రంగురంగుల మొక్కలు పచ్చటి ప్రకృతిని చూస్తున్నా అనుభూతిని కలిగిస్తుంది.
(చదవండి: రిస్క్‌లో ‘కియోస్క్’లు!!)
పార్కును తలపించేలా...
అతీఫ్ ఇల్లు పార్కును తలపింపిస్తోంది. తన ఇంటి ఆవరణలో వందలాది రకాల మొక్కలను పెంచి పోషిస్తుండడం ప్రకృతిపై ఆయనకు ఉన్న మమకారాన్ని తెలియజేస్తోంది. అలాగే మొక్కలను కంటికి రెప్పలా సంరక్షిస్తున్నారు.
అతీఫ్ పెంచుతున్న మొక్కలివీ...
యాలకులు, ఆల్‌స్పైస్,ఆరెగాను, అల్లం, వెల్లుల్లితోపాటు ఆపిల్‌బేర్, వాటర్ యాపిల్, డ్రాగన్‌ప్రూట్, మామిడి, సపోట, నారింజ, గ్రేప్స్,స్టాబెర్రీ, జామలాంటి పండ్ల మొక్కలు, రణపాల, ఇన్సూలిన్, తిప్పతీగ, నల్లేరు, వాయు, రకరకాల తులసి, లెమన్‌గ్రాస్ లాంటి ఔషధ గుణాలున్న వాటిని పెంచుతున్నాడు. బీర, దొండ, చిక్కుడు, కాకరలాంటి తీగజాతి మొక్కలతో పాటు మిరప, పుదీన, పాలకూర, తోటకూర, వంకాయ, టమాట వంటి కూరగాయ మొక్కలున్నాయి. మల్లె, లిల్లీ, డాలియా, ఇంపేషంట్స్, జినియా, పింక్‌ట్రంపెట్, గులాబీ, మందారం, రుమెల్లా, చామంతి, మాస్‌రోజెస్, కలోంచె, జర్బెరా లాంటి పూలమొక్కలు, ఆగ్లోనెమ, ఫిలోడెండ్రాన్, సింగోనియమ్, మనీప్లాంట్, పోథీస్, స్పైడర్‌ప్లాంట్స్ కోలియస్, ఆర్నికపామ్, ఇంచ్‌ప్లాంట్, స్నేక్‌ప్లాంట్, కాక్టస్, డైఫెన్‌బాచియాలాంటి ఆకర్షణీయ మొక్కలు అతీఫ్ ఇంట్లో దర్శనమిస్తాయి.
800 రకాల మొక్కలు పెంచుతున్నా...
మా తాత, తండ్రి తోటల పెంపకంలో ఉండడంతో చిన్నప్పటి నుంచి మొక్కలపై ఆసక్తి పెరిగింది. పచ్చదనమంటే నాకు ప్రాణం. మనసుకు ఎంతో హాయినిస్తుంది, ఇంటి ఆవరణలోని ఖాళీస్థలం, గోడలను ఆసరాగా తీసుకుని దాదాపు 800 వెరైటీల మొక్కలను కుండీల్లో పెంచుతున్నా. ఎక్కడికి వెళ్లినా నావద్ద లేని మొక్కలు కనిపిస్తే ఎంత ఖర్చయినా పెట్టి కొంటాను. ఇప్పటికే దాదాపు మూడు లక్షల దాకా వెచ్చించాను. ఎర్రమట్టి, ఇసుక, కిచెన్ వ్యర్థాలతో తయారు చేసిన సేంద్రియ ఎరువు వాడతాను. షుగర్ పేషెంట్లకు అవసరమైన ఆకులను ఉచితంగా అందించటంతోపాటు కూరగాయలను పంచిపెట్టడం ఎంతో సంతృప్తిని ఇస్తుంది.
– సయ్యద్ అతీఫ్, పెద్దపల్లి
(చదవండి: మహిళలను బెదిరించి బంగారం చోరీ)
Comments
Please login to add a commentAdd a comment