మణికొండ: రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికీ ఓ అటవీ పార్కును అభివృద్ధి చేస్తామని రాష్ట్ర అటవీ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. ఇప్పటికే 109 పార్కులకు గానూ 73 పూర్తి చేశామని, మంచిరేవులలో 74వ పార్కు అందుబాటులోకి వచ్చిందని వెల్లడించారు. శనివారం హైదరాబాద్ నగర శివారు చిలుకూరు రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని మంచిరేవుల ఔటర్‌రింగ్ రోడ్డుకు ఆనుకుని 360 ఎకరాలలో రూ.7.38 కోట్ల నిధులతో అభివృద్ధి చేసిన ట్రెక్ పార్కును ఆయన ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యకార్యదర్శి శాంతికుమారి, మంత్రులు పి.సబితారెడ్డి, పి.మహేందర్‌రెడ్డిలతో కలిసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇంద్రకరణ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో 230 కోట్ల మొక్కలను నాటాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటికే లక్ష్యాన్ని దాటి 270 కోట్ల మొక్కలను నాటామన్నారు. అందులో 80శాతం మొక్కలు బతుకుతున్నాయని, ఈ ఏడాది 30 కోట్ల మొక్కలను నాటాలని నిర్ణయించుకున్నామని వివరించారు.
హైదరాబాద్‌లో 60నుంచి 70 పార్కులు అందుబాటులో ఉన్నాయని, రాబోయే రోజుల్లో మరిన్ని పార్కులను అభివృద్ధి చేస్తామని చెప్పారు. అర్బన్ లంగ్ స్పేస్‌లో భాగంగా మానసిక ఉల్లాసం, ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు సరికొత్త థీమ్‌తో ఈ ట్రెక్ పార్కును అభివృద్ధి చేశామన్నారు.
ఇందులో 50 వేల రకాల మొక్కలు, 2 కిలోమీటర్ల ట్రెక్కింగ్ ట్రాక్, 4 కిలోమీటర్ల వాకింగ్ ట్రాక్, రాక్ పెయింటింగ్, ఓపెన్ జిమ్, యాంఫీ థియేటర్, ట్రీ వాటర్ ఫాల్, వాచ్ టవర్ లాంటి అనేక సౌకర్యాలను కల్పించామనీ స్థానిక ప్రజలు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. పార్కును ప్రారంభించి సఫారీ వాహనంలో పర్యటించి, మొక్కలు నాటారు.
రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి..
రాష్ట్రం ఏర్పడినప్పటినుంచి కోట్లాది మొక్కలు నాటడం ఎంతో మంచి కార్యక్రమమని రాజ్యసభ ఎంపీ జోగినపల్లి సంతో‹Ùకుమార్ అన్నారు. దేశ వ్యాప్తంగా ఏ రాష్ట్రం చూసుకున్నా పచ్చదనం తగ్గుతుంటే రాష్ట్రంలో మాత్రం 7.3శాతం పెరగటం మంచి పరిణామమన్నారు.
కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీ డాక్టర్ గడ్డం రంజిత్‌రెడ్డి, జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ అనితాహరినాథ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు టి. ప్రకాశ్‌గౌడ్, కాలె యాదయ్య, పైలెట్ రోహిత్‌రెడ్డి, ఎమ్మెల్సీ వాణిదేవి, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వి.ప్రతాప్‌రెడ్డి, సీఎం కార్యదర్శి భూపాల్‌రెడ్డి, సీఎం ఓఎస్‌డీ ప్రియాంక వర్గీస్, జిల్లా కలెక్టర్ హరీశ్, బండ్లగూడ మేయర్ మహేందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment