టీఆర్ఎస్ శ్రేణుల దాష్టీకం
బషీరాబాద్, న్యూస్‌లైన్: తాండూరు వైఎస్సార్సీపీ అసెంబ్లీ అభ్యర్థి ప్రభుకుమార్ ప్రచార వాహనంపై శనివారం రాత్రి టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. వాహనం అద్దాలు ధ్వంసం చేయడంతోపాటు డ్రైవర్, ఓ కార్యకర్తను చితకబాదారు. పూర్తి వివరాలిలా ఉన్నాయి. బషీరాబాద్ మండలంలో ప్రభుకుమార్ ఎన్నికల ప్రచారం ముగించుకుని తన అనుచరులతో కలిసి తిరిగి తాండూరుకు బయలుదేరారు.
ఈ క్రమంలో మంతన్‌గౌడ్ గ్రామం వద్దకు వారి వాహనాలు రాగానే టీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థి మహేందర్‌రెడ్డి అనుచరులుగా భావిస్తున్న కొందరు అడ్డుకున్నారు. ప్రచారం వాహనం తమ మోటార్‌సైకిల్‌ను ఢీకొందని ఆరోపిస్తూ ప్రచార రథం అద్దాలు పగులగొట్టారు. అదే సమయంలో ప్రచార రథాన్ని అనుసరిస్తూ ఇన్నోవా కారులో వెనుక వైఎస్ఆర్సీపీ అభ్యర్థి ప్రభుకుమార్ అక్కడికి వచ్చారు.
ప్రచార రథం వద్ద గొడవ జరుగుతుండటంతో కారు డ్రైవర్ సతీష్ వెళ్లి ఏం జరిగింది..ఎందుకు గొడవ పడుతున్నారని అడుగుతుండగానే టీఆర్ఎస్ కార్యకర్తలు దాడికి దిగారు. వైఎస్ఆర్సీపీ కార్యకర్త జహీర్ వెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేయగా ఆయనపై కూడా దాడి చేశారు. అభ్యర్థి ప్రభుకుమార్‌పై దాడికి యత్నించగా అక్కడే ఉన్న పార్టీ నాయకుడు సత్యమూర్తి తదితరులు అడ్డుకున్నారు.
అనంతరం దాడికి పాల్పడిన వారు పారిపోయారు. ఈ విషయమై అభ్యర్థి ప్రభుకుమార్, సత్యమూర్తి తదితరులు బషీరాబాద్ పోలీసుస్టేషన్‌కు వెళ్లి మహేంద ర్‌రెడ్డి అనుచరులుగా భావిస్తున్న కొందరు తమపై దాడికి దిగారని ఫిర్యాదు చేశారు. వైఎస్ఆర్సీపీకి లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే మహేందర్‌రెడ్డి ముఖ్య అనుచరులు దళిత వర్గానికి చెందిన తనపై హత్యాయత్నానికి పాల్పడ్డారని ప్రభుకుమార్ ఆరోపించారు.
తమ ప్రచార రథం ఎవరినీ ఢీకొట్టలేదని, కావాలనే గొడవ పడి తన కారును ధ్వంసం చేసి, అనుచరులపై దాడికి పాల్పడ్డారన్నారు. కాగా దాడిచేసిన వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్ ఎదుట ప్రభుకుమార్, వైఎస్సార్సీపీ కార్యకర్తలు బైఠాయించారు. దీంతో పోలీసులు స్పందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని హామీ ఇచ్చారు.