టీటీడీలో ఏకాదశి ఫీవర్..!
* వెకుంఠ దర్శనం వీఐపీలకేనా
* ఉద్యోగులు, స్థానికుల ఆవేదన
తిరుపతి సిటీ : తిరుమల తిరుపతి దేవస్థానంలో అధికారులకు వైకుంఠ ఏకాదశి జ్వరం పట్టుకుంది. నూతన సంవత్సరాది, వైకుంఠ ఏకాదశి కలసి రావడంతో అటు వీఐపీల నుంచి సిఫార్సులు.. ఇటు స్థానికుల నుంచి నిరసనలు ఎదురవడంతో టీటీడీ అధికారులు ఏమి చేయాలో తెలియక సందిగ్ధంలో పడ్డారు. ఏర్పాట్ల విషయంలో టీటీడీ ఇప్పటికే పక్కా ప్రణాళికతో ముందుకెళ్తున్నా భక్తులకు స్వామి దర్శనం కల్పించడంలో మాత్రం ఎక్కడా స్పష్టత ఇవ్వలేదు. వైకుంఠ ఏకాదశిపై జరుగుతున్న సమీక్షలో మాత్రం వీఐపీలను వెనకేసుకొస్తున్నారేగాని సామాన్య భక్తుల విషయంలో వైకుంఠద్వార దర్శనం ఎలా కల్పిస్తారో మాత్రం వివరించకపోవడం గమనార్హం.
వైకుంఠ దర్శన టికెట్లలో తొలుత వీఐపీలకే ప్రాధాన్యమివ్వడం, అటు తరువాతనే సామాన్య భక్తులకు ఆలయ ప్రవేశమని టీటీడీ ఇప్పటికే ప్రకటించింది. ఉదయం 5 గంటల తరువాత సామాన్య భక్తులను దర్శనానికి వదులుతామని చెప్తున్నారు. అయితే ద్వాదశి టికె ట్లు మాత్రం 10 వేలు మాత్రమే కేటాయించారు. అవి కూడా గంటలోపే అమ్ముడు కావడంతో టీటీడీ అధికారులు ఖంగు తిన్నారు.
ద్వాదశి దర్శనానికే ఇలా ఉంటే ఏకాదశి దర్శనం భక్తులకు కేటాయించకపోతే ఎక్కడ నుంచి ఎలాంటి ఉపద్రవం ముంచుకోస్తుందో నన్న భయం అధికారులను పట్టుకుంది. ఇప్పటికే ఈ విషయమై స్థానికుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ప్రతి సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా టీటీడీ వీఐపీల సేవలోనే తరిస్తోం దంటూ తిరుపతికి చెందిన కొందరు బహిరంగ విమర్శలకు దిగుతున్నారు. గతంలో ఉద్యోగులకు ఈ పర్వదినాల్లో టికెట్ల కేటాయింపు ఉండేది. ఈ సారి వాటిని రద్దు చేసినట్లు టీటీడీ ప్రకటించడంతో ఉద్యోగ సంఘాలు టీటీడీ తీరుపై గుర్రుగా ఉన్నాయి.