కరీంనగరా మజాకా! ఇక్కడ పార్టీలతో పనిలేదు.. కాపు వర్సెస్ వెలమ, తగ్గేదేలే
రాజకీయాలు సహజంగా పార్టీల వారీగా నడుస్తుంటాయి. కాని తెలంగాణలో ఒక జిల్లాలో పార్టీల కంటే సామాజిక వర్గాలకే ప్రాధాన్యత కనిపిస్తుంది. అక్కడ పార్టీలు ఒక భాగమైతే.. సామాజికవర్గాలు మరో భాగంగా ఉన్నాయి. పార్టీ ఏదైనా ఒక ప్రధాన సామాజికవర్గం నేతలు అన్ని పార్టీల్లోని తమవారు గెలవాలని కోరుకుంటారు. ఎవరిని ఎలా గెలిపించాలా? ప్రత్యర్థి సామాజికవర్గాన్ని ఎలా దెబ్బ తీయాలా అని ప్లాన్స్ వేస్తుంటారు. ఇంతకీ ఆ జిల్లా ఎక్కడుంది?
ఉమ్మడి కరీంనగర్ జిల్లా రాజకీయాల్లో ఆది నుంచీ వెలమ సామాజికవర్గం కీలక పాత్ర పోషిస్తోంది. అయితే ఓటింగ్ పరంగా అధికంగా ఉన్న మున్నూరు కాపు వర్గం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ మరోసారి కరీంనగర్ లోక్‌సభ నియోజకవర్గంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి రెడీగా ఉన్నారు.
పార్లమెంట్ పరిధిలోని ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లోనూ నిత్యం ఏదో ఒక కార్యక్రమానికి హాజరవుతూ తన బలాన్ని పెంచుకుంటున్నారు. రాబోయే ఎన్నికల కోసం అందరి కంటే ముందుగానే సిద్దమవుతున్నారు. అయితే గత ఎన్నికల్లో ఏఏ అసెంబ్లీ నియోజకవర్గాల్లో అయితే వినోద్‌కు దెబ్బ పడిందో ఈసారి కూడా అవే నియోజకవర్గాల్లో నష్టం జరుగుతుందనే ప్రచారం మొదలైంది. ఇందుకోసం సామాజిక వర్గ లెక్కలు వేస్తున్నారు స్థానిక నాయకులు.
బోయినపల్లి వినోద్‌కు దక్కుతున్న ప్రాధాన్యాన్ని భరించలేకే మున్నూరు కాపు వర్గానికి చెందిన కొందరు నేతలు పావులు కదుపుతున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా ఇప్పుడిప్పుడే బయటకు వస్తోంది. కరీంనగర్ అసెంబ్లీ సెగ్మెంట్లో కూడా మున్నూరు కాపు వర్సెస్ వెలమ సామాజికవర్గం మధ్య గ్యాప్ కొనసాగుతోంది. గతంలో వెలమ సామాజికవర్గం వారే కరీంనగర్ అసెంబ్లీ సీటుకు ప్రాతినిథ్యం వహించగా.. ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే, మంత్రి గంగుల కమలాకర్ హ్యాట్రిక్ సాధించడంతో.. వెలమ సామాజికవర్గానికి స్కోప్ లేకుండా పోయింది. ఈ క్రమంలో.. పార్లమెంట్ సెగ్మెంట్ లో వినోద్ తో పాటు.. కరీంనగర్ అసెంబ్లీలోనూ ఆ సామాజికవర్గాలకు సందు ఇవ్వొద్దనే రీతిలో మరి కొన్ని సామాజికవర్గాలు.. ఏకంగా పార్టీలకతీతంగా కంకణం కట్టుకోవడం.. కరీంనగర్ లో కనిపించే విభిన్న రాజకీయ తంత్రం.
రాజకీయాలంటేనే వ్యూహ, ప్రతివ్యూహాలుగా భావించే రోజుల్లో.. నేతల స్వయంకృతాపరాధాలు కూడా ప్రత్యర్థి పార్టీలకు..అలాగే సొంత పార్టీలోని ప్రత్యర్థులకూ అడ్వాంటేజ్ గా మారుతాయి. గత పార్లమెంట్ ఎన్నికలే అందుకు నిదర్శనం. కరీంనగర్‌కు ఎన్నో పనులు చేసినా తనను ఓడించారని మాజీ ఎంపీ వినోద్ భావిస్తుండగా... ఎన్ని చేశామన్నది కాదు..ప్రజలేం కోరుకుంటున్నారో తెలుసుకుని వాటిని చేశారా అని పార్టీలోని ఆయన ప్రత్యర్థులు కామెంట్ చేశారు.
చదవండి: మాటిస్తున్నా మహేంద్రా!.. వచ్చేది మనమే.. అటుఇటు వెళ్లి ఆగం కావొద్దు
పైగా ప్రస్తుతం అధికారంలో లేనప్పుడే వినోద్ శైలి డామినేటింగ్ గా ఉందని ఫీలవుతున్న కొందరు కీలక ప్రజాప్రతినిధులు.. మరోసారి ఎంపీగా గెలిస్తే.. ఇక తమ అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా తమకు ప్రాధాన్యత లేకుండా పోతుందనే భావన కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాల్లో కనిపిస్తోంది.
కరీంనగర్ రాజకీయాల్లో ఒక పార్టీవారంతా ఒకే తాటిపైన ఉన్నారనుకుంటే పొరపాటే. ఒక సామాజికవర్గం వారైతే మాత్రం కచ్చితంగా ఒక్క తాటిపైనే ఉన్నట్టు సామాజిక విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో మరి రాబోయే ఎన్నికల్లో ఏ పార్టీది పై చేయి అనేకంటే.. ఏ సామాజికవర్గానిది పైచేయి అవుతుందని మాట్లాడుకోవాల్సిన భిన్నమైన పరిస్థితి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కనిపిస్తోంది.