ముక్కుపుడక తెచ్చిన తంటా!
చెన్నై: మగువుల సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ముక్కుపుడక ఓ పెద్దావిడ ప్రాణం మీదికి తెచ్చింది. కేవలం అలంకరణ కోసమే కాకుండా.. మహిళలు సాంప్రదాయకంగా ముక్కు పుడకలు ధరించడం ఆనవాయితీ. అలా పెట్టుకున్న ముక్కుపుడక కాస్త ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. అది కాస్తా ప్రమాదవశాత్తు ఊపిరితిత్తుల్లో చేరి అపాయకరంగా మారిన ఘటన తమిళనాడు మదురై లో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే వెల్లమ్మాళ్ (78) అనే మహిళ ముక్కు పుడకను తొలగించడానికి బంధువులు ప్రయత్నిచినపుడు పొరపాటున దాని సీల నోట్లోకి జారి, ఊపిరితిత్తుల్లో అడ్డుపడింది. ఆ తర్వాత వారు ఆవిషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైంది. తీవ్రమైన శ్వాస సమస్యతో గత నెలరోజులుగా ఇబ్బంది పడుతుండటంతో వైద్యులను సంప్రదించింది.
ఈ నేపథ్యంలో ఎక్స్ రే తీసినపుడు బంగారు ముక్కుపుడక స్క్రూ ఎడమ ఊపిరితిత్తిలో నిలిచిపోయినట్టు గమనించారు. ఆమెకు ఊపిరి తీసుకోవడం మరింత ఇబ్బంది కరంగా మారడంతో దాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో థొరాసిక్ సర్జరీ ద్వారా నుంచి దానిని తొలగించారు. బ్రాంకో స్కోపీ (శ్వాస నాళ అంతర్దర్శిని) సహాయంతో ఫోర్ సెప్స్తో దానిని బయటకు తీసారు. ఆపరేషన్ అనంతరం వెల్లమ్మాళ్ ఆరోగ్యం నిలకడగా ఉందని , సాధారణంగా శ్వాస తీసుకోకలుగుతోందని మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ కోసం గంట సమయం పట్టిందన్నారు.