lung
-
రెండేళ్లుగా తగ్గని దగ్గు.. కారణం తెలిసి షాకైన వైద్యులు
సాధారణంగా దగ్గు సమస్య అందరినీ వేధిస్తుంటుంది. గాలిలోని కాలుష్యం, ముక్కుల్లో ఇన్ఫెక్షన్, అలర్జీ, సైనుసైటిస్, గొంతు నొప్పి, గుండె జబ్బులు.. ఇలా రకరకాల కారణాల ద్వారా దగ్గు వస్తుంటుంది. ఇలాగే చైనాకు చెందిన ఓ వ్యక్తికి దగ్గు అంటుకుంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రేండేళ్లపాటు అతడికి దగ్గు వదల్లేదు. దీంతో క్యాన్సర్ వ్యాధి ఏమైనా వచ్చిందోనని భయాందోళనకు గురయ్యాడు. కానీ చివరకు తన దగ్గుకు గల కారణం తెలిసి..హమ్మయ్యా అనుకున్నాడు.. ఇంతకీ ఏం జరిగిందంటే..తూర్పు చైనీస్ పప్రావిన్స్ జెజియాంగ్‌కు చంఎదిన 54 ఏళ్ల వ్యక్తి జుకి కొంతకాలంగా దగ్గు వేధిస్తోంది. ఎన్ని ఆసుపత్రులు తిరిగినా, మందులు, సిరప్లు వాడినా ఎంతకీ దగ్గు తగ్గలేదు. ఇలా రెండేళ్లు గడిచాయి. గత నెల జూన్‌లో జెజియాంగ్ హాస్పిటల్లో థొరాసిక్ సర్జరీ విభాగంలో స్కాన్ చేసుకునేందుకు సిద్ధమయ్యాడు.అక్కడ అతనికి సిటీ స్కాన్ చేశారు. అందులో వ్యక్తి కుడి ఊపిరితిత్తులో ఒక సెంటీమీటర్ పొడుతున్న కణతి ఉన్నట్లు తేలింది. అది న్యుమోనియా లేదా క్యాన్సర్ కణితీగా తొలుత భావించారు. ఇక జు తనకు కచ్చితంగా క్యాన్సర్ వచ్చి ఉంటుందని ఫిక్స్ అయిపోయి భయంతో అల్లాడిపోయాడుజూలై 3న ఊపిరితిత్తుల కణజాలంలో కొంత భాగాన్ని తొలగించడానికి థొరాకోస్కోపీని చేసుకున్నాడు. దీనిలో క్యాన్సర్‌ని నిర్ధారించడానికి ఒక పరీక్ష చేస్తారు. అయితే అక్కడే అసలు విషయం బయటపడింది. అతనికి ఊపిరితిత్తుల్లో దాగుంది చిల్లీ పెప్పర్ కొన(మిర్చి ముక్క) గుర్తించి వైద్యులు ఆశ్చర్యపోయారు. జు రెండు సంవత్సరాల క్రితం హాట్‌పాట్ భోజనం చేసిన రోజును గుర్తు చేసుకున్నారు. ఆరోజు మిరియాలు పీల్చడం వల్ల అసౌకర్యానికి గురవ్వడం, దగ్గడం వంటివి జరిగినట్లు నిర్ధారించుకొని ఊపిరి పీల్చుకున్నాడు.దీంతో మిరపకాయ అతని ఊపిరితిత్తులలోకి వెళ్లి ఉండవచ్చని జెజియాంగ్ హాస్పిటల్‌లోని థొరాసిక్ సర్జరీ విభాగం డైరెక్టర్ జు జిన్హై చెప్పారు. ఇది అతని కణజాలం కింద దాగిపోయిందని, దీనిని గుర్తించడం సవాలుగామారిందని తెలిపారు.పెప్పర్ చాలా కాలం అతని శ్వాసనాళంలో ఉన్నందున, అది ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్నుదారి తీసిందని. అందుకు రెండు సంవత్సరాలకు పైగా దగ్గు వచ్చినట్లు పేర్కొన్నారు. -
సౌదీ అరేబియా రాజుకి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్! ఎందువల్ల వస్తుందంటే..?
సౌదీ అరేబియా రాజు సల్మాన్ తీవ్ర స్వస్థతకు గురయ్యారు. జెడ్డాలోని అల్ సలామ్ ప్యాలెస్‌లోని రాయల్ క్లినిక్ సల్మాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడ్డట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆయన యాంటీబయాటిక్స్‌తో చికిత్స పొందుతున్నారని, తొందరలోనే కోలుకుంటారని పేర్కొంది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అంటే..ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ అనేది వైరస్లు, బ్యాక్టీరియా, శిలీంధ్రాలు లేదా పరాన్నజీవులు, శ్వాసనాళాలు లేదా ఊపిరితిత్తుల కణజాలాలకు వాపు, హాని కలిగించే పరిస్థితి. ఈ పరిస్థితి కారణంగా ఒకటి లేదా రెండ ఊపిరితిత్తులు ప్రభావితమయ్యే అవకాశం ఉంటుంది. అసలు ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ సంకేతాలు ఎంలా ఉంటాంటే..లక్షణాలు..దగ్గు..ఎడతెరిపి లేని దగ్గు ఊపిరితిత్తుల సంక్రమణకు సంకేతం. అలాగే స్పష్టంగా పసుపు, ఆకుపచ్చ లేదా ఎరుపు రంగులో ఉండే శ్లేష్మం, జ్వరం. సాధారణంగా అయితే అధిక జ్వరం కనిపిస్తుంది.శ్వాస ఆడకపోవుట..శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఉన్నా..ఊపిరితిత్తుల్లో వాపు, ద్రవం పేరుపోవడానికి కారణమవుతుంది. ఇది శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని కలిగిస్తుంది. ఛాతి నొప్పి..ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్లో కూడా ఛాతీలో తీవ్ర నొప్పి కలుగుతుంది. ప్రత్యేకించి లోతైన శ్వాస తీసుకున్నా..దగ్గు తీసుకున్నా..ఛాతీలో పదునైన కత్తిపోటులా నొప్పిగా ఉంటుంది. అలసట..విపరీతంగా అలసిపోయినట్లు ఉండొచ్చు. గురకఇరుకైన వాయుమార్గాల కారణంగా ఊపిరి పీల్చుకునేటప్పుడు పెద్దగా శబ్దం రాడం. ఇది శ్లేష్మంగా కారణంగా ఏర్పడే వాపు లేదా అడ్డంకికి సంకేతం.వేగవంతమైన శ్వాసశరీరం తక్కువ ఆక్సిజన్ స్థాయిలకు ప్రతిస్పందించినప్పుడూ జరుగుతుంది.గందరగోళం..ఇది ఎక్కువగా పెద్దవారిలో కనిపిస్తుంది.ఆకలి నష్టం..అనారోగ్యంతో పోరాడటానికి శరీరానికి తగినంత శక్తి అవసరం కానీ ఈ ఊపిరితిత్తు ఇన్ఫెక్షన్ ఆకలిని తగ్గించేస్తుంది.వికారం వాంతులు..కొంతమందిలో లేదా పిల్లలకు వికారం, వాంతులు, అతిసారం వంటివి వచ్చే అవకాశం ఉంటుంది.ఎందువల్ల వస్తుందంటే..బాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు..స్ట్రెప్టోకోకస్ న్యుమోనియా, మైకోప్లాస్మా న్యుమోనియా వంటివి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు ప్రాథమిక కారణాలు. దీని కారణంగా ఊపిరితిత్తులలో వాపు, ద్రవం చేరడం వంటివి జరుగుతాయి.వైరల్ ఇన్ఫెక్షన్లు..సార్స్ కోవీ-2తో సహా ఇన్ఫ్లు ఎంజా వైరస్లు, కరోనా వైరస్లు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్కు దారితీయొచ్చు. ఈ అంటువ్యాధులు తరుచుగా దగ్గు లేదా తుమ్ముల నుంచి శ్వాసకోశ బిందువుల ద్వారా వ్యాపిస్తాయి. ఫంగల్ ఇన్ఫెక్షన్లుపర్యావరణంలో శిలీంధ్ర బీజాంశాలను పీల్చడం వల్ల ఈ ఇన్ఫెక్షన్కు దారితీస్తుంది. బలమైన రోగనిరోధక వ్యవస్థ కలిగిన వ్యక్తుల్లో తలెత్తుంది. బలహీన రోగ నిరోధక వ్యవస్థ..హెచ్ఐవీ లేదా ఎయిడ్స్, బలహీనమైన రోగనిరోధక వ్యవస్థ, కేన్సర్ చికిత్సలు లేదా అవయవ మార్పిడి వంటి పరిస్థితుల కారణంగా ఈ ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. (చదవండి: మామిడి పండ్ల వినియోగంపై ఎఫ్ఎస్ఎస్ఏఐ హెచ్చరిక! కెమికల్ ఫ్రీ పండ్లను ఎలా గుర్తించాలంటే..) -
వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే..? చిన్నారులకే ఎందుకొస్తోంది?
వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రపంచ దేశాలను వణికిస్తోంది. నాలుగేళ్ల క్రితం వచ్చిన కోవడ్ మహమ్మారిలా నెమ్మదిగా పెరుతుగున్నాయి ఈ సిండ్రోమ్ కేసులు. అదికూడా ప్రధానంగా చిన్నారులే అధికంగా ఈ వ్యాధి బారిన పడుతున్నారు. న్యూమెనియాకు సంబంధించిన మిస్టీరియస్ వ్యాధిగా పరిశోధకులు వెల్లడించడంతో సర్వత్రా భయాందళోనలు వ్యక్తమయ్యాయి. ముఖ్యంగా చైనాలోనే ఈ వ్యాధులు ప్రబలంగా ఉన్నాయి. సీజనల్‌గా వచ్చే వ్యాధేనని, శీతకాలం కావడం వల్ల కేసులు పెరుగుతన్నాయని చైనా వివరణ ఇచ్చింది. పైగా కరోనా మహమ్మారి అంతా తీవ్రంగా లేదని తెలిపింది. అసలు ఎంతకీ ఏంటీ వైట్ లంగ్ సిండ్రోమ్? దేని వల్ల వస్తుందంటే.. వైట్ లంగ్ సిండ్రోమ్ అంటే ఏమిటి? ఛాతీలో పేరుకుపోయి తెల్లటి పాచెస్ లాంటి ద్రవం పేరుకుని ఉంటే దాన్ని 'వైట్ లంగ్ సిండ్రోమ్' అంటారు. ఇది అక్యూట్ రెస్పీరేటరీ డిస్ట్రెస్, పల్మనరీ అల్వియోలార్ మైక్రోలిథియాసిస్, సిలికా సంబంధిత శ్వాసకోశ వ్యాధులకు దారితీస్తుంది. దీని కారణంగా శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఇలాంటి శ్వాస సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల్లో ద్రవం నిండినప్పడూ లేదా ఊపిరితిత్తుల్లోని గాలి సంచుల్లో కాల్షియం నిక్షేపాలు ఉన్నప్పుడూ సంభవిస్తాయి. లక్షణాలు.. సాధార శ్వాస సంబంధిత వ్యాధుల్లో వచ్చే సంకేతాలనే చూపిస్తుంది. ముఖ్యంగా దగ్గు, ఛాతీ నొప్పి, జ్వరం, అలసట తదితర లక్షణాలు కనిపిస్తాయి. కారణాలు.. కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. కానీ ఇది కోవిడ్-19కి సంబంధించిన ఇన్ఫ్లుఎంజా లేదా కోవిడ్-19 వంటి వైరస్లు ఊపిరితిత్తుల గాలి సంచులను దెబ్బతీయడం వల్ల సంభవించినట్లు అనుమానిస్తున్నారు శాస్త్రవేత్తలు. మైక్రోప్లాస్మా న్యూమెనియా అనే బ్యాక్టీరియా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ కలిగించడం వల్ల ఈ సిండ్రోమ్కి దారితీసి ఉండొచ్చని భావిస్తున్నారు . అలాగే సిలికా ధూళి లేదా ఇతర కాలుష్య కారకాలను పీల్చడం లేదా పర్యావరణ కారకాలు తదితరాలు ఈ వైట్ లంగ్ సిండ్రోమ్ ప్రధాన కారణమై ఉండొచ్చని చెబుతున్నారు పరిశోధకులు. చికిత్స.. యాంటీబయాటిక్స్, యాంటీవైరల్, ఆక్సిజన్ థెరపీ, కార్టికోస్టెరాయిడ్స్ వంటి వాటితో ఈ వ్యాధిని నివారించడం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. వ్యాధి తీవ్రతను బట్టి చికిత్స ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అదే టైంలో ఈ వ్యాధి తగ్గడం అనేది రోగి ఆరోగ్యంపై ఆధారపడింది. సత్వరమే చికిత్స తీసుకోవడం వల్ల ఊపిరితిత్తులకు ఎలాంటి నష్టం వాటిల్లదని లేదంటే పరిస్థితి సివియర్ అవుతుందని అన్నారు. (చదవండి: నిమోనియా.. అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు, ఇవి పాటిస్తున్నారా?) -
"బతకడు" అన్న మాటే ఊపిరి పోసింది!అద్భుతం చేసింది!
ఒక్కొసారి నిరాశగా అన్న మాటలు కూడా ఆయుధంగా మారతాయి. అవి వరంగా మారి గెలిచే ఆసక్తిని రేపుతాయి కూడా. బహుశా అందుకేనేమో పెద్దలు విమర్శిస్తున్నారని కూర్చొకు వాటినే ఎదిగేందుకు ఉపయోగపడే మెట్లుగా భావిస్తే విజయం నీ పాదాక్రాతం అని అన్నారు. ఇది జరిగే అవకాశమే లేదు అన్నవి, ఒక్క శాతం కూడా గెలిచే అవకాశం లేనివి కూడా ఏదో ఒక ఊహించని మలుపులో గెలుపు తీరం అందుతుంది, ఒక్క క్షణంలో అంతా మారిపోతుంది. అచ్చం అలాంటి అద్భుత ఘటనే యూఎస్‌లో చోటు చేసుకుంది. ఓ వ్యక్తి విషయంలో ఈ అద్భుతం జరిగింది. యూఎస్‌లో అలెగ్జెండర్ అనే వ్యక్తి 1946లో జన్మించాడు. ఆ టైంలో యూఎస్ అంతట పోలియో ప్రబలంగా ఉంది. అతను కూడా ఈ పోలియో బారినే పడ్డాడు. అయితే ఇతని కేసు మాత్రం యూఎస్ చరిత్రలో పిల్లలకు సోకిన 58 వేల పోలియో కేసుల్లో ఘోరమైనది. అలెగ్జెండర్ ఆరేళ్ల ప్రాయంలో ఈ పోలియో బారిన పడ్డాడు. ఎంత ఘోరంగా అంటే.. అతడి వెన్నుపాముని చచ్చుపడేలా చేసి ప్రాణాంతకంగా మారింది. దీని కారణంగా అలెగ్జాండర్ ఊపిరి పీల్చుకోలేని స్థితికి చేరుకున్నాడు. నిజానికి ఈ పోలీయో వ్యాధి పోలియోన్ లేదా పోలియోమైలిటిస్ అనే పోలియో వైరస్ వల్ల వస్తుంది. దీని కారణంగా వికలాంగులు కావడమో లేదా ప్రాణాంతకంగా మారవచ్చు. పోలియో వ్యాక్సిన్‌ని యూఎస్ 1955లోనే ఆమోదించింది. పిల్లలందరికీ అందించింది కూడా. 1979 కల్లా దేశం పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది కూడా. అప్పటికే అలెగ్జాండర్కి జరగకూడని నష్టం జరిగిపోయింది. శరీరం అంతా చచ్చుబడి శ్వాస తీసుకోలేని స్థితిలో ఉన్న అలెగ్జాండర్కి ట్రాకియోటమీ అనే ఇనుప ఊపిరితిత్తులు అమర్చారు. అది అతని మెదడు నుంచి కాలి వరకు కవర్ అయ్యి ఉంటుంది. అది అతన్ని కదలడానికి లేదా దగ్గడానికి అనుమతించదు. నిజం చెప్పలంటే అతను ఎప్పటి వరకు బతుకుతాడనేది కూడా చెప్పలేం. ఏ క్షణమైన చనిపోవచ్చు. ఏదో వైద్యులు అతన్ని కాపాడేందుకు అమర్చిన పరికరమై తప్ప అతని లైఫ్ టైం పెంచేది మాత్రం కాదు. వైద్యులు కూడా అతను బతకడు, బతికే అవకాశం లేదనే భావించారు. కొద్ది రోజుల్లోనే చనిపోతాడనే అన్నారు. అయితే అతడు అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఏకంగా 70 ఏళ్లు అలానే కదలకుండా ఆ ఇనుప యంత్రంతో బతికాడు. ఐతే అత్యాధునిక యంత్రాలు వచ్చినప్పటికీ అతడి శరీరం ఆ భారి ఇనుమ మెషిన్‌కి అలవాటుపడటంతో ఈ తేలికపాటి ఆధునిక యంత్రాలు అమర్చడం అసాధ్యమయ్యింది. అసలు చెప్పాలంటే అతడు ఉన్న పరిస్థితి తలుచుకుని దిగులుతో చనిపోతారు. కానీ అతడు ఎంతో గుండె నిబ్బరంతో ఆ సమస్యతో పోరాడుతూనే బతికి చూపించాడు. పైగా పాఠశాల విద్యను పూర్తి చేశాడు. న్యాయశాస్త్రంలో పట్టుభద్రుడవ్వడమే గాక చాలా ఏళ్ల పాటు ప్రాక్టీస్ చేశాడు కూడా. కదలేందుకు వీలు లేకపోయినా నిరాశ చెందలేదు. కాలు మెదపకుండా జీవితాంత ఆ బరువైన ఇనుప మెషిన్‌తో అలానే బెడ్‌కి పరిమితమైన కూడా.. "జీవించాలి" అనే ఆశను వదులుకోలేదు. ఎలాగో చనిపోతాడని తెలిసి కూడా ఏదో ఒకటి చేస్తూ.. బతకగడం అంటే మాటలు కాదు. ఎందుకంటే మొత్తం మిషన్‌తో ఓ డబ్బాలో ఉన్న మొండెలా కనిపిస్తాడు అలెగ్జాండర్. ఏ క్షణంలోనూ కొద్దిపాటి నిరాశకు, నిస్ప్రుహను దరిచేరనివ్వకుండా బతికి చూపడు. అతడి ఈ తెగువే అత్యంత పొడవైనా ఐరన్ ఊపిరితిత్తులు కలిగినా వృద్ధ రోగిగా గిన్నిస్ వరల్డ్ రికార్డులకెక్కేలా చేసింది. అతడికి వైద్యం చేసిన వైద్యులే చనిపోయారేమో కానీ అత్యంత దయనీయ స్థితిలో బతకీడుస్తూ కూడా తాను పూర్ణాయుష్కుడినే అని నిరూపించాడు. వైద్యులు సైతం అతడు ఇప్పటి వరకు జీవించి ఉండటం అద్భుతమని చెప్పారు. క్షణికావేశంలో అకృత్యాలకు పాల్పడే యువతకు, అనుకున్నది జరగలేదన్న వ్యథతో బతుకు ముగించుకోవాలన్న వ్యక్తులందరీకి అతడు స్ఫూర్తి. ఓపికతో ఎలా వ్యవహిరించాలి, క్లిష్ట పరిస్థితుల్లో ఎలా సంయమనంతో ఉండి అందరూ ముక్కున వేలేసుకునేలా ఎలా జీవించాలో అతడు చేసి చూపించాడు. (చదవండి: గమ్యస్థానాలకు చేర్చే "ట్రావెలింగ్ పార్క్"..చూస్తే ఫిదా అవ్వడం ఖాయం!) -
78 ఏళ్ల వృద్ధుడికి.. లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్
ఇంతవరకు గుండె, కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి విన్నాం. కానీ ఊపరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్ గురించి వినలేదు కదా. ఇది కాస్త రిస్క్‌తో కూడిన అపరేషన్ మాత్రమే గాక వైద్యులకు కూడా ఒక రకంగా సవాలుతో కూడిన ఆపరేషనే. అలాంటి శస్త్ర చికిత్సను ఆసియాలోనే అత్యంత వృద్ధుడికి చేశారు చెన్నైకి చెందిన వైద్యులు. వివరాల్లోకెళ్తే..బెంగళూరు నివాసి అయిన 78 ఏళ్ల వృద్ధుడు తీవ్రమైన అక్యూట్ రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్కి సంబంధించిన ఆస్పిరేషన్ న్యుమోనియాతో బాధపడుతున్నాడు. అతను గత 50 ఏళ్లుగా కృత్రిమ ఆక్సిజన్ సపోర్టుతోనే జీవితాన్ని వెళ్లదీస్తున్నాడు. అయితే రోగి మంచి ఆరోగ్యంగా ఉండటమే గాక శస్త్ర చికిత్సకు తట్టుకోగలడని వైద్యులు నిర్ధారించేక అతనికి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ చేయాలనే నిశ్చయానికి వచ్చారు. ఆ రోగికి శస్త్ర చికిత్స చేయడానికి చెన్నైలోని మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి ఎంజీఎం హెల్త్‌కేర్ ముందుకొచ్చింది. అలాగే సదరు వృద్ధుడు కూడా ద్వైపాక్షిక ఊపిరితిత్తుల మార్పిడి కోసం స్టేట్ ట్రాన్స్‌ప్లాంట్ రిజిస్ట్రీలో నమోదు చేసుకున్నాడు. అతనికి సరిపడా ఊపిరిత్తులను ఇచ్చే దాత అందుబాటులోకి రావడంతో ఈ ప్రక్రియను ప్రారంభించారు వైద్యులు. ఈ ప్రక్రియకు ముందే రోగి పరిస్థితి తీవ్రం కావడంతో సుమారు 15 రోజుల పాటు వెంటిలేటర్‌పైనే ఉన్నాడు. అయినా వైద్యలు రిస్క్ తీసుకుని మరీ ఈ శస్త్ర చికిత్సకు పూనుకున్నారు. ఈ ఆపరేషనే రిస్క్ అనుకుంటే అతడి వయసు, ఆరోగ్య పరిస్థితి మరింత సవాలుగా మారింది వైద్యలకు. ఈ మేరుకు అతనికి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హార్ట్ అండ్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్ అండ్ మెకానికల్ సర్క్యులేటరీ సపోర్ట్ డైరెక్టర్ కే ఆర్ బాలకృష్ణన్, కో డైరెక్టర్ సురేష్ రావు, కేజీ పల్మనాలజీ డిపార్ట్మెంట్ డైరెక్టర్ అపర్ జిందాల్‌తో కూడిన వైద్య బృందం ఆ వృద్దుడికి ఆపరేషన్ నిర్వహించారు. అదృష్టవశాత్తు ఆపరేషన్ విజయవంతమవ్వడమే గాక అతను కూడా మంచిగా కోలుకుంటున్నాడు. దీంతో వైద్య బృందం హర్షం వ్యక్తం చేయడమే గాక మా ఆస్పత్రి ప్రపంచ స్థాయి ఆరోగ్య సంరక్షణ సేవలను అందించడంలో సదా అంకితభావంతో పనిచేస్తుందని సగర్వంగా పేర్కొంది. ఇక ద్వైపాక్షిక ఊపరితిత్తు మార్పిడి అంటే..దీనిలో సర్జన్లు వ్యాధిగ్రస్తులైన ఊపిరితిత్తులను ఒక్కొక్కటిగా తీసివేసి ఆపై దాత ఊపిరితిత్తులను రోగి శ్వాసనాళాల్లోకి గుండెకు దారితేసే రక్తనాళాలను జతచేస్తారు. (చదవండి: నేను ప్రెగ్నెంట్‌ని.. ఆ మాత్రలు వాడుతున్నా? బిడ్డకు ఏదైనా ప్రమాదమా?) -
బెలూన్లు ఊది.. ఒక్క ఊపిరితిత్తితోనే కరోనాను జయించిన నర్సు
భోపాల్: భారత్‌లో ఇటీవల కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో కేసులతో పాటు మరణాలు కూడా విపరీతంగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో అధిక భాగం ఊపిరి అందక వేలాది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. మరో పక్క కరోనా వచ్చిందనే భయంతోనే.. కొందరు ఊపిరి ఆడటంలేదనే ఆందోళనతో కూడా కొన్ని ప్రాణాలు గాల్లో కలిసిన ఘటనల ఉన్నాయి. కానీ ధైర్యం, నమ్మకం ఉంటే కరోనా మనల్ని ఏం చేయలేదని నిరూపించింది ఓ మహిళ. ఒక్క ఊపిరితిత్తితో తనపై దాడిచేసిన కరోనా వైరస్ జయించింది. అది కూడా హోమ్ ఐసోలేషన్‌లో ఉండి 14 రోజుల్లోనే తరిమేసింది మధ్యప్రదేశ్ కు చెందిన ఓ నర్సు. కంగారు పడక.. కరోనాను జయించింది మధ్యప్రదేశ్‌కు చెందిన ప్రఫులిత్ పీటర్ టికామ్‌గఢ్ ఆసుపత్రిలో నర్సుగా కొవిడ్ వార్డులో పనిచేస్తోంది. ఈ క్రమంలోనే ఆమెకు ఇటీవల కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. కరోనా ప్రభావం ఎక్కువగా ఊపిరితిత్తులపైనే ఉంటుందని అందరికీ తెలిసిన విషయమే. దీంతో ఒక్క ఊపిరితిత్తితోనే బతుకుతున్న ప్రఫులిత్ పీటర్ ఏమైపోతుందోనని కుటుంబ సభ్యులు, సన్నిహితులు భయపడిపోయారు. కానీ ప్రపులిత్ మాత్రం కేవలం 14 రోజులపాటు హోం ఐసోలేషన్‌లో ఉండి వేగంగా కోలుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. కరోనాను జయించిన ప్రపులిత్ అది తనకు ఎలా సాధ్యమైందో మాట్లాడుతూ.. కరోనా సోకినా నేను భయపడలేదు. ధైర్యం కోల్పోలేదు. హోం ఐసోలేషన్‌లో ఉన్నప్పుడు యోగా, ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్స్‌ర్‌సైజ్‌లు క్రమం తప్పకుండా చేసేదాన్ని. అలాగే ఊపిరితిత్తులకు బూస్టింగ్ ఇవ్వటానికి బెలూన్లు ఊదేదాన్ని అని చెప్పుకొచ్చింది. ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకుంది. దీనికితోడు తన ధైర్యమే కరోనా మీద విజయం సాధించేలా చేసిందని ప్రఫులిత్ చెప్పుకొచ్చింది. ప్రఫులిత్ పీటర్ చిన్నప్పుడు ఓ ప్రమాదానికి గురైంది. ఆ ప్రమాదంలో ఒక ఊపిరితిత్తి బాగా డ్యామేజ్ కావడంతో ఆపరేషన్ చేసి ఒకదాన్ని తొలగించాలని చెప్పారు. వేరే దారి లేక కుటుంబ సభ్యుల అనుమతితో డాక్టర్లు ఒక ఊపిరితిత్తిని తొలగించారు. అప్పటి నుంచి ప్రపులిత్ ఒక్క ఊపిరితిత్తితోనే జీవిస్తోంది. ( చదవండి: విషాదం: రోజు వ్యవధిలో కడుపులో బిడ్డ, డాక్టర్ మృతి ) -
గ్రేటర్‌కు ‘ప్రాణ వాయువు’!
సాక్షి, మేడ్చల్ జిల్లా: హైదరాబాద్ మహానగర ప్రజలకు ఆహ్లాదాన్ని పంచటంతోపాటు పర్యావరణ పరిరక్షణ కోసం బహుదూర్‌పల్లి, నాగారం, నారపల్లి ఫారెస్ట్ బ్లాకుల్లో మూడు అర్బన్ లంగ్స్ స్పేస్ (పార్కులు)ను త్వరలో ప్రారంభించేందుకు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అటవీ శాఖ సన్నద్ధమవుతున్నది. జిల్లాలో ఇప్పటికే హరితహారంలో భాగంగా నాలుగు ఫారెస్టు బ్లాకులను అర్బన్ లంగ్స్ స్పేస్(పార్కులు)లుగా అభివృద్ధి చేశారు. ఇవి నగర ప్రజలకు ఆహ్లాదాన్ని అందిస్తున్నాయి. జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో బహుదూర్‌పల్లి ఫారెస్టు బ్లాకులోని 50 ఎకరాలు , నాగారం ఫారెస్టు బ్లాకులోని 70 ఎకరాలు , నారపల్లి ఫారెస్టు బ్లాకులో 60 ఎకరాల్లో అర్బన్ పార్కులు రూపొందిస్తారు. వీటి నిర్మాణంలో భాగంగా ముందుగా ఫారెస్టు బ్లాకు చుట్టూ ఫెన్సింగ్(రక్షణ గోడలు), కందకాలు,పైప్ లైన్లు ఏర్పాటు చేశారు. అలాగే ప్లాంటేషన్‌లో కలుపు మొక్కలను ఏరివేయటం, మొక్కల పెరుగుదలను మెరుగుపచ్చటానికి, సౌందర్య రూపాన్ని మెరుగు పర్చటానికి కొమ్మల కత్తిరింపు కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తారు. వర్షాకాలంలో సతత హరిత జాతులతో ఇప్పటికీ ఉన్న చెట్లల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఒక్కో అర్బన్ పార్కు నిర్మాణానికి సంబంధించి రూ.50 లక్షల వరకు జిల్లా అటవీ శాఖ వెచ్చిస్తున్నట్లు తెలుస్తున్నది. ఈ మూడు పార్కులు నెల రోజుల వ్యవధిలో నగర ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి. ఏడాదిలో మరో ఎనిమిది పార్కులు ఈ ఏడాదిలోగా మరో ఎనిమిది అర్బన్ లంగ్స్ స్పేస్‌లు అందుబాటులోకి తీసురావాలని జిల్లా అటవీశాఖ యోచిస్తున్నది. టీఎస్ ఎఫ్డీసీ ఆధ్వర్యంలో గౌడవెళ్లి, తూముకుంట, లాల్‌గడ్ మలక్‌పేట్ తదితర ఫారెస్టు బ్లాకుల్లో మూడు అర్బన్ పార్కులు ఏర్పాటు చేస్తున్నారు. టీఎస్ ఐఐసీ నేతృత్వంలో ఎల్లంపేట్ ఫారెస్టు బ్లాకులో, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో గాజుల రామారం, హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో తుర్కపల్లి, టూరిజం ఆధ్వర్యంలో యాద్గార్పల్లి, కీసర, ధర్మారం–ఉప్పరపల్లి ఫారెస్టు బ్లాకుల్లో అర్బన్ లంగ్స్ పార్కులు నిర్మిస్తున్నారు. పర్యావరణానికి దోహదం... హైదరాబాద్ నగర ప్రజలకు ప్రస్తుతం నాలుగు అర్బన్ పార్కులు ఆహ్లాదాన్ని, ఆనందాన్ని అందించటంతోపాటు పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తున్నాయి. మేడిపల్లి ఫారెస్టు బ్లాకులో 100 ఎకరాల్లో శాంతివనం పేరుతో అర్బన్ లంగ్స్ స్పేస్ ప్రజలకు ఆహ్లాదాన్ని పంచుతుంది. అలాగే కండ్లకోయలోని ఆక్సిజన్ పార్కు, నారపల్లిలోని భాగ్యనగరం నందన వనం పార్కు, దూలపల్లి ఫారెస్టు బ్లాకులోని ప్రశాంత వనం పార్కు నగర ప్రజలతోపాటు చిన్నపిల్లలు, టూరిస్టులను అలరిస్తున్నాయి. ఈ అర్బన్ పార్కుల్లో ప్రతి రోజు 150 నుంచి 300 మంది ప్రజలు ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేస్తుండగా, ఆహ్లాదం, ఆనందం కోసం ప్రతి రోజు 200 నుంచి 500 మంది ప్రజలు వస్తున్నట్లు జిల్లా అటవీ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. వాకర్స్ నుంచి నెలకు రూ.150, ఏడాదికి అయితే రూ.1200 నామినల్ ఫీజు మెయింటెనెన్స్ కింద అటవీ శాఖ వసూలు చేస్తున్నది. -
ఊపిరితిత్తిలాంటి గాడ్జెట్.. హైడ్రోజన్ ఇస్తుంది!
ఊపిరితిత్తుల్లోకి నీళ్లు పోతే ప్రమాదం.. కానీ స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన ఊపిరితిత్తుల్లాంటి పరికరంలోకి ప్రవేశిస్తే మాత్రం భలే ప్రయోజనం. ఏంటంటారా? నీళ్లన్నీ అత్యంత సమర్థమైన ఇంధనం హైడ్రోజన్‌గా మారిపోతుంది. కార్లు మొదలుకొని స్మార్ట్ఫోన్ల వరకూ అన్ని రకాల గాడ్జెట్లను నడుపుకునేందుకు ఈ ఇంధనాన్ని వాడుకోవచ్చునని అంటున్నారు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త యీ కూయి. సైంటిఫిక్ జర్నల్ జౌల్ తాజా సంచికలో ప్రచురితమైన వివరాల ప్రకారం.. ఈ గాడ్జెట్‌కు మన ఊపిరితిత్తుల పనితీరుకూ చాలా సారూప్యం ఉంది. మన ఊపిరితిత్తుల్లోకి గాలి ప్రవేశించినప్పుడు అదొక పలుచటి త్వచం గుండా ప్రయాణిస్తుంది. ఈ త్వచం గాల్లోని ఆక్సిజన్‌ను వేరు చేసి రక్తంలోకి పంపుతుంది. ఊపిరితిత్తుల ప్రత్యేక నిర్మాణం ఫలితంగా ఈ ప్రక్రియ మొత్తం చాలా సమర్థంగా జరిగిపోతూంటుంది. స్టాన్‌ఫర్డ్ శాస్త్రవేత్తలు ప్లాస్టిక్ పదార్థంతో అచ్చం ఊపిరితిత్తుల్లోని త్వచాన్ని పోలినదాన్ని తయారు చేశారు. బయటివైపు ఉన్న చిన్న రంధ్రాలు నీళ్లను తిప్పికొడితే లోపలిభాగంలో ఉండే బంగారు, ప్లాటినమ్ నానో రంధ్రాలు నీటిద్వారా ఏర్పడే గాలి బుడగల నుంచి హైడ్రోజన్‌ను వేరు చేయగలవు. ప్రస్తుతానికి ఈ గాడ్జెట్వంద డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వరకూ మాత్రమే పనిచేస్తోందని.. అధిక ఉష్ణోగ్రతలను కూడా తట్టుకునేలా చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని యీ కూయి తెలిపారు. -
మీ ఊపిరితిత్తుల్ని క్యాన్సర్ బారిన పడనివ్వకండి!
ఇవాళ నో టొబాకో డే. పొగాకును రకరకాల మార్గాల్లో వాడటం లేదా పొగతాగడం క్యాన్సర్‌కు దారితీస్తుందని మీకు తెలుసు కదా. పొగాకు కారణంగా వచ్చే క్యాన్సర్లు ఒకటీ రెండూ కాదు. నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలుకొని మరెన్నో రకాల క్యాన్సర్లకు పొగాకే కారణం. మన ఒంట్లో అద్భుతమైనది మన ఊపిరి తీసుకునే వ్యవస్థ. దాన్ని పొగాకు ఎలా ధ్వంసం చేస్తుందో మనకు అర్థమయ్యే తేలికపాటి పోలికలతో చెప్పుకుందాం. మీకు తెలుసా?! మనం ప్రతి రోజూ 16,000 లీటర్ల గాలి పీలుస్తాం. ఇందుకోసం 24 గంటల వ్యవధిలో కనీసం 22,000 సార్లు శ్వాసిస్తాం. ఇవన్నీ మనకు తెలియకుండానే మనం రోజూ చేసే పనులంటే మీరు నమ్ముతారా? కానీ ఇది పూర్తిగా నిజం. ఇక మన ఊపిరితిత్తుల బరువు కేవలం 1.3 కిలోలు. అంతేనా అనుకుంటున్నారా. కానీ కేవలం ఇంతే బరువున్న మన ఊపిరితిత్తులను విశాలంగా పరిచేస్తే... అవి వ్యాపించే వైశాల్యం ఎంతో తెలుసా? ఒక టెన్నిస్ కోర్టంత! ఇంతటి విశాల స్థలంలో గాలి మార్పిడి జరగడానికి ఊపిరితిత్తుల నిర్మాణం ఓ బహుళ అంతస్తుల భవనంలాగా ఎంత సంక్లిష్టంగా ఉంటుందో కూడా చూద్దాం. ఊపిరితిత్తుల నిర్మాణం, పనితీరు ఇలా... ఊపిరి తీసుకోవడం అనే ప్రక్రియలో జరిగేదేమిటి? ఏమిటంటే... మంచి గాలి అయిన ఆక్సిజన్ అన్ని కణాలుకు అందాలి. అన్ని కణాల్లోని వ్యర్థాలు, చెడుగాలి కార్బన్‌డైఆక్సైడ్ రూపంలో బయటకు పోవాలి. మరి కేవలం కిలో బరువున్న ఊపిరితిత్తుల్లో 16,000 లీటర్ల గాలి మార్పిడి ఎలా జరుగుతుంది? ఇందుకే టెన్నిస్ కోర్టంత వైశాలాన్ని కేవలం 1.3 కిలోలకు కుదించింది ప్రకృతి. అలా కుదించే ప్రక్రియలో... ఊపిరితిత్తుల్లో 28 అంచెలు ఏర్పాటు చేసింది. అంటే ఊపిరితిత్తుల వ్యవస్థను 28 అంతస్తుల మల్టీస్టోరీడ్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. దీనిలోని మొదటి అంతస్తును ముక్కు రంధ్రాలు అనే సెల్లార్ అని అనుకుందాం. గాలి పీల్చే సమయంలో గాలిలోని కాలుష్యాలూ, కొన్ని సస్పెండెడ్ పార్టికిల్స్‌ను లోపలికి వెళ్లవు. అలా ముక్కురంధ్రాల దగ్గరే వాటి పార్కింగ్ జరిగిపోతుంది. కేవలం గాలి మాత్రమే ఇక అక్కడి నుంచి పై అంతస్తులకు వెళ్తుంది. ముక్కు రంధ్రాల దగ్గర్నుంచి విండ్పైప్కు వెళ్లే మార్గం మొదటి అంతస్తు, ఇక విండ్‌పైప్ ట్రాకియా చీలి రెండు బ్రాంకియాస్గా మారడం రెండో అంతస్తు అనుకుందాం. ఇలా చీలినప్పుడల్లా ఒక అంతస్తు పెరిగి, మరో అంచెకు వెళ్తామనే ఉజ్జాయింపుతో ఒక లెక్క చెప్పుకుందాం. ఈ లెక్క ప్రకారం మన ఊపిరితిత్తుల పై అంతస్తు చేరే సరికి అందులో 28 అంతస్తులుంటాయన్న మాట. అయితే 14వ అంతస్తు నుంచి ఊపిరితిత్తుల్లోని నిర్మాణాలు కంటికి కనిపించనంత సంక్లిష్టంగా ఉంటాయి. ఎంతటి సంక్లిష్టం అంటే...? రెండు తమ్మెలు (లోబ్స్)గా ఉండే ఊపిరితిత్తుల్లోని చివరన ‘గాలి మార్పిడి గదులు’ ఉంటాయి. అంటే వీటిని ఊపిరితిత్తుల చివరి అంతస్తులో ఉండే ‘పెంట్‌హౌజ్’ అనుకుందాం. వీటినే వైద్యపరిభాషలో అల్వియోలై అంటారు. ఈ ఆల్వియోలై అనే పెంట్‌హౌజ్‌లో గాలిమార్పిడి జరుగుతుందన్నమాట. ఊపిరితిత్తుల్లో మొత్తం అల్వియోలై అంటే... పెంట్‌హౌజ్‌లు దాదాపు 30 కోట్లు ఉంటాయి! మనం ముందే చెప్పకున్నాం కదా... ఊపిరితిత్తులను విశాలంగా పరిస్తే టెన్నిస్ కోర్టంత వైశాల్యంతో పరుచుకుంటుందని! ఇంతటి... అంటే దాదాపు 70 నుంచి 100 చదరపు మీటర్లంత పరుచుకునే టెన్నిస్కోర్టంతటి స్థలంలో రక్తనాళాలు సన్నసన్నగా చీలీ, చీలీ, సన్నటి నాళాలుగా చీలిపోయి ఉంటాయి. అలా చీలిపోయి ఉన్న ఆ రక్తనాళాలన్నింటి పొడవునూ లెక్కేస్తే... అవి 2400 కిలోమీటర్ల పొడవుంటాయి! అంటే ఇంతటి విశాల స్థలంలో గాలిమార్పిడి జరుగుతుందన్నమాట. గాలి మార్పిడి ఎలా జరుగుతుందంటే...? మన 28 అంతస్తుల ఊపిరితిత్తుల నిర్మాణంలోకి చేరిన గాలి ఒక్కొక్క అంతస్తూ ఎక్కుతూ చివరి అంతస్తుకు చేరుతుంది. అక్కడ అన్ని కణాలకూ ఆక్సిజన్ అందడానికి వీలుగా ఆక్సిజన్‌ను రక్తానికి అందిస్తుంది. ఇదెలా జరుగుతుందో తెలుసా? 14వ అంతస్తు తర్వాత రక్తం ద్రవంలా కాకుండా... ఓ పేపర్లా పరచుకుంటుంది. ఆ బ్లాటింగ్ పేపర్‌లాంటి రక్తంలోకి ఆక్సిజన్ ఇంకుతుంది. మరి అలాగే రక్తంలోని వ్యర్థాలున్నీ కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు ఇతర కాలుష్యాల రూపంలో బయటకు రావాలి కదా. ఇందుకోసం బయటకు రావడానికీ తగిన నిర్మాణాలూ ఉంటాయి. వీటిని ‘మ్యూకో సీలియరీ ఎస్కలేటర్స్’ అంటారు. గాలిలో కొవ్వొత్తి వెలుగు కదలాడిన విధంగా ఊపిరితిత్తుల్లోని సీలియా అనే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఒక క్రమపద్ధతిలో కదులుతూ... మనకు సరిపడని ధూళి, దుమ్ముకణాలనూ ఊపిరితిత్తులు ఈ ఎస్కలేటర్‌పైకి ఎక్కించి బయటకు పంపేస్తూ ఉంటాయి. అందుకే వీటిని మన ఊపిరితిత్తుల బిల్డింగ్‌లోని ‘ఎస్కలేటర్స్’గా మనమూ చెప్పుకోవచ్చన్నమాట. పొగ తాగుతూ మనమేం చేస్తామంటే... ఇంతటి విశాలమైన మన లంగ్స్ బిల్డింగ్‌లోని అన్ని అంతస్తుల్లోకి మనం ఉద్దేశపూర్వకంగా సిగరెట్‌తో ప్రతిసారీ 4000 రకాల విష రసాయనాలనను పంపుతుంటాం. అందులో కనీసం 60 కి పైగా రసాయనాలు క్యాన్సర్‌ను కలిగించేవి. మనలోని వ్యర్థాలు ఎస్కలేటర్ ఎక్కి బయటకు వచ్చేలోపే... మరింత కాలుష్యాన్ని లోపలికి పంపుతుంటామన్నమాట. దీంతో ఒకదశలో ఎస్కలేటర్ వ్యవస్థ దెబ్బతింటుంది. అవి జామ్ అయిపోతాయి. దాంతో కాలుష్యాలు లోపలే ఉండిపోతాయి. మనం రోజూ కొన్నిసార్లు మాత్రమే సిగరెట్ తాగవచ్చుగాక... కానీ అక్కడే ఉండిపోయిన ఆ విషపదార్థాలతో మనం పీల్చే మొత్తం 16,000 లీటర్ల గాలి అంతా కలుషితమైపోతుంది. ఆ విషాలు రక్తంతో పాటు ప్రవహించి లంగ్‌క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ అంటూ నోరు మొదలుకొని... కాలి వరకూ అనేక రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. అంటే పొగాకు సరదా ఇంత డేంజర్ అన్నమాట. ఇది చదివాకైనా మీరు ఊపిరితిత్తుల అద్భుతాన్ని గుర్తెరగండి. అంతటి అద్భుతమైన వాటిని వృథాగా పొగాకుతో కాల్చేసి, పొగచూరిపోయేలా చేయకండి. అలా చేయకపోవడం ద్వారా ఎన్నో రకాల క్యాన్సర్లనూ నివారించవచ్చని గుర్తించండి. Dr. Ch. Mohana Vamsy Chief Surgical Oncologist Omega Hospitals, Hyderabad Ph: 98480 11421, Kurnool 08518273001 -
ముక్కుపుడక తెచ్చిన తంటా!
చెన్నై: మగువుల సౌందర్యాన్ని ఇనుమడింపజేసే ముక్కుపుడక ఓ పెద్దావిడ ప్రాణం మీదికి తెచ్చింది. కేవలం అలంకరణ కోసమే కాకుండా.. మహిళలు సాంప్రదాయకంగా ముక్కు పుడకలు ధరించడం ఆనవాయితీ. అలా పెట్టుకున్న ముక్కుపుడక కాస్త ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. అది కాస్తా ప్రమాదవశాత్తు ఊపిరితిత్తుల్లో చేరి అపాయకరంగా మారిన ఘటన తమిళనాడు మదురై లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే వెల్లమ్మాళ్ (78) అనే మహిళ ముక్కు పుడకను తొలగించడానికి బంధువులు ప్రయత్నిచినపుడు పొరపాటున దాని సీల నోట్లోకి జారి, ఊపిరితిత్తుల్లో అడ్డుపడింది. ఆ తర్వాత వారు ఆవిషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో ఆమె అస్వస్థతకు గురైంది. తీవ్రమైన శ్వాస సమస్యతో గత నెలరోజులుగా ఇబ్బంది పడుతుండటంతో వైద్యులను సంప్రదించింది. ఈ నేపథ్యంలో ఎక్స్ రే తీసినపుడు బంగారు ముక్కుపుడక స్క్రూ ఎడమ ఊపిరితిత్తిలో నిలిచిపోయినట్టు గమనించారు. ఆమెకు ఊపిరి తీసుకోవడం మరింత ఇబ్బంది కరంగా మారడంతో దాన్ని తొలగించాలని వైద్యులు నిర్ణయించారు. ఈ క్రమంలో థొరాసిక్ సర్జరీ ద్వారా నుంచి దానిని తొలగించారు. బ్రాంకో స్కోపీ (శ్వాస నాళ అంతర్దర్శిని) సహాయంతో ఫోర్ సెప్స్‌తో దానిని బయటకు తీసారు. ఆపరేషన్ అనంతరం వెల్లమ్మాళ్ ఆరోగ్యం నిలకడగా ఉందని , సాధారణంగా శ్వాస తీసుకోకలుగుతోందని మెడికల్ కాలేజ్ అండ్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ వైద్యులు తెలిపారు. సంక్లిష్టమైన ఈ ఆపరేషన్ కోసం గంట సమయం పట్టిందన్నారు. -
నేను మీ ఊపిరితిత్తిని
నేను ఆనంద్ కుడి ఊపిరితిత్తిని. ఎడమ వైపు ఉన్న నా భాగస్వామి కంటే కాస్త పెద్దగా ఉంటాను. నాలో మూడు భాగాలు ఉంటే, నా భాగస్వామిలో రెండు భాగాలే ఉంటాయి. నేను లేత గులాబిరంగులోని ఫుట్‌బాల్ బ్లాడర్లా తన ఛాతీలో వేలాడుతూ ఉంటాననుకుంటాడు ఆనంద్. నిజానికి నేను రబ్బరుతో చేసిన బాత్ స్పాంజ్‌లా ఉంటాను. తను చంటిపిల్లాడిగా ఉండేటప్పుడే నా ఛాయ లేతగులాబిగా ఉండేది. ఇప్పటి వరకు ఆనంద్ తాగి పారేసిన రెండులక్షల సిగరెట్ల పొగకు తోడు పట్టణ కాలుష్యం ఫలితంగా అసహ్యకరమైన నల్లని మచ్చలతో నేను బూడిద రంగులోకి మారాను. ఆనంద్ ఛాతీలో మూడు మూసేసిన గదులు ఉంటాయి. ఒకటి నాకు, రెండోది నా భాగస్వామికి, మూడోది ఆనంద్ గుండెకు. నేను నా గదిలో వేలాడుతూ ఉంటాను. నాకు ఎలాంటి కండరాలూ లేవు. అందువల్ల శ్వాసక్రియలో నాది పరోక్ష పాత్ర మాత్రమే. దాదాపు అరకిలో బరువు తూగే నేను, నా గదిని పూర్తిగా ఆక్రమించుకుని ఉంటాను. ఆనంద్ ఊపిరి పీల్చుకునేటప్పుడు నేను వ్యాకోచించడానికి వీలుగా నా గదిలో కాస్తంత ఖాళీ జాగా ఉంటుంది. అలాగే, అతడు ఊపిరి విడిచి పెట్టేటప్పుడు నేను ముడుచుకుంటాను. నాలో జరిగే ఈ ప్రక్రియ అంతా ఒక రీకాయిల్ మెకానిజం. స్వచ్ఛంద నియంత్రణ ఆనంద్ శరీరంలోని గుండె, మెదడు వంటి చాలా ఇతర అవయవాల మాదిరిగానే నేను కూడా స్వచ్ఛంద నియంత్రణతోనే పనిచేస్తాను. అంటే, ఆనంద్ ప్రమేయం లేకున్నా నా పని నేను చేసుకుపోతూనే ఉంటాను. శ్వాసక్రియకు సంబంధించిన స్వయం నియంత్రణ అంతా ‘మెడ్యులా ఆబ్లంగేటా’లో జరుగుతూ ఉంటుంది. వెన్నెముక మెదడుకు అనుసంధానమైన చోట చిన్న బుడిపెలా ఉండే ఈ భాగం సున్నితమైన కెమికల్ డిటెక్టర్‌గా పనిచేస్తుంది. శ్రమించే కండరాలు పుష్కలంగా ఆక్సిజన్ వాడుకుంటూ, వ్యర్థమైన కార్బన్ డయాక్సైడ్ను బయటకు పంపే క్రమంలో రక్తంలో స్వల్పంగా ఆమ్లస్వభావం ఏర్పడుతుంది. ‘మెడ్యులా ఆబ్లంగేటా’ ఈ మార్పును సత్వరమే గుర్తించి, నన్ను మరింత వేగంగా పనిచేసేలా ఆదేశిస్తుంది. ఆనంద్ కఠిన వ్యాయామం చేసినట్లయితే, మరింత గాఢంగా, మరింత వేగంగా ఊపిరి తీసుకునేలా ఆదేశిస్తుంది. ఆనంద్ విశ్రాంతిగా మంచం మీద పడుకుని ఉంటే, అతడికి నిమిషానికి తొమ్మిది లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. కూర్చుని పనిచేసుకుంటూ ఉంటే నిమిషానికి 18 లీటర్లు, నడుస్తుంటే నిమిషాలు 27 లీటర్లు, పరుగు తీస్తే నిమిషానికి 56 లీటర్ల ఆక్సిజన్ అవసరమవుతుంది. సాధారణంగా ఆనంద్ నిమిషానికి పదహారుసార్లు ఊపిరి తీసుకుంటాడు. ఒక్కోసారి అరలీటరు గాలి లోపలకు పీల్చుకుంటాడు. అయితే, అతడు పీల్చిన గాలంతా నా లోపలకు చేరుకోదు. చాలా వరకు గాలి వాయునాళంలో, శ్వాసనాళాల్లో దిశారహితంగా సంచరిస్తూ ఉంటుంది. అయితే, నాలోకి చేరే గాలి వెచ్చగా, కాస్త తేమగా ఉండాలని కోరుకుంటాను. కొద్ది సెంటీమీటర్ల మార్గంలో ప్రయాణించే గాలిని అలా వెచ్చగా, తేమగా మారడం ఒక విచిత్రమైన ప్రక్రియ. ఆనంద్ కంట్లో ఉంటే అశ్రుగ్రంథులు, ముక్కులో, నోట్లో, గొంతులో ఉండే తేమ ఉత్పత్తి చేసే గ్రంథుల ద్వారా నాలోకి వచ్చే గాలిలోకి రోజుకు అరలీటరు వరకు తేమ చేరుతుంది. వాయుకోశాల్లోని రక్తనాళాలు చలికాలంలో వ్యాకోచించుకుని, వేసవిలో సంకోచించుకుని ఉంటాయి. ఫలితంగా నాలోకి చేరే గాలి నిరంతరం ఒకే రకమైన వెచ్చదనంతో ఉంటుంది. వీటి వల్లే ఇబ్బందులు నిజానికి చెప్పుకోవాలంటే నాకు తలెత్తే ఇబ్బందులకు సవాలక్ష కారణాలు ఉన్నాయి. ఆనంద్ ప్రతిరోజూ గాలితో పాటే రకరకాల బ్యాక్టీరియా, వైరస్ వంటి సూక్ష్మజీవులను, దుమ్ము ధూళి కాలుష్యాలను కూడా లోపలకు పీల్చుకుంటూ ఉంటాడు. అయితే, చాలా వరకు నన్ను నేను రక్షించుకునే ఏర్పాట్లు నాలోనే ఉన్నాయి. ఆనంద్ ముక్కు, గొంతులో ఉండే లైసోజైమ్ ప్రభావానికి బ్యాక్టీరియా, వైరస్లు చాలా వరకు మరణిస్తాయి. అప్పటికీ అవి తప్పించుకుని శ్వాసకోశంలోకి చేరితే, అక్కడ ఉండే ‘ఫాగోసైట్’ కణాలు వాటిని వెంటాడి మరీ తినేస్తాయి. సూక్ష్మజీవులతో పెద్దగా ఇబ్బంది లేదు గానీ, రసాయనాలతో కలుషితమైన గాలితోనే నాకు ఎక్కువగా ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. గాలితో పాటు నాలోకి చేరే సల్ఫర్ డయాక్సైడ్, బెంజోపైరిన్, నైట్రోజన్ డయాక్సైడ్, లెడ్ వంటి రసాయనాలను చాలా వరకు ఎదుర్కోగలను. ఇలాంటి పదార్థాల్లో కొన్ని నైలాన్‌ను సైతం కరిగించగలవు. ఇవి నేరుగా నాలోకి చేరితే, నాకు ఎంతటి ముప్పు కలిగించ గలవో ఊహించండి. అయితే, చాలా వడపోత తర్వాతే గాలి నాలోకి చేరుతుంది. ముక్కులోని సన్నని వెంట్రుకలు కాస్త పెద్దగా ఉండే కాలుష్య కణాలను అక్కడే అడ్డుకుంటాయి. ముక్కులో, గొంతులో, వాయునాళం, శ్వాసనాళాల్లో ఉండే జిగురు పదార్థం మ్యూకస్ మిగిలిన కాలుష్య కణాలను అడ్డుకుని, బయటకు పంపేస్తుంది. ఇంకా సూక్ష్మాతి సూక్ష్మమైన కాలుష్య పదార్థాలను శ్వాసనాళాల్లో ఉండే సన్నని వెంట్రుకల వంటి ‘సిలియా’ బయటకు పంపేస్తాయి. ఈ ‘సిలియా’ సెకనుకు పన్నెండుసార్లు కదలాడుతూ కాలుష్యాలను బయటకు తరిమేస్తాయి. వాటి కదలికల వేగానికే, శ్వాసనాళాల్లో దిగువన ఉండే మ్యూకస్ కఫంగా గొంతులోకి చేరుతుంది. పొగ మానేస్తే మళ్లీ పర్ఫెక్ట్ ఆనంద్ సిగరెట్ తాగితే ఆ పొగ ప్రభావానికి ‘సిలియా’ కదలికలు తాత్కాలికంగా నిలిచిపోతాయి. ఫలితంగా ఒక్కోసారి శ్వాసనాళంలో దురద ఏర్పడి దగ్గుతెర తరుముకొస్తుంది. ఆనంద్‌కు ముప్పయ్యేళ్లుగా సిగరెట్ అలవాటు ఉంది. ఈ పాడు అలవాటు వల్ల శ్వాసనాళాల్లో మ్యూకస్‌ను స్రవించే పొర మూడురెట్లు మందంగా మారింది. దీనివల్ల తలెత్తే ముప్పును ఆనంద్ తెలుసుకోలేకపోతున్నాడు. బరువెక్కిన మ్యూకస్ శ్వాసకోశాల్లోకి జారుతున్న కొద్దీ, అతడు మునిగిపోతున్నట్లే లెక్క. శ్వాసకోశాలు మ్యూకస్‌తో నిండిపోతూ ఉండటంతో సరిగా ఊపిరి కూడా తీసుకోలేడు. అయితే, ‘సిలియా’ కదలికల వల్ల తరచుగా వచ్చే దగ్గు అతడిని రక్షిస్తూ ఉంటుంది. దగ్గు వేగానికి లోపల పేరుకున్న కాలుష్యాల్లో కొన్ని బయటకు పోతూ ఉంటాయి. అయితే, ఆనంద్ మరీ ఎక్కువగా సిగరెట్లు తాగేస్తూ నాలోకి నానా చెత్తా పంపిస్తూ ఉంటాడు. పొగతో వచ్చే కొన్ని కణాలు నాలోని సూక్ష్మ మార్గాల్లోకి చేరి, వాటిని మూసేస్తూ ఉంటాయి. ఇంకొన్ని నా కణజాలంపై మచ్చలుగా మిగిలిపోతాయి. ఎక్కువ కాలం ఇలా సాగితే, నా గోడలు ఎలాస్టిసిటీని కోల్పోతాయి. అందువల్ల గాలి విడిచేటప్పుడు నేను పూర్తిగా ముడుచుకోలేకపోతాను. అలాంటప్పుడు నాలోని కార్బన్ డయాక్సైడ్ పూర్తిగా బయటకు పోదు. లోపలకు చేరే ఆక్సిజన్‌కు తగినంత చోటు ఉండదు. నా పరిస్థితి బాగుపడాలంటే, సిగరెట్లు మానేయడం తప్ప ఆనంద్‌కు మరో మార్గం లేదు. పొగ తాగడం మానేసిన నెల్లాళ్లలోనే నేను పునరుత్తేజం పొందడం ప్రారంభిస్తాను. కొద్ది నెలల్లో తిరిగి పూర్తి జవసత్వాలను సంతరించుకుంటాను. ఇదీ నా నిర్మాణం పది సెంటీమీటర్ల పొడవున ఉండే ఆనంద్ వాయునాళం దిగువ వైపు రెండు శాఖలుగా విడిపోతుంది. ఇవే శ్వాసనాళాలు వాటిలో ఒకదాని దిగువ నేను, మరోదాని దిగువ నా భాగస్వామి వేలాడుతూ ఉంటాం. వాయునాళం నుంచి ఆకారాన్ని గమనిస్తే, తలకిందులుగా వేలాడే చెట్టులా కనిపిస్తా. శ్వాసనాళాలు కాస్త పెద్దగానే ఉంటాయి. అవి మరిన్ని శాఖలుగా... సూక్ష్మ శ్వాసనాళాలుగా విస్తరించి ఉంటాయి. వీటి వ్యాసం సెంటీమీటరులో నలభయ్యవ వంతు మాత్రమే ఉంటుంది. ఇవన్నీ నాలోకి గాలిని పంపే వాహకాలు. అయితే, నా అసలు పనంతా వాయుకోశాలలోనే. ద్రాక్షపళ్ల గుత్తిలా ఉంటుందా తిత్తి. బయట దానిని పరిస్తే, టెన్నిస్ కోర్టులో సగం విస్తీర్ణాన్ని ఆక్రమిస్తుంది. ప్రతి వాయుకోశంలో కొన్ని వేల రక్తకేశనాళికలు సాలెగూడులా అల్లుకుని ఉంటాయి. ఒక్కో కేశనాళిక గుండా రెప్పపాటు కాలంలో ఎర్ర రక్తకణాలు ప్రవహిస్తూ ఉంటాయి. ఉల్లిపొరలాంటి కేశనాళికల ద్వారా ఈ ఎర్ర రక్తకణాలు తమతో తీసుకువచ్చిన కార్బన్ డయాక్సైడ్ను వదిలేసి, అక్కడ ఉన్న ఆక్సిజన్‌ను తీసుకుని ముందుకు సాగుతాయి. ఇంట్లోని కాలుష్యంతోనూ ఇబ్బందులు కాలుష్యం అనగానే మనం బయటి కాలుష్యమే అనుకుంటాం. కానీ ఇంట్లోనూ కాలుష్యం ఉంటుంది. ఇల్లు ఊడ్చేటప్పుడు, బూజు దులిపేటప్పుడు రేగే ధూళికణాలతో పాటు.. అగరుబత్తీలు, కర్పూరం వంటివి వెలిగించినప్పుడు, హారతి ఇచ్చేటప్పుడు, వంటింట్లో పోపు పెట్టేటప్పుడు వచ్చే ఘాటైన వాసనను కూడా మనం ఇంటి కాలుష్యంగానే పరిగణించాలి. ఈ ఘాటు వల్ల ఇంట్లోని పిల్లలకు, వయసులో పెద్దవాళ్లకు ఎలర్జీలు వచ్చే ప్రమాదం ఉంటుంది. ఎలర్జీ స్వభావం లేని వాళ్లకు సైతం.. ఘాటు తీవ్రతను బట్టి తమ్ములు, దగ్గు, ఆయాసం, జలుబు వంటివి రావచ్చు. ఎలర్జీ స్వభావం ఉన్నవాళ్లకైతే ఇవే మరింత తీవ్రమై ఊపిరి తీసుకోవడం కూడా కష్టం కావచ్చు. అందుకే ఇంట్లోని కిటికీలన్నీ వీలైనంత వరకు తెరచి ఉంచడం మంచిది. ఎగ్జాస్ట్ ఫ్యాన్లు ఉంటే మరీ మంచిది. ఇవి లేనప్పుడు, ఇంట్లోని పొగల ఘాటు ఎక్కువగా ఉన్నప్పుడు ముక్కుకు మందపాటి కర్చీఫ్‌ను కట్టుకోవడం ద్వారా కాలుష్యాన్ని నిరోధించవచ్చు. చిన్న పిల్లలు స్కూలుకు వెళ్లేటప్పుడు ఆటోలలో, బస్సులలో, టూ వీలర్స్‌లో బయటి కాలుష్యానికి గురవుతారు. మాస్కులు ధరించడం వల్ల కొంత ప్రయోజనం ఉంటుంది. - డాక్టర్ రమణ ప్రసాద్, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ కిమ్స్ హాస్పిటల్, హైదరాబాద్ -
25 అక్టోబర్ 1990 తొలి లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ విజయవంతం
కాలిఫోర్నియాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ ఎ. వాఘన్ స్టేర్న్స్ 12 సంవత్సరాల పాపకు ఆమె తల్లి నుంచి సేకరించిన ఊపిరితిత్తిని అమర్చారు. డాక్టర్ స్టేర్న్స్ పిడియాట్రిక్ కార్డియో థొరాసిక్ సర్జన్‌గా చాలా ప్రసిద్ధి. ఆయన నాలుగు నెలల పాపకు గుండెమార్పిడి చికిత్సతో సహా అప్పటికే ఎన్నో విజయవంతమైన అవయవమార్పిడి శస్త్రచికిత్సలు చేశారు. నిజానికి హార్ట్- లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ అంతకు ముందే అంటే 1968 లోనే జరిగింది. అయితే అది విజయవంతం కావడానికి చాలా కాలం పట్టింది. టొరెంటోలోని జనరల్ హాస్పిటల్లో డాక్టర్ బ్రూస్ రియిట్జ్ చేసిన లంగ్ ట్రాన్స్‌ప్లాంటేషన్ జీవన్మృతుల నుంచి సేకరించిన అవయవాల సహాయంతో జరిగింది కాగా, ఇప్పుడు అంటే 1990 అక్టోబర్ 25న డాక్టర్ స్టేర్న్స్ చేసిన ఈ ట్రాన్స్‌ప్లాంటేషన్ రోగి తల్లి జీవించి ఉండగానే ఆమె నుంచి సేకరించడం ద్వారా జరిగింది కావడం విశేషం. -
ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరికి స్వల్ప అస్వస్థత
విశాఖపట్నం, మెడికల్ : పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గొంతు, ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్తో బాధపడుతూ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో బుధవారం రాత్రి చేరారు. వైద్య పరీక్షల అనంతరం వైద్యులు ఆమె జ్వరం, గొంతునొప్పితో బాధపడుతున్నట్టు వెల్లడించారు. ఆమెను గురువారం చింతపల్లి జెడ్పీటీసీ సభ్యురాలు పద్మకుమారి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు కర్ణంనాయుడు, జీకేవీధి, చింతపల్లి, కొయ్యూరు, జి.మాడుగుల, పాడేరులకు చెందిన పలువురు ఎంపీటీసీ సభ్యులు పరామర్శించారు. -
బ్రాంకైటిస్ ఆస్తమాకు కారణం కావచ్చు
ఒక్క క్షణం శ్వాస తీసకోవడంలో ఇబ్బంది ఏర్పడితే విలవిల్లాడిపోతాం. కానీ చాలామంది పొగతాగే అలవాటుతో శ్వాససంబంధ సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలు పోయే ప్రమాదం ఉన్న శ్వాసకోశ వ్యాధులకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. పొగతాగే అలవాటు ఉన్నవారిలో ఊపిరితిత్తులు మరింత త్వరగా క్షీణిస్తాయి. సాధారణంగా పొగతాగే వారిలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు అనేకం వస్తుంటా యి. పొగతాగే వారు వదిలే పొగలో సుమారు 43 రకాల క్యాన్సర్ పదార్థాలు, 30 రకాల లోహాలు, 4500 రకాల పదార్థాలు ఉంటాయి. వీటివలన శ్వాసనాళాలు కుచించుకుపోయి దీర్ఘకాలం పాటు దగ్గు, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు ఉంటాయి. ఈ సమస్యను క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ (సీఓపీడీ) అంటారు. లక్షణాలు: ఈ సమస్యతో బాధపడేవారికి కనిపించే ప్రధాన లక్షణం దగ్గు. దగ్గుతో పాటు శ్లేష్మం వస్తుంటుంది. పగటివేళ దగ్గు ఎక్కువగా ఉంటుంది. శ్వాసనాళాల్లో అడ్డు అనిపించడం వంటి లక్షణాలు ఉంటాయి. పొగతాగే వారిలో వయసు పైబడిన వారిలో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. ఈ సమస్య ఎక్కువైనపుడు రాత్రుళ్ళు నిద్రపట్టదు. 40 ఏళ్ళు పైబడిన వారిలో ఇది కొంత ఎక్కువగా కనిపిస్తుంది. చిన్నపిల్లల్లో కనిపించదు. తీవ్రమైన దశ: దగ్గు, కళ్లె పడటం ఎక్కువగా ఉంటుంది. పగలైనా, రాత్రివేళయినా శ్వాసించడం కష్టమవుతుంది. మెట్లు ఎక్కడం, చిన్న చిన్న పనులు కూడా చేసుకోలేని పరిస్థితికి వస్తారు. రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ల వల్ల కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. బరువు తగ్గిపోతారు. క్రానిక్ బ్రాంకైటిస్: ఒక ఏడాదిలో కనీసం మూడు నెలల చొప్పున వరుసగా రెండేళ్ళపాటు కళ్లెతో కూడిన దగ్గు ఉంటే దానిని క్రానిక్ బ్రాంకైటిస్‌గా అనుమానించాలి. దీనిలో కూడా శ్వాసనాళం ఇన్ఫెక్షన్ల వల్ల అవి దళసరిగా మారతాయి. ఫలితంగా గాలిని పీల్చుకోవడంలో, బయటకు విడవడంలో ఇబ్బందులు వస్తాయి. వాయునాళ పొరల్లో ఉండే గ్రంథులు కఫం (మ్యూకస్) అనే జిగురు స్రావాన్ని తయారుచేస్తాయి. ఇది గాలిలోని దుమ్ముకణాలను వడగొట్ట్టడానికి, హాని కలిగించే పదార్థాల తీవ్రతను తగ్గించడానికి, శ్వాసనాళాల్లో తగినంత తడి ఉండేలా చూడటానికి ఉపకరిస్తుంది. క్రానిక్ బ్రాంకైటిస్‌తో బాధపడే వారిలో ఆ గ్రంథులు పెద్దగా అవుతాయి. దానివలన కఫం అక్కడే ఎక్కువగా తయారయి ఊపిరితిత్తులలోకి చేరి తిష్ట వేస్తుంది. దీంతో తెరలు తెరలుగా దగ్గు వస్తూ ఉంటుంది. ఇది ఏళ్లతరబడి ఉండిపోయినప్పుడు రెసిస్టెన్స్ పవర్ తగ్గిపోతుంది. జాగ్రత్తలు: ఇంటి వాతావరణం శుభ్రంగా ఉంచుకోవాలి. పొగ, వాహనకాలుష్యం, దుమ్ము, ధూళికి దూరంగా ఉండాలి. శ్వాస సంబంధిత వ్యాయామాలు చేస్తుండాలి. నిత్యం వాకింగ్ చేయడంతో పాటు నిపుణుల పర్యవేక్షణలో కండర పటిష్టతను పెంచే వ్యాయామాలు చేస్తుండాలి. పండ్లు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవాలి. ప్రొటీన్ ఎక్కువగా లభించే ఆహారపదార్థాలను తినాలి. ఎత్తుకు తగిన బరువు ఉండేలా చూసుకోవాలి. హోమియో చికిత్స: శ్వాస సంబంధ సమస్యలకు హోమియోలో మంచి చికిత్స అందుబాటులో ఉంది. ముఖ్యంగా ఆర్సనిక్ ఆల్బం, ఆంటినమ్, ఇపికాక్ ఆంటినమ్ క్రూడ్ వంటి మందులు ఈ వ్యాధిని తగ్గించడానికి బాగా ఉపయోగపడతాయి. అయితే రోగి శారీరక, మానసిక లక్షణాలను పరిశీలించాక చికిత్స అందించాల్సి ఉంటుంది. హోమియో మందులు సీఓపీడీ, క్రానిక్ బ్రాంకైటిస్ నుంచి చాలావరకు ఉపశమనాన్ని కలిగిస్తాయి. రోగనిరోధకశక్తిని పెంపొందిస్తాయి. పైగా హోమియో మందుల వల్ల ఎలాంటి దుష్ఫలితాలు ఉండవు. అనుభవజ్ఞులైన హోమియో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటే శ్వాస సంబంధ వ్యాధులు ఇట్టే తగ్గిపోతాయి. హైదరాబాద్, నిజామాబాద్, కర్నూలు, గుంటూరు, విజయవాడ, వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, బెంగళూరు - చెన్నై అపాయింట్మెంట్ కొరకు 9246199922