ఇవాళ నో టొబాకో డే. పొగాకును రకరకాల మార్గాల్లో వాడటం లేదా పొగతాగడం క్యాన్సర్‌కు దారితీస్తుందని మీకు తెలుసు కదా. పొగాకు కారణంగా వచ్చే క్యాన్సర్లు ఒకటీ రెండూ కాదు. నోటి క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ మొదలుకొని మరెన్నో రకాల క్యాన్సర్లకు పొగాకే కారణం. మన ఒంట్లో అద్భుతమైనది మన ఊపిరి తీసుకునే వ్యవస్థ. దాన్ని పొగాకు ఎలా ధ్వంసం చేస్తుందో మనకు అర్థమయ్యే తేలికపాటి పోలికలతో చెప్పుకుందాం. మీకు తెలుసా?! మనం ప్రతి రోజూ 16,000 లీటర్ల గాలి పీలుస్తాం. ఇందుకోసం 24 గంటల వ్యవధిలో కనీసం 22,000 సార్లు శ్వాసిస్తాం. ఇవన్నీ మనకు తెలియకుండానే మనం రోజూ చేసే పనులంటే మీరు నమ్ముతారా? కానీ ఇది పూర్తిగా నిజం. ఇక మన ఊపిరితిత్తుల బరువు కేవలం 1.3 కిలోలు. అంతేనా అనుకుంటున్నారా. కానీ కేవలం ఇంతే బరువున్న మన ఊపిరితిత్తులను విశాలంగా పరిచేస్తే... అవి వ్యాపించే వైశాల్యం ఎంతో తెలుసా? ఒక టెన్నిస్ కోర్టంత! ఇంతటి విశాల స్థలంలో గాలి మార్పిడి జరగడానికి ఊపిరితిత్తుల నిర్మాణం ఓ బహుళ అంతస్తుల భవనంలాగా ఎంత సంక్లిష్టంగా ఉంటుందో కూడా చూద్దాం.
ఊపిరితిత్తుల నిర్మాణం, పనితీరు ఇలా...
ఊపిరి తీసుకోవడం అనే ప్రక్రియలో జరిగేదేమిటి? ఏమిటంటే... మంచి గాలి అయిన ఆక్సిజన్ అన్ని కణాలుకు అందాలి. అన్ని కణాల్లోని వ్యర్థాలు, చెడుగాలి కార్బన్‌డైఆక్సైడ్ రూపంలో బయటకు పోవాలి. మరి కేవలం కిలో బరువున్న ఊపిరితిత్తుల్లో 16,000 లీటర్ల గాలి మార్పిడి ఎలా జరుగుతుంది? ఇందుకే టెన్నిస్ కోర్టంత వైశాలాన్ని కేవలం 1.3 కిలోలకు కుదించింది ప్రకృతి. అలా కుదించే ప్రక్రియలో... ఊపిరితిత్తుల్లో 28 అంచెలు ఏర్పాటు చేసింది. అంటే ఊపిరితిత్తుల వ్యవస్థను 28 అంతస్తుల మల్టీస్టోరీడ్ బిల్డింగ్ అని చెప్పుకోవచ్చు. దీనిలోని మొదటి అంతస్తును ముక్కు రంధ్రాలు అనే సెల్లార్ అని అనుకుందాం. గాలి పీల్చే సమయంలో గాలిలోని కాలుష్యాలూ, కొన్ని సస్పెండెడ్ పార్టికిల్స్‌ను లోపలికి వెళ్లవు. అలా ముక్కురంధ్రాల దగ్గరే వాటి పార్కింగ్ జరిగిపోతుంది. కేవలం గాలి మాత్రమే ఇక అక్కడి నుంచి పై అంతస్తులకు వెళ్తుంది. ముక్కు రంధ్రాల దగ్గర్నుంచి విండ్‌పైప్‌కు వెళ్లే మార్గం మొదటి అంతస్తు, ఇక విండ్‌పైప్ ట్రాకియా చీలి రెండు బ్రాంకియాస్‌గా మారడం రెండో అంతస్తు అనుకుందాం. ఇలా చీలినప్పుడల్లా ఒక అంతస్తు పెరిగి, మరో అంచెకు వెళ్తామనే ఉజ్జాయింపుతో ఒక లెక్క చెప్పుకుందాం. ఈ లెక్క ప్రకారం మన ఊపిరితిత్తుల పై అంతస్తు చేరే సరికి అందులో 28 అంతస్తులుంటాయన్న మాట. అయితే 14వ అంతస్తు నుంచి ఊపిరితిత్తుల్లోని నిర్మాణాలు కంటికి కనిపించనంత సంక్లిష్టంగా ఉంటాయి.
ఎంతటి సంక్లిష్టం అంటే...?
రెండు తమ్మెలు (లోబ్స్)గా ఉండే ఊపిరితిత్తుల్లోని చివరన ‘గాలి మార్పిడి గదులు’ ఉంటాయి. అంటే వీటిని ఊపిరితిత్తుల చివరి అంతస్తులో ఉండే ‘పెంట్‌హౌజ్’ అనుకుందాం. వీటినే వైద్యపరిభాషలో అల్వియోలై అంటారు. ఈ ఆల్వియోలై అనే పెంట్‌హౌజ్‌లో గాలిమార్పిడి జరుగుతుందన్నమాట. ఊపిరితిత్తుల్లో మొత్తం అల్వియోలై అంటే... పెంట్‌హౌజ్‌లు దాదాపు 30 కోట్లు ఉంటాయి! మనం ముందే చెప్పకున్నాం కదా... ఊపిరితిత్తులను విశాలంగా పరిస్తే టెన్నిస్ కోర్టంత వైశాల్యంతో పరుచుకుంటుందని! ఇంతటి... అంటే దాదాపు 70 నుంచి 100 చదరపు మీటర్లంత పరుచుకునే టెన్నిస్‌కోర్టంతటి స్థలంలో రక్తనాళాలు సన్నసన్నగా చీలీ, చీలీ, సన్నటి నాళాలుగా చీలిపోయి ఉంటాయి. అలా చీలిపోయి ఉన్న ఆ రక్తనాళాలన్నింటి పొడవునూ లెక్కేస్తే... అవి 2400 కిలోమీటర్ల పొడవుంటాయి! అంటే ఇంతటి విశాల స్థలంలో గాలిమార్పిడి జరుగుతుందన్నమాట.
గాలి మార్పిడి ఎలా జరుగుతుందంటే...?
మన 28 అంతస్తుల ఊపిరితిత్తుల నిర్మాణంలోకి చేరిన గాలి ఒక్కొక్క అంతస్తూ ఎక్కుతూ చివరి అంతస్తుకు చేరుతుంది. అక్కడ అన్ని కణాలకూ ఆక్సిజన్ అందడానికి వీలుగా ఆక్సిజన్‌ను రక్తానికి అందిస్తుంది. ఇదెలా జరుగుతుందో తెలుసా? 14వ అంతస్తు తర్వాత రక్తం ద్రవంలా కాకుండా... ఓ పేపర్‌లా పరచుకుంటుంది. ఆ బ్లాటింగ్ పేపర్‌లాంటి రక్తంలోకి ఆక్సిజన్ ఇంకుతుంది. మరి అలాగే రక్తంలోని వ్యర్థాలున్నీ కార్బన్‌డైఆక్సైడ్‌తో పాటు ఇతర కాలుష్యాల రూపంలో బయటకు రావాలి కదా. ఇందుకోసం బయటకు రావడానికీ తగిన నిర్మాణాలూ ఉంటాయి. వీటిని ‘మ్యూకో సీలియరీ ఎస్కలేటర్స్’ అంటారు. గాలిలో కొవ్వొత్తి వెలుగు కదలాడిన విధంగా ఊపిరితిత్తుల్లోని సీలియా అనే వెంట్రుకల్లాంటి నిర్మాణాలు ఒక క్రమపద్ధతిలో కదులుతూ... మనకు సరిపడని ధూళి, దుమ్ముకణాలనూ ఊపిరితిత్తులు ఈ ఎస్కలేటర్‌పైకి ఎక్కించి బయటకు పంపేస్తూ ఉంటాయి. అందుకే వీటిని మన ఊపిరితిత్తుల బిల్డింగ్‌లోని ‘ఎస్కలేటర్స్’గా మనమూ చెప్పుకోవచ్చన్నమాట.
పొగ తాగుతూ మనమేం చేస్తామంటే...
ఇంతటి విశాలమైన మన లంగ్స్ బిల్డింగ్‌లోని అన్ని అంతస్తుల్లోకి మనం ఉద్దేశపూర్వకంగా సిగరెట్‌తో ప్రతిసారీ 4000 రకాల విష రసాయనాలనను పంపుతుంటాం. అందులో కనీసం 60 కి పైగా రసాయనాలు క్యాన్సర్‌ను కలిగించేవి. మనలోని వ్యర్థాలు ఎస్కలేటర్ ఎక్కి బయటకు వచ్చేలోపే... మరింత కాలుష్యాన్ని లోపలికి పంపుతుంటామన్నమాట. దీంతో ఒకదశలో ఎస్కలేటర్ వ్యవస్థ దెబ్బతింటుంది. అవి జామ్ అయిపోతాయి. దాంతో కాలుష్యాలు లోపలే ఉండిపోతాయి. మనం రోజూ కొన్నిసార్లు మాత్రమే సిగరెట్ తాగవచ్చుగాక... కానీ అక్కడే ఉండిపోయిన ఆ విషపదార్థాలతో మనం పీల్చే మొత్తం 16,000 లీటర్ల గాలి అంతా కలుషితమైపోతుంది. ఆ విషాలు రక్తంతో పాటు ప్రవహించి లంగ్‌క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ అంటూ నోరు మొదలుకొని... కాలి వరకూ అనేక రకాల క్యాన్సర్లకు కారణమవుతుంది. అంటే పొగాకు సరదా ఇంత డేంజర్ అన్నమాట. ఇది చదివాకైనా మీరు ఊపిరితిత్తుల అద్భుతాన్ని గుర్తెరగండి. అంతటి అద్భుతమైన వాటిని వృథాగా పొగాకుతో కాల్చేసి, పొగచూరిపోయేలా చేయకండి. అలా చేయకపోవడం ద్వారా ఎన్నో రకాల క్యాన్సర్లనూ నివారించవచ్చని గుర్తించండి.
Dr. Ch. Mohana Vamsy
Chief Surgical Oncologist
Omega Hospitals, Hyderabad
Ph: 98480 11421,
Kurnool 08518273001
మీ ఊపిరితిత్తుల్ని క్యాన్సర్ బారిన పడనివ్వకండి!
Published Thu, May 31 2018 12:57 AM | Last Updated on Thu, May 31 2018 12:57 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment