vemulawada rajann temple
-
ముక్కోటి ఏకాదశి: ఇల.. వైకుంఠం..
ముక్కోటి ఏకాదశి సందర్భంగా ఉమ్మడి జిల్లాలోని వైష్ణవాలయాలు సోమవారం భక్తులతో పులకించాయి. వివిధ అవతారాల్లో విష్ణుమూర్తి భక్తులకు ఉత్తర ద్వారం గుండా దర్శనమిచ్చారు. వేకువజామునుంచే ఉత్సవమూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించగా, ఆలయాల వద్ద భక్తులు బారులుతీరారు. సాక్షి, వేములవాడ: వేములవాడ రాజన్న సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవంగా జరిగాయి. ఉత్తర ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేందుకు వేకువజామునే భక్తులు ఆలయానికి చేరుకున్నారు. స్వామివారికి సుప్రభాత సేవ అనంతరం ప్రాతఃకాల పూజ తదుపరి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించి అంబారిసేవలపై స్వామి వారలను ప్రతిష్టించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముక్కోటి ఏకాదశి పర్వదినం ప్రాశస్థ్యాన్ని స్థానాచార్యులు గోపన్నగారి శంకరయ్యశర్మ, చంద్రగిరి శరత్‌శర్మలు వివరించారు. కార్యక్రమంలో ఈవో కృష్ణవేణి, కలెక్టర్ కృష్ణభాస్కర్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, ఏఈవో ఉమారాణి, మాజీ ప్రజాప్రతినిధులు భక్తులు పాల్గొన్నారు. అపర భద్రాద్రిలో.. ఇల్లందకుంట(హుజూరాబాద్): ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని ఇల్లందకుంటలోని అపర భద్రాద్రిలో వేకువజామునే శ్రీసీతారాములను పట్టువస్త్రాలతో అలంకరించారు. పూజరులు శేషాం రామచార్యులు, వంశీధరాచార్యులు వేద మంత్రోచ్ఛారణల మధ్య అధ్యయనోత్సవం ఆరంభం, తొళ్ళక్కం ద్రావిడ ప్రభందపారాయణం నిర్వహించారు. శ్రీసీతారాముల దర్శనం కోసం భక్తులు వేకువజాము నుంచే ఆలయం వద్ద బారులుతీరారు. సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను గురుడ వాహనంపై పుర వీధులగుండా డప్పుచప్పుళ్లు, మేళా తాళాల మధ్య ఊరేగించారు. జెడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయగణపతి దంపతులు, ఎంపీపీ పావని వెంకటేష్ దంపతులు స్వామివార్లను దర్శించుకున్నారు. కార్యక్రమంలో సర్పంచ్ శ్రీలతసురేందర్‌రెడ్డి, ఎంపీడీఓ స్వరూప, వివిధ గ్రామాల సర్పంచ్‌లు, అధికారులు, భక్తులు సీతారాములను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. ధర్మపురిలో.. ధర్మపురి: ధర్మపురి శ్రీలక్ష్మీనృసింహస్వామి సన్నిధిలో ముక్కోటి ఏకాదశి వేడుకలు వైభవోపేతంగా జరిపారు. వేకువజామునుంచే వేద మంత్రోచ్ఛారణల మధ్య స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవమూర్తులను పురవీధుల్లో ఊరేగించారు. ఈవో శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకలకు ధర్మపురి పీఠాధిపతి శ్రీమత్ పరమహంస పరివ్రాజకాచార్యులు శ్రీ సచ్చితానంద సరస్వతి మహాస్వాములు, శ్రీ విశ్వయోగి విశ్వజిత్ విశ్వంజి గార్లతో పాటు ప్రత్యేక ఆహ్వానితులుగా రాష్ట్ర సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎంపీ వెంకటేశ్ నేత, కలెక్టర్ శరత్, ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, కోరుకంటి చందర్ హాజరయ్యారు. ఎస్పీ సింధూశర్మ ఆధ్వర్యంలో డీఎస్పీ వెంకరమణ, సీఐ లక్ష్మిబాబు బందోబస్తు ఏర్పాటు చేశారు. కరీంనగర్ జడ్జి అనుపమ చక్రవర్తి, జగిత్యాల జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత, జేసి రాజేశం తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. -
రాజన్న వసతి గదుల్లో ఊడిపడ్డ ఫ్యాన్
వేములవాడ: వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకుందామని వచ్చిన ఓ భక్తుడి కుటుంబానికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. నిద్రిస్తున్న బెడ్‌పై ఫ్యాన్ ఊడి పడటంతో అంతా అవాక్కయ్యారు. బెడ్‌పైనుంచి అప్పుడే మూడు నెలల పసిపాపను ఎత్తుకున్న కొద్దిసేపటికే ఫ్యాన్ ఊడి పడటంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని కరీంనగర్‌కు చెందిన కరుణాకర్ అనే భక్తుడు వాపోయాడు. భక్తుడు తెలిపిన వివరాల ప్రకారం..రాజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు తమ కుటుంబం రాజేశ్వరపురం వసతి గదుల్లోని 15వ గదిని గురువారం అద్దెకు తీసుకున్నారు. రాజన్నకు మొక్కులు చెల్లించుకుని గదిలోకి వచ్చి బెడ్‌పై పడుకున్న తమ చిన్నారిని తల్లి అప్పుడే చేతిల్లోకి తీసుకుని పాలిచ్చేందుకు యత్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఫ్యాన్ ఊడిపోయి బెడ్‌పై పడింది. దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాన్ రెక్క తగలడంతో తల్లి చేతికి గాయమైనట్లు చెప్పారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న రాజన్న ఆలయంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అధికారులకు సమాచారం అందించినా కనీసం ఎవరూ స్పందించలేదని కరుణాకర్ ఆరోపించారు. ఇటీవలే రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో నిద్రిస్తున్న ఓ చిన్నారిపైనుంచి ఆవుల మంద పరుగులు తీసిన ఘటనలో బాలుడి ప్రాణాలొదిలిన ఘటన మరచిపోకముందే వసతి గదుల్లో ఫ్యాన్ ఊడిపోయి బెడ్‌పై పడటం ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ఈవిషయమై ఎలక్ట్రికల్ ఏఈ శేఖర్‌ను వివరణ కోరగా.. ఫ్యాన్ బోల్ట్ ఊడిపోయి కింద పడిందని, వెంటనే తమ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ఫ్యాన్‌ను తొలగించి మరో ఫ్యాన్ బిగించినట్లు చెప్పారు. -
ఉత్సవాలకు వాహనాలు కరువు !
ముచ్చటగా మూడే ! కనిపించని రోజుకో వాహనం ముందుకుసాగని తయారీ పనులు పట్టించుకోని అధికారులు వేములవాడ : తెలంగాణలోనే అతిపెద్ద దేవాలయంగా పేరుగాంచిన వేములవాడలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఏటా రూ.70కోట్ల ఆదాయం వస్తున్న ఆలయంలో ఉత్సవ విగ్రహాల ఊరేగింపునకు వాహనాలు కరువయ్యాయి. దేవీ, గణేశ్ నవరాత్రోత్సవాలు, రాజన్న బ్రహ్మోత్సవాలు, వసంత నవరాత్రోత్సవాలు ఏటా నిర్వహిస్తున్నా..రథాల తయారీలో నిర్లక్ష్యం వీడడం లేదు. నందివాహనం, గరుత్మంతుడి వాహనాలు మరమ్మతుల్లో ఉండగా హంస, నెమలి, అశ్వవాహనాలను మాత్రమే ఉత్సవాల్లో వినియోగిస్తున్నారు. వాహనాలేవి? ప్రతి ఉత్సవంలో ఆలయంలోని శ్రీపార్వతీసమేత రాజరాజేశ్వరస్వామి, శ్రీఅనంతపద్మనాభస్వామి వారి ఉత్సవమూర్తులను పురవీధుల్లో పెద్దసేవలపై ఊరేగిస్తుంటారు. రోజుకో వాహనంపై ఉత్సవమూర్తులను ఊరేగించాల్సి ఉంటుంది. కానీ మూడే వాహనాలను వినియోగిస్తున్నారు. శనివారం పదకొండు రోజుల పాటు దేవినవరాత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ పదకొండు రోజులు మూడు వాహనాలతోనే గడిపేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. హంస, నెమలి, అశ్వవాహనాలనే ఉపయోగిస్తున్నారని మిగతా వాటి గురించి పట్టించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. నంది, గరుత్మంతుడి వాహనాలు మరమ్మతుల్లో ఉన్నట్లు పూజల విభాగం సిబ్బంది చెప్పడం గమనార్హం. అటకెక్కిన వెండి వాహనాల తయారీ ఏటా నిర్వహించే ఉత్సవాలకు వెండి వాహనాలను తయారు చేయించాలన్న ప్రతిపాదనలు అటకెక్కాయి. నిత్యం ప్రత్యేక పూజల అనంతరం పురవీధుల్లో నిర్వహించే ఉత్సవాలకు సరైన వాహనాలు ఉపయోగించడం లేదని స్థానికులు పేర్కొంటున్నారు. తక్షణమే వెండి వాహనాలు తయారు చేయించాలని రాజన్న భక్తులు కోరుతున్నారు. గతంలో వెండి వాహనాల తయారీకి సంబంధించిన అంశంలో పలువురు కోర్టు చుట్టూ తిరగడం, కేసుల్లో చిక్కుకోవడంతో ఇక్కడి అధికారుల్లో భయం రేకొల్పుతోంది. గతంలో వెండి సమకూర్చుకునే క్రమంలో ఈవో స్థాయి అధికారితోపాటు పది మంది వరకు కోర్టు చుట్టూ తిరిగారని, సీబీసీఐడీ విచారణకు వెళ్లి వచ్చారన్న భయం వెంటాడుతోంది. ప్రణాళికలు పంపడమే! ఉత్సవాల సమయంలో వాహనాల అంశం తెరపైకి రావడంతోనే దేవాదాయశాఖ కమిషనర్‌కు ప్రణాళికలు పంపడంతోనే అధికారులు చేతులు దులుపుకుంటున్నారు. ప్రతి ఏటా దాటవేసే ధోరణే కనిపిస్తుందని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. వాహనాలను రిపేర్ చేయిస్తాం అమ్మవారి ఉత్సవాల్లో భాగంగా స్వామి వారి ఉత్సవమూర్తులను ఊరేగిస్తున్న క్రమంలో మరో రెండు వాహనాలు అవసరం ఉంటుంది. నంది, గరత్మంతుడి వాహనాలను రిపేర్ చేయిస్తాం. ఇక వెండి వాహనాల అంశం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లాం. ఆయన ఆదేశాలతోనే వెండి వాహనాలు తయారు చేసేందుకు పనులు చేపడతాం. ప్రస్తుతం ఉత్సవాలకు మూడు వాహనాలను మాత్రమే ఉపయోగిస్తున్నాం. – దూస రాజేశ్వర్, ఆలయ ఈవో