రాజన్న వసతి  గదుల్లో ఊడిపడ్డ ఫ్యాన్‌ | Miss The Accident At Near | Sakshi
Sakshi News home page

రాజన్న వసతి  గదుల్లో ఊడిపడ్డ ఫ్యాన్‌

Published Fri, Apr 6 2018 1:21 PM | Last Updated on Fri, Apr 6 2018 1:21 PM

Miss The Accident At  Near - Sakshi

గాయపడ్డ భక్తురాలు, ప్రాణాలతో బయటపడ్డ పసిపాప

వేములవాడ: వేములవాడ రాజన్నకు మొక్కులు చెల్లించుకుందామని వచ్చిన ఓ భక్తుడి కుటుంబానికి గురువారం చేదు అనుభవం ఎదురైంది. నిద్రిస్తున్న బెడ్‌పై ఫ్యాన్‌ ఊడి పడటంతో అంతా అవాక్కయ్యారు. బెడ్‌పైనుంచి అప్పుడే మూడు నెలల పసిపాపను ఎత్తుకున్న కొద్దిసేపటికే ఫ్యాన్‌ ఊడి పడటంతో ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడిందని కరీంనగర్‌కు చెందిన కరుణాకర్‌ అనే భక్తుడు వాపోయాడు.

భక్తుడు తెలిపిన వివరాల ప్రకారం..రాజన్నకు మొక్కులు చెల్లించుకునేందుకు తమ కుటుంబం రాజేశ్వరపురం వసతి గదుల్లోని 15వ గదిని గురువారం అద్దెకు తీసుకున్నారు. రాజన్నకు మొక్కులు చెల్లించుకుని గదిలోకి వచ్చి బెడ్‌పై పడుకున్న తమ చిన్నారిని తల్లి అప్పుడే చేతిల్లోకి తీసుకుని పాలిచ్చేందుకు యత్నిస్తున్న క్రమంలో ఒక్కసారిగా ఫ్యాన్‌ ఊడిపోయి బెడ్‌పై పడింది.

దీంతో చిన్నారి ప్రాణాలతో బయటపడిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాన్‌ రెక్క తగలడంతో తల్లి చేతికి గాయమైనట్లు చెప్పారు. కోట్లాది రూపాయల ఆదాయం వస్తున్న రాజన్న ఆలయంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆలయ అధికారులకు సమాచారం అందించినా కనీసం ఎవరూ స్పందించలేదని కరుణాకర్‌ ఆరోపించారు.

ఇటీవలే రాజన్న గుడి చెరువు ఖాళీ స్థలంలో నిద్రిస్తున్న ఓ చిన్నారిపైనుంచి ఆవుల మంద పరుగులు తీసిన ఘటనలో బాలుడి ప్రాణాలొదిలిన ఘటన మరచిపోకముందే వసతి గదుల్లో ఫ్యాన్‌ ఊడిపోయి బెడ్‌పై పడటం ఉద్యోగుల్లో చర్చనీయాంశమైంది. ఈవిషయమై ఎలక్ట్రికల్‌ ఏఈ శేఖర్‌ను వివరణ కోరగా.. ఫ్యాన్‌ బోల్ట్‌ ఊడిపోయి కింద పడిందని, వెంటనే తమ సిబ్బంది అక్కడికి చేరుకుని ఆ ఫ్యాన్‌ను తొలగించి మరో ఫ్యాన్‌ బిగించినట్లు చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement