మరో చేప చిక్కింది
కరీంనగర్ రూరల్, న్యూస్‌లైన్: జిల్లాలోని అవినీతి యంత్రాంగాన్ని ఏసీబీ వెంటాడుతోంది. సోమవారం అవినీతి నిరోధక దినోత్సవం రోజు శంకరపట్నం తహశీల్దార్ మట్ట వెంకటరమణ..ఓ రైతు వద్ద రూ.20వేల లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కాడు. ఈ ఘటన మరువకముందే బుధవారం కరీంనగర్ మండలం చింతకుంట గ్రామపంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డి ఇంటి నంబరు కేటాయించేందుకు ఓ వ్యక్తి వద్ద రూ.6,500 లంచం తీసుకుంటూ ఏసీబీకి అడ్డంగా దొరికాడు. వరుస సంఘటనలు జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగం అవినీతికి పరాకాష్టగా నిలుస్తున్నాయి.
కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ టి.సుదర్శన్‌గౌడ్ కథనం ప్రకారం.. చింతకుంటకు చెందిన సయ్యద్ ఆరీఫ్హుస్సేన్ ఆర్నేళ్ల క్రితం ఇల్లు నిర్మించుకున్నాడు. పదిరోజుల క్రితం ఇంటినంబరు కోసం పంచాయతీ కార్యదర్శి వెంకటరమణారెడ్డిని సంప్రదించాడు. రూ. 6500 లం చం ఇవ్వాలని కార్యదర్శి డిమాండ్ చేయడంతో మంగళవారం ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచనల మేరకు బుధవారం మధ్యాహ్నం 2గంటలకు పంచాయతీ కార్యాలయంలో కార్యదర్శి వెంకటరమణారెడ్డి, బిల్‌కలెక్టర్ రాములకు రూ.6500 ఇచ్చాడు. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్‌గౌడ్ దాడి చేసి పట్టుకున్నారు. కార్యదర్శి, బిల్ కలెక్టర్లపై కేసు నమోదు చేసి ఏసీబీ కోర్టులో హాజరు పరుస్తున్నట్లు డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. తన తల్లి పేరిట ఇల్లు నిర్మించామని, అనుమతి కోసం అప్పుడు కూడా కార్యదర్శికి రూ.7500 లంచం ఇచ్చానని బాధితుడు తెలిపాడు. ప్రస్తుతం ఇంటినంబరు ఇవ్వాలంటే లంచం కోసం వేధించడంతో ఏసీబీని ఆశ్రయించినట్లు చెప్పాడు.
ఏసీబీకి చిక్కిన రెండో కార్యదర్శి
కరీంనగర్ మండలంలో పంచాయతీ కార్యదర్శి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కడం ఇది రెండో ఘటన. తొలిసారి తీగలగుట్టపల్లి పంచాయతీ కార్యదర్శి నవాజొద్దిన్తోపాటు కారోబార్ మల్లయ్యలు గత నెల 13న ఏసీబీకి చిక్కారు. ఇంటిపేరుమార్పిడి కోసం కేవలం రూ. 2వేలకు కార్యదర్శి పట్టుబడగా ప్రస్తుతం కూడా ఇంటి నంబర్ విషయంలోనే కార్యదర్శి చిక్కాడు.
కారోబార్లదే పెత్తనం..
కరీంనగర్ మండలంలోని పలు గ్రామ పంచాయతీల్లో కారోబార్లు, బిల్లుకలెక్టర్లదే పెత్తనం కొనసాగుతోంది. కారోబార్లు చెప్పినట్లుగా పంచాయతీ కార్యదర్శులు నడుచుకోవాల్సిన పరిస్ధితి నెలకొంది. కొన్నేళ్లుగా పనిచేస్తుండటంతో వారు ఆడిందే ఆట, పాడిందే పాటగా సాగుతోంది. తీగలగుట్టపల్లిలో కార్యదర్శి కంటే కారోబార్ మల్లయ్యదే పెత్తనం ఎక్కువగా ఉండేది. కారోబార్లు చేసిన పనికి కార్యదర్శులు బలవుతున్నట్లు పలువురు పంచాయతీ కార్యదర్శులు పేర్కొంటున్నారు.