బాలల చిత్రోత్సవాల్లో చదువుకోవాలి
విద్య విలువను తెలియజేస్తూ స్వీయదర్శకత్వంలో మద్దాళి వెంకటేశ్వరరావు రూపొందించిన చిత్రం ‘చదువుకోవాలి’. సీత, బేబి ఆని, కోట శంకరరావు ముఖ్య తారలుగా రూపొందిన ఈ చిత్రం పలు ప్రశంసలను దక్కించుకుంది. అలాగే, పలు అవార్డులను కూడా చేజిక్కించుకుంది. తాజాగా, ఈ చిత్రానికి మరో గౌరవం దక్కింది. ఈ నెల 14 నుంచి 20వ తేదీ వరకు హైదరాబాద్లో జరిగే అంతర్జాతీయ బాలల చలన చిత్రోత్సవాల్లో ఈ చిత్రం ప్రదర్శితం కాబోతోంది. దర్శక, నిర్మాత చెబుతూ-‘‘చదువుపై వచ్చిన మంచి చిత్రంగా ఇప్పటికే విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి మంచి అభినందనలు అందుతున్నాయి. ఇప్పుడు బాలల చిత్రోత్సవాలకు ఈ చిత్రం ఎంపిక కావడం ఆనందంగా ఉంది. విద్యపై చైతన్యం రగిలించే కథాంశంతో రూపొందించిన ఈ చిత్రాన్ని బాలలందరూ చూసి, స్ఫూర్తి పొందాలన్నది నా ఆకాంక్ష’’ అన్నారు.