Veterinary Assistant Jobs
-
ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు షాక్
సాక్షి, హైదరాబాద్: డెయిరీ ఒకేషనల్ కోర్సు చదివి పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ (వీఏ) ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తోన్న వేలాది మంది విద్యార్థులకు షాక్ తగిలింది. వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు కనీస అర్హతగా ఉన్న ఒకేషనల్ డెయిరీ, పౌల్ట్రీ సైన్సెస్ కోర్సులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ కోర్సుల స్థానంలో రెండేళ్ల కాలవ్యవధి గల పశుసంవర్ధక పాలిటెక్నిక్‌ను చేర్చింది. పీవీ నర్సిం హారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంతో పాటు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీల నుంచి ఈ కోర్సును పూర్తి చేసిన వారు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు పాత జీవోను సవరిస్తూ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర గత నెల 27న జీవోఎంఎస్ నం: 18 విడుదల చేశారు. 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ తాజా జీవో ప్రకారం పశుసంవర్థక శాఖలో వీఏ పోస్టులను 75 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుండగా, 25 శాతం ఇప్పటికే ఆ శాఖలో పనిచేస్తోన్న రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, ల్యాబ్ అటెండర్లు, ఫీల్డ్మన్లకు పదోన్నతుల ద్వారా ఇవ్వనున్నారు. పదోన్నతి ద్వారా పోస్టు పొందాలంటే సదరు ఉద్యోగి ఇంటర్ బైపీసీ లేదా ఒకేషనల్ డెయిరీ కోర్సు లేదా పౌల్ట్రీ సైన్స్ చదివి ఉండాలని, వీరు ఏడాది పాటు పీవీ నర్సింహారావు విశ్వవిద్యాలయంలో వీఏగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగాలకు దూరం చేయడమే.. ఇక ఒకేషనల్ డెయిరీ, పౌల్ట్రీసైన్స్ కోర్సులు చదివి వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలు ఉంటుందని అంచనా. ఇప్పుడు ఈ కోర్సులను కనీస విద్యార్హత నుంచి తొలగించడంతో తమ ఆశలు అడియాసలయ్యాయని తెలంగాణ ఒకేషనల్ డెయిరీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత 25 ఏళ్లుగా ఈ కోర్సు మనుగడలో ఉందని, ఈ కోర్సు చదివిన చాలామంది ఇప్పటికే పశుసంవర్థక శాఖలో వీఏలుగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపింది. 2017 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 437 మందిలో 80 మంది ఈ కోర్సు చదివిన వారేనని పేర్కొంది. ఎంతో ఆశతో ఈ కోర్సు పూర్తి చేసిన తరుణంలో ఏకంగా తమ కోర్సునే కనీస విద్యార్హత నుంచి తొలగించడం తమను ఉద్యోగాలకు దూరం చేయడమేనని అసోసియేషన్ నేతలంటున్నారు. తాము కూడా ఈ ఉద్యోగాలు పొందేలా వెంటనే తాజా జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: హుజూరాబాద్ స్టార్ క్యాంపెయినర్లు వీరే..) -
రాత పరీక్ష పాసైతే చాలు!
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా 2.70 లక్షల గ్రామ, వార్డు వలంటీర్ల ఉద్యోగాలు, 1.26 లక్షలకుపైగా అనుబంధ కొలువులు, 7,966 లైన్మెన్ ఉద్యోగాలు వెరసి రికార్డు స్థాయిలో 4 లక్షలకుపైగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియకు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చర్యలకు యువత నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది. గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగాలకు గత జూలై 26వ తేదీన నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ప్రక్రియ ఆదివారం అర్ధరాత్రితో ముగియగా గడువు ముగిసే సమయానికి 22,73,793 మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే లక్ష మందికి పైగా దరఖాస్తు ఫీజు చెల్లించని కారణంగా 21,69,719 మందే రాతపరీక్షకు అర్హత పొందారు. దరఖాస్తు చేసుకుంటే ఉద్యోగం! ఒకవైపు ‘సచివాలయ’ ఉద్యోగాలకు రికార్డు స్థాయిలో దరఖాస్తులు అందగా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టు అభ్యర్థులు మాత్రం రాత పరీక్షలో కనీస మార్కులు సాధిస్తే చాలు కొలువు సొంతం చేసుకునే పరిస్థితి నెలకొంది. ఈ పోస్టుకు చాలా తక్కువ మంది దరఖాస్తు చేసుకోవటమే దీనికి కారణం. గ్రామ సచివాలయాల్లో 9,886 పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేయగా కేవలం 6,265 మంది మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు అధికారుల పరిశీలనలో తేలింది. మిగిలిన 18 రకాల ఉద్యోగాలకు తీవ్ర పోటీ నెలకొంది. ఒక్కో ఉద్యోగానికి గరిష్టంగా సరాసరిన 35 మంది పోటీ పడుతున్నారు. సాధారణ డిగ్రీ ఉద్యోగాలకు భారీ పోటీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కేటగిరీ –1లో పేర్కొన్న పంచాయితీ కార్యదర్శి గ్రేడ్–5, మహిళా పోలీసు, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సెక్రటరీ, వార్డు ఆడ్మినిస్ట్రేటివ్ సెక్రటరీ లాంటి నాలుగు రకాల ఉద్యోగాలకు సాధారణ డిగ్రీని కనీస విద్యార్హతగా పేర్కొన్నారు. ఈ కేటగిరీలో మొత్తం 36,449 ఉద్యోగాలను ప్రభుత్వం భర్తీ చేస్తుండగా రాష్ట్రవ్యాప్తంగా 12,54,034 మంది రాత పరీక్షకు అర్హత సాధించారు. -
అర్హులకే అవకాశమివ్వాలి
వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీపై నిపుణుల వ్యాఖ్య సాక్షి, హైదరాబాద్: పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానంపై నిపుణులు పెదవి విరుస్తున్నారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్తర్వులు అశాస్త్రీయంగా ఉన్నాయని, అలాంటి వారితో రైతాంగానికి ఎలాంటి మేలు జరగదని వారు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో రైతాంగానికి అనుబంధంగా ఉన్న పశువుల సంరక్షణ కోసం ప్రభుత్వం నియమించే ఉద్యోగుల అర్హతలను సడలించడం వల్ల ఆశించిన ఫలితాలు రావడం లేదని వారు చెబుతున్నారు. పశువులు, ఇతర జంతువుల సంరక్షణ, వాటికి రోగాలు సోకితే చికిత్స చేయడానికి మండల స్థాయిలో పశు సంవర్థక వైద్యుడిని నియమిస్తారు. రాష్ట్రంలో ఈ ఖాళీలను భర్తీ చేసేందుకు త్వరలో నోటిఫికేషన్లు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ పోస్టుల భర్తీకి సంబంధించి ప్రస్తుతం ఉన్న ఉత్తర్వులను సవరించాలని నిపుణులు కోరుతున్నారు. ప్రస్తుత ఉత్తర్వుల ప్రకారం వెటర్నరీ అసిస్టెంట్(వీఏ) ఉద్యోగాలకు ఇంటర్మీడియెట్‌లో మల్టీపర్పస్ వెటర్నరీ అసిస్టెంట్(ఎంపీవీఏ) కోర్సు, వెటర్నరీ పాలిటెక్నిక్‌లో డిప్లొమా చేసిన వారితో పాటు ఇంటర్మీడియెట్ ఒకేషనల్, పౌల్ట్రీ, డైరీ కోర్సు పాసైన వారు కూడా అర్హులే. పశువుల ఆసుపత్రులలో ప్రతి నిత్యం గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు, ఎద్దులు, కుక్కలు, కోళ్లకు, రోగ నివారణ చర్యలతో పాటు, రోగ నిర్ధారణ చికిత్సలు జరుగుతుంటాయి. కృత్రిమ గర్భోత్పత్తి కూడా ఇందులో భాగమే. వీటితో డైరీ కోర్సు చదివిన వారికి సంబంధమే లేదు. ఆరోగ్యంగా ఉన్న పశువుల నుంచి వచ్చే పాలు, పాల ఉత్పత్తులు, వాటి నిల్వ జాగ్రత్తలకు సంబంధించినదే డైరీ కోర్సు. కేవలం కోళ్లకు సంబంధించినదే పౌల్ట్రీ కోర్సు. పశువుల ఆసుపత్రికి వచ్చే అనేక రకాలైన వాటిలో కోళ్లు ఒక భాగం మాత్రమే. ఈ రెండు కోర్సులు చేసిన వారిని కూడా వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపిక చేయడం వల్ల వీరికి గొర్రెలు, మేకలు, గేదెలు, ఆవులు, కుక్కలు తదితర జంతువులు వాటి వ్యాధుల నిర్ధారణ, చికిత్సలో ఎలాంటి పరిజ్ఞానం ఉండదు. వీరిని ఎంపిక చేసిన అనంతరం ప్రభుత్వం ఇచ్చే ఒక సంవత్సరం శిక్షణ కూడా ఆస్పత్రుల నిర్వహణకే తప్ప సబ్జెక్టుకు సంబంధించింది కాదు. ఇంతెందుకు వెటర్నరీ అసిస్టెంటు సర్జన్ ఉద్యోగాలకు బీవీఎస్సీ పాసైన వారు మాత్రమే అర్హులు తప్ప బీఎస్సీ డైరీ టెక్నాలజీ పాసైన వారిని ఎట్టి పరిస్థితిలో తీసుకోరని నిపుణులు చెబుతున్నారు. వెటర్నరీ అసిస్టెంటు ఉద్యోగాల అర్హతలో వివక్ష ఉండకూడదన్నది వారి అభిప్రాయం. సరైన విషయ పరిజ్ఞానం లేని వారితో పశు సంవర్ధక శాఖలో క్షేత్రస్థాయిలో కీలకమైన వెటర్నరీ అసిస్టెంటు ఉద్యోగాలకు డైరీ, పౌల్ట్రీ కోర్సులు చేసిన వారికి అవకాశం ఇవ్వడం వల్ల ఉద్యోగాల విధులకు న్యాయం జరుగదు. రైతులకు ప్రయోజనం కలుగదని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. క్షేత్ర స్థాయి సిబ్బంది ఎంపికలో అశాస్త్రీయ విధానాలను సవరించాలని వారు డిమాండ్ చేస్తున్నారు.