సాక్షి, హైదరాబాద్: డెయిరీ ఒకేషనల్ కోర్సు చదివి పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ (వీఏ) ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తోన్న వేలాది మంది విద్యార్థులకు షాక్ తగిలింది. వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు కనీస అర్హతగా ఉన్న ఒకేషనల్ డెయిరీ, పౌల్ట్రీ సైన్సెస్ కోర్సులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ కోర్సుల స్థానంలో రెండేళ్ల కాలవ్యవధి గల పశుసంవర్ధక పాలిటెక్నిక్‌ను చేర్చింది. పీవీ నర్సిం హారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంతో పాటు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీల నుంచి ఈ కోర్సును పూర్తి చేసిన వారు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు పాత జీవోను సవరిస్తూ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర గత నెల 27న జీవోఎంఎస్ నం: 18 విడుదల చేశారు.
75% డైరెక్ట్ రిక్రూట్‌మెంట్
తాజా జీవో ప్రకారం పశుసంవర్థక శాఖలో వీఏ పోస్టులను 75 శాతం డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా భర్తీ చేయనుండగా, 25 శాతం ఇప్పటికే ఆ శాఖలో పనిచేస్తోన్న రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, ల్యాబ్ అటెండర్లు, ఫీల్డ్‌మన్‌లకు పదోన్నతుల ద్వారా ఇవ్వనున్నారు. పదోన్నతి ద్వారా పోస్టు పొందాలంటే సదరు ఉద్యోగి ఇంటర్ బైపీసీ లేదా ఒకేషనల్ డెయిరీ కోర్సు లేదా పౌల్ట్రీ సైన్స్ చదివి ఉండాలని, వీరు ఏడాది పాటు పీవీ నర్సింహారావు విశ్వవిద్యాలయంలో వీఏగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఉద్యోగాలకు దూరం చేయడమే..
ఇక ఒకేషనల్ డెయిరీ, పౌల్ట్రీసైన్స్ కోర్సులు చదివి వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలు ఉంటుందని అంచనా. ఇప్పుడు ఈ కోర్సులను కనీస విద్యార్హత నుంచి తొలగించడంతో తమ ఆశలు అడియాసలయ్యాయని తెలంగాణ ఒకేషనల్ డెయిరీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది.
గత 25 ఏళ్లుగా ఈ కోర్సు మనుగడలో ఉందని, ఈ కోర్సు చదివిన చాలామంది ఇప్పటికే పశుసంవర్థక శాఖలో వీఏలుగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపింది. 2017 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 437 మందిలో 80 మంది ఈ కోర్సు చదివిన వారేనని పేర్కొంది. ఎంతో ఆశతో ఈ కోర్సు పూర్తి చేసిన తరుణంలో ఏకంగా తమ కోర్సునే కనీస విద్యార్హత నుంచి తొలగించడం తమను ఉద్యోగాలకు దూరం చేయడమేనని అసోసియేషన్ నేతలంటున్నారు. తాము కూడా ఈ ఉద్యోగాలు పొందేలా వెంటనే తాజా జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు.
(చదవండి: హుజూరాబాద్ స్టార్ క్యాంపెయినర్లు వీరే..)
Comments
Please login to add a commentAdd a comment