Vocational course
-
గ్రామీణ పేదలకు ‘ఉన్నతి’
సాక్షి, అమరావతి:గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ పథకం పనులపై ఎక్కువగా ఆధారపడే పేద కుటుంబాల్లో యువతకు గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ‘ఉన్నతి’ పేరుతో వివిధ రకాల ఉపాధి, వృత్తి కోర్సుల్లో శిక్షణ ఇచ్చి శాశ్వత జీవనోపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. కంప్యూటర్ పరిజ్ఞానంతో పాటు ద్విచక్ర వాహనాలు, ఏసీ మెషిన్లు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ రిపేర్ అండ్ సర్వీసింగ్, ఇంటర్నెట్ సేవలకు సంబంధించి టెక్నికల్ సర్వీస్ తదితర 192 రకాల ఉపాధి, వృత్తి విద్య కోర్సుల్లో పేద కుటుంబాల్లోని దాదాపు 25 వేల మంది యువతకు శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ లక్ష్యంగా నిర్ధేశించుకుంది. నిబంధనల ప్రకారం.. ఉపాధి హామీ పథకం కింద ఒక్కొక్క కుటుంబానికి ఏడాదికి గరిష్టంగా వంద రోజులపాటు పనులు కల్పిస్తున్నారు. ఉదాహరణకు ఒక కుటుంబంలో ముగ్గురు పనిచేసే వ్యక్తులు ఉండి.. ఆ ముగ్గురు ఉపాధి హామీ పథకం కింద పనులు చేసుకోవాలనుకుంటే.. ఒక్కొక్కరికి గరిష్టంగా 33 పని దినాల చొప్పున కేటాయిస్తున్నారు. ఉపాధి కూలీల కుటుంబాలు గరిష్ట వంద రోజుల పరిమితి వినియోగించుకున్న అనంతరం కూడా ఆ కుటుంబం ఏ పనిలేక ఇబ్బంది పడే పరిస్థితి రాకుండా.. ఉన్నతి పథకం కింద శిక్షణ ఇస్తారు. ఏడాదిలో వంద రోజుల పనులు పూర్తి చేసుకున్న కుటుంబాలను గుర్తించి ఆయా కుటుంబాల్లో యువతకు శిక్షణ కార్యక్రమాలు అందజేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఎస్సీ, ఎస్టీ కుటుంబాల్లో గరిష్టంగా 18–45 ఏళ్ల మధ్య, ఇతర సామాజిక వర్గాల్లో 18–35 ఏళ్ల మధ్య వయసు గలవారు ఈ శిక్షణ కార్యక్రమాలకు అర్హులుగా నిర్థారించారు. ఉచిత శిక్షణతోపాటు రోజూ కూలి జమ శిక్షణ కార్యక్రమాలను పూర్తి ఉచితంగా అందజేయడంతో పాటు శిక్షణకు హాజరయ్యే యువతకు రోజు వారీ కూలి డబ్బులను స్టైఫండ్ రూపంలో ప్రభుత్వం అందజేస్తుంది. గరిష్టంగా వంద రోజులు పాటు స్టైఫండ్ అందజేస్తారు. సంబంధిత యువత శిక్షణ కాలంలో కనీసం 75 శాతం హాజరు ఉండాలనే నిబంధన కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. గరిష్టంగా వంద రోజుల పాటు ఉపాధి హామీ పనులకు వెళ్లిన కుటుంబాల్లో యువత ఉన్న కుటుంబాలు 4,75,327 ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ఎస్ఈఈడీఏపీ (సీడాప్), ఆర్ఎస్ఈటీఐ, కేవీకే సంస్థల ద్వారా ప్రభుత్వం శిక్షణ ఇప్పించేందుకు నిర్ణయించారు. ఆయా సంస్థలు క్షేత్రస్థాయిలో పనిచేసే ఉపాధి హామీ పథకం సిబ్బంది సాయంతో సంబంధిత కుటుంబాలను ప్రత్యక్షంగా సందర్శించి శిక్షణ పొందేందుకు ఆసక్తి గల యువత పేర్లను నమోదు చేసుకుంటారు. ఆ తర్వాత అర్హులైన వారికి శిక్షణ అందజేస్తారు. -
ఒకేషనల్ కోర్సు విద్యార్థులకు షాక్
సాక్షి, హైదరాబాద్: డెయిరీ ఒకేషనల్ కోర్సు చదివి పశుసంవర్థక శాఖలో వెటర్నరీ అసిస్టెంట్ (వీఏ) ఉద్యోగాల నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తోన్న వేలాది మంది విద్యార్థులకు షాక్ తగిలింది. వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాలకు కనీస అర్హతగా ఉన్న ఒకేషనల్ డెయిరీ, పౌల్ట్రీ సైన్సెస్ కోర్సులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆ కోర్సుల స్థానంలో రెండేళ్ల కాలవ్యవధి గల పశుసంవర్ధక పాలిటెక్నిక్‌ను చేర్చింది. పీవీ నర్సిం హారావు వెటర్నరీ విశ్వవిద్యాలయంతో పాటు తిరుపతిలోని ఎస్వీ యూనివర్సిటీల నుంచి ఈ కోర్సును పూర్తి చేసిన వారు మాత్రమే డైరెక్ట్ రిక్రూట్మెంట్ కింద దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పించింది. ఈ మేరకు పాత జీవోను సవరిస్తూ పశుసంవర్ధక శాఖ కార్యదర్శి అనితారాజేంద్ర గత నెల 27న జీవోఎంఎస్ నం: 18 విడుదల చేశారు. 75% డైరెక్ట్ రిక్రూట్మెంట్ తాజా జీవో ప్రకారం పశుసంవర్థక శాఖలో వీఏ పోస్టులను 75 శాతం డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయనుండగా, 25 శాతం ఇప్పటికే ఆ శాఖలో పనిచేస్తోన్న రికార్డు అసిస్టెంట్లు, అటెండర్లు, ల్యాబ్ అటెండర్లు, ఫీల్డ్మన్లకు పదోన్నతుల ద్వారా ఇవ్వనున్నారు. పదోన్నతి ద్వారా పోస్టు పొందాలంటే సదరు ఉద్యోగి ఇంటర్ బైపీసీ లేదా ఒకేషనల్ డెయిరీ కోర్సు లేదా పౌల్ట్రీ సైన్స్ చదివి ఉండాలని, వీరు ఏడాది పాటు పీవీ నర్సింహారావు విశ్వవిద్యాలయంలో వీఏగా శిక్షణ తీసుకోవాల్సి ఉంటుందని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఉద్యోగాలకు దూరం చేయడమే.. ఇక ఒకేషనల్ డెయిరీ, పౌల్ట్రీసైన్స్ కోర్సులు చదివి వెటర్నరీ అసిస్టెంట్ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగుల సంఖ్య రాష్ట్ర వ్యాప్తంగా 20 వేలు ఉంటుందని అంచనా. ఇప్పుడు ఈ కోర్సులను కనీస విద్యార్హత నుంచి తొలగించడంతో తమ ఆశలు అడియాసలయ్యాయని తెలంగాణ ఒకేషనల్ డెయిరీ స్టూడెంట్స్ అసోసియేషన్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. గత 25 ఏళ్లుగా ఈ కోర్సు మనుగడలో ఉందని, ఈ కోర్సు చదివిన చాలామంది ఇప్పటికే పశుసంవర్థక శాఖలో వీఏలుగా ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపింది. 2017 నోటిఫికేషన్ ద్వారా నియమితులైన 437 మందిలో 80 మంది ఈ కోర్సు చదివిన వారేనని పేర్కొంది. ఎంతో ఆశతో ఈ కోర్సు పూర్తి చేసిన తరుణంలో ఏకంగా తమ కోర్సునే కనీస విద్యార్హత నుంచి తొలగించడం తమను ఉద్యోగాలకు దూరం చేయడమేనని అసోసియేషన్ నేతలంటున్నారు. తాము కూడా ఈ ఉద్యోగాలు పొందేలా వెంటనే తాజా జీవోను సవరించాలని డిమాండ్ చేస్తున్నారు. (చదవండి: హుజూరాబాద్ స్టార్ క్యాంపెయినర్లు వీరే..) -
రేపటి నుంచి ఏపీ ఎంసెట్
సాక్షి, అమరావతి: ఇంజనీరింగ్, అగ్రికల్చర్, బీ.ఫార్మసీ తదితర సాంకేతిక వృత్తి విద్యాకోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఏపీ ఎంసెట్–2020 ఈ నెల 17 (గురువారం) నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 25వ తేదీ వరకు రోజుకు రెండు సెషన్లలో మొత్తం 14 సెషన్లుగా ఏడు రోజుల పాటు నిర్వహించనున్నారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో జరిగే ఈ పరీక్షకు 2,72,900 మంది దరఖాస్తు చేసుకున్నారు. కోవిడ్ నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకునేలా ఉన్నత విద్యామండలి ద్వారా ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఏపీ, హైదరాబాద్‌తో కలుపుకుని 47 పట్టణాల్లో 118 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. 17నుంచి 23వ తేదీ వరకు ఇంజనీరింగ్ పరీక్షకు 1,85,263 మంది, 23 నుంచి 25 వరకు జరిగే అగ్రి తదితర కోర్సుల ప్రవేశ పరీక్షకు 87,637 మంది హాజరు కానున్నారు. నిమిషం ఆలస్యమైనా.. ► ఉదయం 9 నుంచి 12 గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రెండో సెషన్ ఉంటుంది. ► అభ్యర్థులను పరీక్ష సమయానికి గంటన్నర ముందు నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతి ఉండదు. ► అభ్యర్థులు రూట్ మ్యాప్‌తో కూడిన ఈ–హాల్ టికెట్‌ను, సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. సెల్ఫ్ డిక్లరేషన్ ఫారాన్ని నింపి సమర్పించాలి. ► ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఆన్లైన్ దరఖాస్తు ఫారం, కుల ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి. ► హాల్ టికెట్‌తో పాటు వేరొక అధికారిక ఫొటో గుర్తింపు కార్డు తెచ్చుకోవాలి. పరీక్ష సమయం ముగిసే వరకు అభ్యర్థులను బయటకు అనుమతించరు. మాస్క్.. గ్లవ్స్ తప్పనిసరి ► అభ్యర్థులు విధిగా మాస్క్, చేతి గ్లవ్స్ ధరించాలి. 50 ఎంఎల్ శానిటైజర్, పారదర్శకంగా ఉండే వాటర్ బాటిళ్లను లోపలకు అనుమతిస్తారు. ► కోవిడ్ లక్షణాలున్న వారిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గదుల్లో ఉంచి పరీక్ష రాయిస్తారు. -
‘వొకేషనల్’.. ఇక ప్రొఫెషనల్
సాక్షి, హైదరాబాద్: ►కాఫీ ఇష్టపడే వారు ఎక్కువే. అలాంటి కాఫీ ప్రి యుల కోసం 42 రకాల కాఫీలు ఉన్నాయంటే ఆశ్చర్యమే కదా. ఆర్థిక స్థోమత లేక ఇంటర్మీడి యట్ పూర్తికాగానే ఏదో ఉద్యోగమో.. ఉపాధో పొందాలనుకునే వారు కాఫీ మేకింగ్ కోర్సు చదివితే.. ఓ కాఫీ షాప్ పెట్టుకోవచ్చు. ►బేకరీ, ఫ్లవర్ బోకే మేకింగ్.. ఇవీ అంతే. వీటి తయారీలో శిక్షణ పొందడం ద్వారా ఆయా రంగాల్లో స్థిర పడవచ్చు. ►తాజా ట్రెండ్ డ్యూటీ కేర్ మేనేజ్మెంట్. ఉద్యో గులైన భార్యాభర్తలు ఇంట్లో ఉండే తమ వృద్ధు లైన తల్లిదండ్రులను చూసుకునే వారి కోసం వెంపర్లాడుతున్నారు. వేలు చెల్లించి నర్సులను నియమించుకుంటున్నారు. అలా సేవలందించాలనుకునే వారి కోసం వచ్చిన కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి డిమాండ్ ఉంది. ఇంకా.. ఆటోమొబైల్ సర్వీసింగ్, మోటారు వైండింగ్ కమ్ ఎలక్ట్రీషియన్, కమర్షియల్ గార్మెంట్ టెక్నాలజీ, టాయ్స్ మేకింగ్, అర్బన్ మైక్రో బిజినెస్, సోలార్ ఎనర్జీ వంటి కోర్సులను రాష్ట్రంలోని వొకేషనల్ ఇంటర్మీడియట్లో కోర్సులుగా అమల్లోకి తెచ్చేందుకు ఇంటర్మీయట్ విద్యా శాఖ కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు సమూల సంస్కరణలకు ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఉమర్ జలీల్ శ్రీకారం చుట్టారు. వొకేషనల్ కోర్సు చేసే విద్యార్థి ఉద్యోగంలో లేదా సొంతంగా ఉపాధి పొందేలా ఉండాలన్న లక్ష్యంతో ఈ కోర్సులను మార్చనున్నారు. సెంచూరియన్ వర్సిటీలో అధ్యయనం.. రాష్ట్రంలోని వొకేషనల్ విద్యలో మార్పులు తేవాల ని నిర్ణయించిన ఇంటర్ బోర్డు.. ఇలాంటి వొకేషనల్ కోర్సులను సక్సెస్‌ఫుల్‌గా అమలు చేస్తున్న ఒడిశాలోని సెంచూరియన్ వర్సిటీలో అధ్యయ నం చేసింది. అక్కడ అమలు చేస్తున్న కోర్సులు, వాటికి మార్కెట్లో ఉన్న డిమాండ్, విద్యార్థులకు లభించే ఉద్యోగ, ఉపాధి అవకాశాలపై నివేదిక సిద్ధం చేస్తోంది. ఉన్నతాధికారుల బృందం ఈ నెల 7న ఆ వర్సిటీలో అధ్యయనం చేసింది. ఒకట్రెండు రోజుల్లో నివేదిక పూర్తి చేసి ప్రభుత్వానికి పంపించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆమోదం తీసుకొని వీలైతే వచ్చే విద్యా సంవత్సరంలోనే ఇంటర్ వొకేషనల్ కోర్సుల్లో సమూల మార్పులను, కొత్త కోర్సులను అమల్లోకి తెచ్చేందుకు కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ప్రాంతాన్ని బట్టి కోర్సులు.. కాఫీ మేకింగ్, బేకరీ మేకింగ్, ఫ్లవర్ బొకే మేకింగ్ వంటి కోర్సులకు, పనులకు పట్టణ ప్రాంతాల్లోనే డిమాండ్ ఉంటుంది. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీ, మష్రూమ్ కల్చర్, మోటార్ వైండింగ్ కమ్ ఎలక్ట్రీషియన్ వర్క్ వంటి కోర్సులకు గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ డిమాండ్ ఉంటుంది. అక్కడే వాటి అవసరం ఉంటుంది. అందుకే ఏ ప్రాంతంలో ఏ కోర్సుకు ఎక్కువ డిమాండ్ ఉంటుందో అక్కడ వాటిని నిర్వహించేలా ఇంటర్ విద్యా శాఖ కార్యాచరణను సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రంలో డిమాండ్ లేని కొన్ని కోర్సులను తొలగించే అంశాలను పరిశీలిస్తోంది. ప్రాంతాన్ని బట్టి డిమాండ్ ఉన్న కోర్సులను ఆయా ప్రాంతాల్లోనే నిర్వహించేలా కసరత్తు చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 22 రకాల కోర్సులు ఉండగా, అందులో కొన్నింటిని తొలగించి 15 రకాల కొత్త కోర్సులను అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపడుతోంది. కనీసంగా 2 లక్షలకు పెంచేలా.. రాష్ట్రంలో 176 ప్రభుత్వ, 401 ప్రైవేటు వొకేషనల్ జూనియర్ కాలేజిల్లో 96,208 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఆ సంఖ్యను కనీసంగా 2 లక్షలకు పెంచాలన్న లక్ష్యాన్ని ఆ శాఖ పెట్టుకుంది. కోర్సు పూర్తి కాగానే విద్యార్థులకు ఉద్యోగ/ఉపాధి లభించే కోర్సులను ప్రవేశపెట్టడం ద్వారా తమ లక్ష్యాన్ని చేరుకోవాలని భావిస్తోంది. -
‘సెట్’ కావట్లేదు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంజనీరింగ్ తదితర వృత్తి విద్యా కోర్సుల్లో చేరే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. రాష్ట్రంలోని వివిధ కళాశాలల్లో సీట్లు లక్షల్లో ఉంటున్నా.. వాటి భర్తీకి అర్హులైన అభ్యర్థులు తగ్గిపోతున్నారు. ఫలితంగా ఏటా సీట్లు భర్తీకాక భారీగా మిగిలిపోతున్నాయి. కొన్ని ముఖ్యమైన కాలేజీల్లో మినహా చాలా విద్యాసంస్థల్లో సీట్లు భర్తీ కావడం గగనమవుతోంది. వీటి భర్తీకి ప్రభుత్వం నిర్వహిస్తున్న ప్రవేశ పరీక్ష ఎంసెట్‌లో అర్హత మార్కులు సాధించే వారి సంఖ్య తగ్గుతుండటం సీట్లు మిగులుకు ఒక కారణం కాగా.. నిర్ణీత వ్యవధిలో ఎంసెట్ ముగించి, సకాలంలో అడ్మిషన్లు నిర్వహించకపోవడం మరో కారణంగా కనిపిస్తోంది. అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడం వల్ల మన విద్యార్థులు ఇతర రాష్ట్రాల్లోని కాలేజీ, డీమ్డ్ యూనివర్సిటీలలో చేరుతున్నారు. ఈ ఏడాది ఎంసెట్ ఫలితాల ప్రకటన, అడ్మిషన్ల ప్రక్రియ ఆలస్యం కావడంతో రాష్ట్రంలోని కాలేజీల్లో ఈసారి గతం కన్నా ఎక్కువ సీట్లు మిగిలిపోయే పరిస్థితి కనిపిస్తోంది. రాసేవారు ఎక్కువగానే ఉంటున్నా.. రాష్ట్రంలోని ఇంజనీరింగ్ తదితర కోర్సుల్లో చేరిక కోసం నిర్వహించే ప్రవేశ పరీక్ష ఎంసెట్‌కు ఏటా లక్షల్లో అభ్యర్థులు దరఖాస్తు చేస్తున్నా.. ప్రవేశాలకు వచ్చేసరికి మాత్రం భారీగా తగ్గిపోతున్నారు. దరఖాస్తు చేసిన వారి సంఖ్యనే తీసుకుంటే.. 2016లో ఇంజనీరింగ్‌కు 1,89,141 మంది, అగ్రి మెడికల్‌కు 1,03,155 మంది కలిపి మొత్తం 2,92,296 మంది దరఖాస్తు చేశారు. 2017లో ఇంజనీరింగ్‌కు 1,98,064 మంది, అగ్రి మెడికల్‌కు 80,735 మంది కలిపి మొత్తం 2,78,799 మంది దరఖాస్తు చేశారు. 2018 ఎంసెట్‌లో ఇంజనీరింగ్ విభాగంలో 1,99,325 మంది, అగ్రి మెడికల్‌లో 76,748 కలిపి మొత్తం 2,76,748 మంది దరఖాస్తు చేశారు. వీరిలో పరీక్షకు హాజరవుతున్న వారి సంఖ్య, వారిలో అర్హత సాధిస్తున్న వారి సంఖ్య మరింత తగ్గిపోతోంది. ప్రస్తుతం 160 మార్కులకు నిర్వహిస్తున్న ఎంసెట్ పరీక్షలో ఓసీ, బీసీలకు 40 మార్కులను అర్హతగా పరిగణిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీలకు అర్హత మార్కులు లేవు. ర్యాంకును నిర్థారించడానికి ఎంసెట్‌లో వచ్చిన మార్కులు 75 శాతంగా, ఇంటర్మీడియెట్ మార్కులను 25 శాతంగా తీసుకుంటున్నారు. 2016లో 1,79,467 మంది రాయగా 1,31,580 మంది, 2017లో 1,87,484 మంది రాయగా 1,49,505 మంది, 2018లో 1,90,922 మందికి గాను 1,38,017 మంది అర్హత సాధించారు. అగ్రి మెడికల్ విభాగానికి వచ్చేసరికి 2015లో 81,010 మందికి గాను 78,816 మంది, 2016లో 98,753 మంది పరీక్ష రాయగా 86,497 మంది, 2017లో 75,489 మందికి గాను 68,882 మంది, 2018లో 73,373 మందికి గాను 63,883 మంది అర్హత సాధించారు. కన్వీనర్ కోటాలోనూ మిగులుతున్నాయ్ డిమాండ్ ఎక్కువగా ఉంటుందనే అభిప్రాయంతో ఆయా కాలేజీలు ఏఐసీటీఈ నుంచి వివిధ కోర్సుల్లో సీట్లకు అనుమతులు తెచ్చుకుంటున్నా.. వాటిలో చాలావరకు మిగిలిపోతున్నాయి. చివరకు సదరు కాలేజీలు క్రమేణా కోర్సులను రద్దు చేసుకోవడమో, సీట్లు తగ్గించుకోవడమో చేయక తప్పడం లేదు. ఆయా కాలేజీల్లో మొత్తం సీట్లలో 70 శాతం కన్వీనర్ కోటా కాగా.. మిగిలిన సీట్లను యాజమాన్యాలు భర్తీ చేసుకోవడానికి వీలుంది. అయితే ఏటా కన్వీనర్ కోటా సీట్లు కూడా భర్తీ కావడం లేదు. ఇక యాజమాన్య కోటా సీట్ల భర్తీ గగనంగా మారుతోంది. చివరకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక అనుమతులు, మినహాయింపులు తెచ్చుకుంటేగానీ సీట్లు భర్తీ కావడం లేదు. -
రాష్ట్రంలో ఏడో స్థానం
⇒ ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సులలో మొత్తం 25,290 మంది హాజరుకాగా వారిలో 14,816 మంది ఉత్తీర్ణులయ్యారు. - జనరల్ కోర్సులలో 24,608 మంది హాజరుకాగా 14,649 మంది అంటే 60 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇందులోనూ బాలికలదే పై చేయి. ⇒ ఒకేషనల్ కోర్సులలో మొత్తం 682 మంది హాజరుకాగా 367 మంది ఉత్తీర్ణులై 54 శాతంగా నిలిచారు. ⇒ ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 53 శాతం, 2014లో 56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 13 జిల్లాల పరిధిలో 7వ స్థానంలో నిలిచారు. ⇒ గత ఏడాదితో పోలిస్తే 4 శాతం ఉత్తీర్ణత పెరిగినా రాష్ట్రస్థాయిలో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే జిల్లా ఎగబాకింది. ⇒ ఒకేషనల్‌లో రాష్ట్రస్థాయిలో 5వ స్థానంలో నిలిచింది. ఒంగోలు వన్‌టౌన్: ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షా ఫలితాలలో బాలికలు పైచేయి సాధించారు. బాలురకంటే 12 శాతం అధిక ఉత్తీర్ణత సాధించి తమ సత్తా చాటారు. ఇంటర్మీడియట్ జనరల్, ఒకేషనల్ కోర్సులలో మొత్తం 25,290 మంది హాజరుకాగా వారిలో 14,816 మంది ఉత్తీర్ణులయ్యారు. జనరల్ కోర్సులలో 24,608 మంది హాజరుకాగా 14,649 మంది అంటే 60 శాతం ఉత్తీర్ణత సాధించగా వీరిలో బాలికలు 11,722 మంది పరీక్షలు రాయగా 7,678 మంది ఉత్తీర్ణులై 66 శాతం నమోదు చేశారు. బాలురు 12,886 మంది పరీక్షలు రాయగా 6,971 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలకంటే 12 శాతం తక్కువుగా 54 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సులలో మొత్తం 682 మంది హాజరుకాగా 367 మంది ఉత్తీర్ణులై 54 శాతంగా నిలిచారు. వీరిలో బాలురు 442 మంది పరీక్షరాయగా 211మంది, బాలికలు 240 మంది పరీక్షకు హాజరుకాగా 156 మంది పాసయ్యారు. బాలురకంటే 17 శాతం అధికంగా బాలికలు ఉత్తీర్ణత సాధించి శెహభాష్ అనిపించారు. రాష్ట్రస్థాయిలో 7వ స్థానంలో నిలిచారు. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో 53 శాతం, 2014లో 56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో 8వ స్థానంలో నిలవగా ఈ ఏడాది 13 జిల్లాల పరిధిలో 7వ స్థానంలో నిలిచారు. గత ఏడాదితో పోలిస్తే 4 శాతం ఉత్తీర్ణత పెరిగినా రాష్ట్రస్థాయిలో కేవలం ఒక్క స్థానానికి మాత్రమే ఎగబాకారు. ఒకేషనల్‌లో రాష్ట్రస్థాయిలో 5వ స్థానం దక్కింది. ప్రభుత్వ కళాశాలల్లో... ప్రభుత్వ కళాశాలలు కూడా ఈ ఏడాది ఉత్తమ ఫలితాలు సాధించాయి. జనరల్ విద్యార్థులు రాష్ట్రస్థాయిలో ద్వితీయ స్థానంలో నిలవగా, ఒకేషనల్ విద్యార్థులు తృతీయ స్థానంలో నిలిచారు. జనరల్ కోర్సులలో మొత్తం 3018 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 1633 మంది 54 శాతం ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కళాశాలల్లో బాలికలు, బాలురకంటే 12శాతం అధికంగా పాసయ్యారు. బాలురు 1725 మంది పరీక్షలు రాయగా 845 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 1293 మంది పరీక్షలు రాయగా 788 మంది ఉత్తీర్ణత సాధించారు. ఒకేషనల్ కోర్సులలో కూడా బాలురకంటే బాలికలు 10 శాతం అధిక ఉత్తీర్ణత సాధించారు. బాలురలో 254 మంది పరీక్షకు హాజరుకాగా 178 మంది పాసయ్యారు. బాలికల్లో 177 మంది పరీక్షలు రాయగా వారిలో 143 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో ఎంఈసీలో ప్రథమ స్థానం ఒంగోలులోని ఉమా మహేశ్వర కళాశాలలో చదివిన కె.సురేష్ రెడ్డి ఎంఈసీలో 500 మార్కులకుగాను 487 మార్కులు సాధించి జిల్లాలో ప్రథమ స్థానం సాధించారు. రాష్ట్రంలో 2వ స్థానంలో నిలిచారు. -
ఈ సారి బాలికలదే హవా
సాక్షి, సంగారెడ్డి: ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో మెతుకుసీమ రాష్ట్రంలోనే అట్టడుగు స్థానంలో నిలిచింది. సాధారణ విభాగంలో 49 శాతం ఉత్తీర్ణతతో ఆదిలాబాద్ జిల్లాతో కలిసి 23వ స్థానాన్ని పంచుకుంది. గతేడాది ఫలితాల్లో 46 శాతం ఉత్తీర్ణతతో రాష్ట్రంలో అట్టడుగు నుంచి రెండో స్థానంలో నిలిచిన మెదక్ జ్లిలా...ఈ ఏడాది ఉత్తీర్ణత స్వల్పంగా పెరిగినా, జిల్లా మాత్రం అట్టడుగు స్థానానికి దిగజారింది. జిల్లా నుంచి 27,228 మంది విద్యార్థులు ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరు కాగా 13,362 మంది ఉత్తీర్ణులయ్యా రు. ఈ ఏడాది ఫలితాల్లో కూడా బాలికలే పైచేయి సాధించారు. 14,220 మంది బాలురు పరీక్షలకు హాజరుకాగా, కేవలం 6,326 మంది మాత్రమే విజయం సాధించడంతో ఉత్తీర్ణత శాతం 44 మాత్రమే నమోదైంది. పరీక్షలకు హాజరైన 13,008 మంది బాలికల్లో 7,036 మంది విజయం సాధించారు. దీంతో బాలికల ఉత్తీర్ణత శాతం 54గా నమోదైంది. ఒకేషనల్ కోర్సుల్లో.. వృత్తి విద్యా విభాగం ద్వితీయ ఫలితాల్లో జిల్లా 56 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. మొత్తం 2,960 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైతే 1,660 మంది ఉత్తీర్ణులయ్యారు. 1,957 మంది బాలురుల్లో 990 మంది పాస్‌కాగా, ఉత్తీర్ణతా శాతం 51గా నమోదైంది. 1,003 మంది బాలికల్లో 670 మంది ఉత్తీర్ణలు కాగా, 67 శాతం న మోదైంది. ప్రభుత్వ కళాశాలలే భేష్.. ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో ప్రభుత్వ కళాశాలలు మళ్లీ సత్తా చాటాయి. జిల్లాలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలు 69 ఉత్తీర్ణత సాధించి తెలంగాణలోనే రెండో స్థానంలో నిలవడం ఒక్కటే ఈ ఫలితాల్లో ఊరట కలిగించే అంశమని చెప్పవచ్చు. -
ఇంటర్ ఫస్టియర్‌లో బాలికల హవా
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ ప్రథ మ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలు విజయఢంకా మోగించారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో సత్తా చాటారు. సోమవారం విడుదలైన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో విశాఖ జిల్లాను రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిపారు. జనరల్ కోర్సుల్లో 66 శాతం, ఒకేషనల్ కోర్సుల్లో 51 శాతం ఫలితాలను జిల్లా విద్యార్థులు సాధించగా, ఇందులో బాలికల ఫలితాల శాతమే అత్యధికం. ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయి. రాష్ట్రంలో వరుసగా మూడు దఫాలు రెండో స్థానంలో నిలిచిన విశాఖ జిల్లా ఈ ఏడాది ఫలితాల్లో మూడో స్థానం దక్కించుకుంది. కిందటేడాది ఫలితాల్లో 66 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలవగా, ఈ ఏడాది కూడా 66 శాతం ఫలితాలు సాధించినా రంగారెడ్డి జిల్లాకు 68శాతం ఉత్తీర్ణత రావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 74శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ కోర్సుల్లో 51 శాతంతో రాష్ట్రంలో నాల్గో స్థానం దక్కింది. రాష్ట్రంలో మంచి స్థానమే సాధించినా గత ఏడాది 55శాతం సాధించిన ఫలితాలతో పోల్చుకుంటే 4 శాతం ఉత్తీర్ణత శాతం తగ్గింది. జనరల్ కోర్సుల్లో 45,161 మంది పరీక్షలు రాయగా 66శాతంతో 29,715 మంది ఉత్తీర్ణులయ్యారు. ఒకేషనల్ కోర్సుల్లో 3,557 మంది పరీక్షలకు రాయగా 51శాతంతో 1,813 మంది ఉత్తీర్ణులయ్యారు. మార్కుల్లో ముందంజ ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మూడో స్థానం సాధించిన జిల్లా విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడంలోనూ ముందంజలో నిలిచారు. అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో మెరుగైనా మార్కులు సాధించారు. శ్రీచైతన్య నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు బి.షర్మిల, పి.విశాల్వేదవ్యాస్ ఎంపీసీలో 466 మార్కులు సాధించి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలిచారు. నారాయణ శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు పి.యోగరాజశ్రీ బైపీసీలో 435 మార్కులు, ఎంఈసీలో శ్రీవిద్య 491 మార్కులు సాధించి ఉన్నత స్థానంలో నిలిచారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలు అధ్వానం ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణత అధ్వానంగా వచ్చాయి. ప్రభుత్వ కళాశాలలు 49 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి 6327 మంది పరీక్షలు రాయగా 3,131 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 2,914 మంది పరీక్షలు రాయగా 46.5 శాతంతో 1,342 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 3,413 మంది పరీక్షలు రాయగా 52,42 శాతంతో 1,789 మంది ఉత్తీర్ణులయ్యారు. చింతపల్లి జూనియర్ కళాశాల 89.3 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, అనకాపల్లి జూనియర్ కళాశాల 15శాతం ఉత్తీర్ణతతో చివర స్థానంలో నిలిచింది. నగరంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ జూనియర్ కళాశాల ఫలితాలు నిరాశపరిచాయి. ఇక్కడ నుంచి 544 మంది పరీక్షలు రాయగా 105 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు సైతం మెరుగైనా ఫలితాలు సాధించడంలో విఫలమయ్యాయి. నర్సీపట్నం విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో రెండోర్యాంకు నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నర్సీపట్నం విద్యార్థిని సంచలనం సృష్టించింది. శ్రీవిద్య జూనియర్ కళాశాలకు చెందిన శెట్టి దీప్తి ఎంపీసీలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈమె 465 మార్కులు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ గాడి శేషగిరిరావు తెలిపారు. పెదపల్లి దేవ (430), పెదపూడి ఆదిత్య (430), బోళెం రాజా (421) కూడా ప్రతిభ చూపారు. బైపీసీలో కొక్కుల చంద్రశ్రీ (429- పట్టణంలో రెండో ర్యాంకు), సి.హెచ్.భువనకళ్యాణి (427), కె.దివ్య (419) రాణించారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు. -
రే పటి నుంచే ఇంటర్ పరీక్షలు
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లా వ్యాపితంగా ఇంటర్మీడియట్ పరీక్షలను బుధవారం నుంచి పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్ఐఓ పరంధామయ్య వెల్లడించారు. నెల్లూరు కేఏసీ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు ఈ నెల 26వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గం టల వరకు పరీక్షల సమయం ఉన్నప్పటికీ అర్ధగంట ముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులుతో పాటు ఒకేషనల్ కోర్సు విద్యార్ధులు కలుపుకుని మొత్తం 57,869 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరి లో ఇంటర్ మొదటి సంవత్సరం 29,644 మంది, రెండో సంవత్సరం పరీక్షలు 25,922 మంది, మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 945మంది, ఒకేషనల్ కోర్సు రెండో ఏడాదికి సంబంధించి 1358 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు. వీరి కోసం 94 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం డీఈసీ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్మెంటల్ అధికారి పర్యవేక్షణ చేస్తారన్నారు. కలెక్టర్ చైర్మన్‌గా హైపవర్ కమిటీ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ దఫా ప్రభుత్వం మాస్‌కాపీయింగ్‌ను అరికట్టేందుకు జీపీఎస్ సిస్టమ్ (శాటిలైట్) ద్వారా చర్యలు తీసుకుందన్నారు. ఈ సిస్టమ్ పోలీసుల అధీనంలో ఉంటుందన్నారు. పరీక్షల హాల్లో విద్యార్థులు గాని, ఇన్విజిలేటర్లుగాని, ఇతర అధికారులు గాని ప్రశ్నాపత్రాల గురించి చర్చిస్తే వెంటనే ఆ వివరాలు జీపీఎస్ ద్వారా తెలిసి పోతాయన్నారు. అప్పుడు పోలీసులు సైబర్‌క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. పరిక్ష కేంద్రాలకు విద్యార్థులు, ఇన్విజిలేటర్లు సెల్ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలిపారు. ప్రతి విద్యార్థీ పరీక్షలు రాసేందుకు అట్టలు తెచ్చుకోవాలన్నారు. 15 నిమిషాలు ముందు వచ్చినా సంజాయిషీ పత్రం రాయాల్సిందే గత ఏడాదికి భిన్నంగా ఈ దఫా పరీక్షలు రాసే విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్ష కేంద్రంలోని తన సీటులో కూర్చోవాలన్నారు. అంటే ఉదయం 8.30 గంటలకే హాజరు కావాలన్నారు. ఒక వేళ 8.45 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి విద్యార్థి చేరుకున్నప్పటికీ 8.30 గంటలకు రానందుకు సంజాయిషీ ఇస్తూ వివరణ పత్రం రాసివ్వాల్సి ఉంటుందని తెలిపారు. 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీ క్షకు అనుమతించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నిబంధనలన్నీ హాల్‌టికెట్ పై ముద్రించామని, ఒకటికి రెండుసార్లు చదువుకోవాలని సూచించారు. హాల్టికెట్లివ్వక పోతే కళాశాలలను సీజ్ చేస్తాం ఎవరైనా ప్రైవేటు కళాశాలల యజమానులు ఫీజులు చెల్లించలేదనే కారణంతో హాల్‌టికెట్లు ఇవ్వకపోతే అలాంటి కళాశాలలను సీజ్ చేస్తామని ఆర్ఐఓ పరంధామయ్య హెచ్చరించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తాము ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (0861-2320312)కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీవీఈఓ బాబుజాకబ్, డీఈసీ సభ్యులు కె.శ్రీనివాసరావు, బి.పెంచలయ్య, సీహెచ్.శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.