రే పటి నుంచే ఇంటర్ పరీక్షలు
Published Tue, Mar 11 2014 3:33 AM | Last Updated on Sat, Oct 20 2018 6:17 PM
నెల్లూరు(టౌన్), న్యూస్‌లైన్: జిల్లా వ్యాపితంగా ఇంటర్మీడియట్ పరీక్షలను బుధవారం నుంచి పక్కాగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఆర్‌ఐఓ పరంధామయ్య వెల్లడించారు. నెల్లూరు కేఏసీ కళాశాల ప్రాంగణంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పరీక్షలు ఈ నెల 26వ తేదీ వరకు జరుగుతాయన్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గం టల వరకు పరీక్షల సమయం ఉన్నప్పటికీ అర్ధగంట ముందే కేంద్రానికి చేరుకోవాల్సి ఉంటుందన్నారు. ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం చదువుతున్న విద్యార్థులుతో పాటు ఒకేషనల్ కోర్సు విద్యార్ధులు కలుపుకుని మొత్తం 57,869 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. వీరి లో ఇంటర్ మొదటి సంవత్సరం 29,644 మంది, రెండో సంవత్సరం పరీక్షలు 25,922 మంది, మొదటి సంవత్సరం ఒకేషనల్ కోర్సుకు సంబంధించి 945మంది, ఒకేషనల్ కోర్సు రెండో ఏడాదికి సంబంధించి 1358 మంది పరీక్షలు రాస్తున్నారన్నారు.
వీరి కోసం 94 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. పరీక్షల నిర్వహణ కోసం డీఈసీ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి కేంద్రంలో చీఫ్ సూపరింటెండెంట్‌తో పాటు డిపార్ట్‌మెంటల్ అధికారి పర్యవేక్షణ చేస్తారన్నారు. కలెక్టర్ చైర్మన్‌గా హైపవర్ కమిటీ స్క్వాడ్ తనిఖీలు నిర్వహిస్తుందని తెలిపారు. ఈ దఫా ప్రభుత్వం మాస్‌కాపీయింగ్‌ను అరికట్టేందుకు జీపీఎస్ సిస్టమ్ (శాటిలైట్) ద్వారా చర్యలు తీసుకుందన్నారు. ఈ సిస్టమ్ పోలీసుల అధీనంలో ఉంటుందన్నారు. పరీక్షల హాల్లో విద్యార్థులు గాని, ఇన్విజిలేటర్లుగాని, ఇతర అధికారులు గాని ప్రశ్నాపత్రాల గురించి చర్చిస్తే వెంటనే ఆ వివరాలు జీపీఎస్ ద్వారా తెలిసి పోతాయన్నారు. అప్పుడు పోలీసులు సైబర్‌క్రైమ్ కింద కేసులు నమోదు చేస్తారని హెచ్చరించారు. పరిక్ష కేంద్రాలకు విద్యార్థులు, ఇన్విజిలేటర్లు సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకురాకూడదని తెలిపారు. ప్రతి విద్యార్థీ పరీక్షలు రాసేందుకు అట్టలు తెచ్చుకోవాలన్నారు.
15 నిమిషాలు ముందు వచ్చినా సంజాయిషీ పత్రం రాయాల్సిందే
గత ఏడాదికి భిన్నంగా ఈ దఫా పరీక్షలు రాసే విద్యార్థులు అర్ధగంట ముందే పరీక్ష కేంద్రంలోని తన సీటులో కూర్చోవాలన్నారు. అంటే ఉదయం 8.30 గంటలకే హాజరు కావాలన్నారు. ఒక వేళ 8.45 నిమిషాలకు పరీక్ష కేంద్రానికి విద్యార్థి చేరుకున్నప్పటికీ 8.30 గంటలకు రానందుకు సంజాయిషీ ఇస్తూ వివరణ పత్రం రాసివ్వాల్సి ఉంటుందని తెలిపారు. 9 గంటల తర్వాత ఒక్క నిమిషం ఆలస్యమైనా పరీ క్షకు అనుమతించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. నిబంధనలన్నీ హాల్‌టికెట్ పై ముద్రించామని, ఒకటికి రెండుసార్లు చదువుకోవాలని సూచించారు.
హాల్‌టికెట్‌లివ్వక పోతే కళాశాలలను సీజ్ చేస్తాం
ఎవరైనా ప్రైవేటు కళాశాలల యజమానులు ఫీజులు చెల్లించలేదనే కారణంతో హాల్‌టికెట్లు ఇవ్వకపోతే అలాంటి కళాశాలలను సీజ్ చేస్తామని ఆర్‌ఐఓ పరంధామయ్య హెచ్చరించారు. విద్యార్థులకు ఏమైనా సమస్యలుంటే తాము ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ (0861-2320312)కు ఫిర్యాదు చేయవచ్చని ఆయన తెలిపారు. ఈ సమావేశంలో డీవీఈఓ బాబుజాకబ్, డీఈసీ సభ్యులు కె.శ్రీనివాసరావు, బి.పెంచలయ్య, సీహెచ్.శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
Advertisement