ఇంటర్ ఫస్టియర్‌లో బాలికల హవా | Inter-Intermediate Girls Hawa | Sakshi
Sakshi News home page

ఇంటర్ ఫస్టియర్‌లో బాలికల హవా

Published Tue, Apr 29 2014 12:54 AM | Last Updated on Thu, May 3 2018 3:17 PM

ఇంటర్ ఫస్టియర్‌లో బాలికల హవా - Sakshi

ఇంటర్ ఫస్టియర్‌లో బాలికల హవా

విశాఖపట్నం, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియెట్ ప్రథ మ సంవత్సరం పరీక్ష ఫలితాల్లో బాలికలు విజయఢంకా మోగించారు. జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో సత్తా చాటారు. సోమవారం విడుదలైన ప్రథమ సంవత్సరం ఫలితాల్లో విశాఖ జిల్లాను రాష్ట్రంలో మూడో స్థానంలో నిలిపారు. జనరల్ కోర్సుల్లో 66 శాతం, ఒకేషనల్ కోర్సుల్లో 51 శాతం ఫలితాలను జిల్లా విద్యార్థులు సాధించగా, ఇందులో బాలికల ఫలితాల శాతమే అత్యధికం.

ఇంటర్మీడియెట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ఈ ఏడాది కూడా బాలికలదే పైచేయి. రాష్ట్రంలో వరుసగా మూడు దఫాలు రెండో స్థానంలో నిలిచిన విశాఖ జిల్లా ఈ ఏడాది ఫలితాల్లో మూడో స్థానం దక్కించుకుంది. కిందటేడాది ఫలితాల్లో 66 శాతం ఉత్తీర్ణతతో రెండో స్థానంలో నిలవగా, ఈ ఏడాది కూడా 66 శాతం ఫలితాలు సాధించినా రంగారెడ్డి జిల్లాకు 68శాతం ఉత్తీర్ణత రావడంతో మూడో స్థానంతో సరిపెట్టుకుంది. 74శాతంతో కృష్ణా జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
 
ఒకేషనల్ కోర్సుల్లో 51 శాతంతో రాష్ట్రంలో నాల్గో స్థానం దక్కింది. రాష్ట్రంలో మంచి స్థానమే సాధించినా గత ఏడాది 55శాతం సాధించిన ఫలితాలతో పోల్చుకుంటే 4 శాతం ఉత్తీర్ణత శాతం తగ్గింది. జనరల్ కోర్సుల్లో 45,161 మంది పరీక్షలు రాయగా 66శాతంతో  29,715 మంది ఉత్తీర్ణులయ్యారు.  ఒకేషనల్ కోర్సుల్లో 3,557 మంది పరీక్షలకు రాయగా 51శాతంతో 1,813 మంది ఉత్తీర్ణులయ్యారు.
 
మార్కుల్లో ముందంజ
 
ఇంటర్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో మూడో స్థానం సాధించిన జిల్లా విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించడంలోనూ ముందంజలో నిలిచారు. అత్యధిక మార్కులు సాధించి తమ సత్తా చాటారు. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ గ్రూపుల్లో మెరుగైనా మార్కులు సాధించారు. శ్రీచైతన్య నారాయణ జూనియర్ కళాశాల విద్యార్థులు బి.షర్మిల, పి.విశాల్‌వేదవ్యాస్ ఎంపీసీలో 466 మార్కులు సాధించి రాష్ట్రంలో అత్యున్నత స్థానంలో నిలిచారు. నారాయణ శ్రీచైతన్య జూనియర్ కళాశాల విద్యార్థులు పి.యోగరాజశ్రీ బైపీసీలో 435 మార్కులు, ఎంఈసీలో శ్రీవిద్య 491 మార్కులు సాధించి ఉన్నత స్థానంలో నిలిచారు.
 
ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఫలితాలు అధ్వానం
 
ప్రథమ సంవత్సరం ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణత అధ్వానంగా వచ్చాయి. ప్రభుత్వ కళాశాలలు 49 శాతం ఉత్తీర్ణతతో సరిపెట్టుకున్నాయి. ప్రభుత్వ కళాశాలల నుంచి 6327 మంది పరీక్షలు రాయగా  3,131 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరిలో బాలురు 2,914 మంది పరీక్షలు రాయగా 46.5 శాతంతో 1,342 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 3,413 మంది పరీక్షలు రాయగా 52,42 శాతంతో 1,789 మంది ఉత్తీర్ణులయ్యారు. చింతపల్లి జూనియర్ కళాశాల 89.3 శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా, అనకాపల్లి జూనియర్ కళాశాల 15శాతం ఉత్తీర్ణతతో చివర స్థానంలో నిలిచింది.
 
నగరంలోని డాక్టర్ వి.ఎస్.కృష్ణ జూనియర్ కళాశాల ఫలితాలు నిరాశపరిచాయి. ఇక్కడ నుంచి 544 మంది పరీక్షలు రాయగా 105 మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. ఎయిడెడ్ జూనియర్ కళాశాలలు సైతం మెరుగైనా ఫలితాలు సాధించడంలో విఫలమయ్యాయి.
 
 నర్సీపట్నం విద్యార్థినికి రాష్ట్ర స్థాయిలో రెండోర్యాంకు


 నర్సీపట్నం టౌన్, న్యూస్‌లైన్ : ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఫలితాల్లో నర్సీపట్నం విద్యార్థిని సంచలనం సృష్టించింది. శ్రీవిద్య జూనియర్ కళాశాలకు చెందిన శెట్టి దీప్తి ఎంపీసీలో రాష్ట్రస్థాయిలో రెండో ర్యాంకు సాధించింది. ఈమె 465 మార్కులు సాధించినట్టు కళాశాల ప్రిన్సిపాల్ గాడి శేషగిరిరావు తెలిపారు. పెదపల్లి దేవ (430), పెదపూడి ఆదిత్య (430), బోళెం రాజా (421) కూడా ప్రతిభ చూపారు. బైపీసీలో కొక్కుల చంద్రశ్రీ (429- పట్టణంలో రెండో ర్యాంకు), సి.హెచ్.భువనకళ్యాణి (427), కె.దివ్య (419) రాణించారు. విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది అభినందించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement