రెండు రాష్ట్రాల్లోనూ టీడీపీ పాలనే !
బాన్సువాడ, న్యూస్‌లైన్ : రానున్న శాసన సభ, లోక సభ సాధారణ ఎన్నికల్లో తెలంగాణ, సీమాంధ్ర రాష్ట్రాల్లో టీడీపీయే అధికారం చేపడుతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీలు వీజీ గౌడ్, అరికెల నర్సారెడ్డి జోస్యం చెప్పారు. మంగళవారం టీడీపీ జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్చార్జి మదన్మోహన్రావు చేపట్టిన సైకిల్ యాత్ర బాన్సువాడకు చేరుకుంది. ఈసందర్భంగా అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఇచ్చిన లేఖ వల్లే కాంగ్రెస్ అధిష్టానం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిం దని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డితో పాటు సీమాంధ్ర నాయకులు స్పష్టం చేశారని, దీంతో తెలంగాణలో టీడీపీకి మంచి భవిష్యత్తు ఉందని తేటతెల్లమైందన్నారు.
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు ప్రక్రియ తమ వల్లే ప్రారంభమైందంటూ దుష్ర్పచారం చేస్తున్నారని, ఆయనకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఇష్టం లేదన్నారు. రాష్ట్రాన్ని ప్రకటించిన మరుసటి రోజే సీమాం ధ్రులను రెచ్చగొట్టే విధంగా ఆయన మాట్లాడారని, దీంతో సీమాంధ్రలో ఉద్యమం హెచ్చుమీరిందన్నారు. తమ పార్టీ తెలంగాణపై చిత్తశుద్ధితో ఉందని, అందుకే త్వరలో జరిగే అఖిల పక్ష సమావేశంలోనూ తాము తెలంగాణకు అనుకూలంగానే మాట్లాడేవిధంగా ఒత్తిడి తెస్తున్నామని అన్నారు. సీమాంధ్ర ప్రాంత నేతలు ఎంత ఒత్తిడి చేసినా, చంద్రబాబు తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా, తెలంగాణపై కట్టుబడి ఉన్నారని అన్నారు. సీమాంధ్రలోనూ తమ పార్టీ ప్రజల్లోకి దూసుకెళ్తుందని అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్లు ఎన్ని కుట్రలు చేసినా తమ పార్టీని ఏమీ చేయలేరన్నారు.
అనంతరం పార్లమెంట్ సెగ్మెంట్ ఇన్చార్జి మదన్మోహన్రావు మాట్లాడుతూ నేడు నిత్యావసర సరకుల ధరలు ఆకాశాన్నంటాయని, వాటిని అదుపు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. సమస్యలన్నీ పేరుకుపోయినా, ముఖ్యమంత్రి స్పందించడం లేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రణాళికా ప్రకారం అభివృద్ధి చేశామని, అప్పుడు జరిగిన అభివృద్ధి తప్ప కొత్తగా ఏమీ లేదన్నారు. ప్రజలు కాంగ్రెస్ పాలనను పారద్రోలే రోజులు దగ్గరపడ్డాయన్నారు. రానున్న ఎన్నికల్లో గిరిజనులు, బడుగు బలహీన వర్గాల మద్దతుతో బాన్సువాడ ఎమ్మెల్యే స్థానాన్ని కైవసం చేసుకొంటామని పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి బద్యానాయక్ పేర్కొన్నారు.