VGTM uda range
-
‘రియల్’ మాయ
సాక్షి ప్రతినిధి, గుంటూరు: నెల రోజుల నుంచి వీజీటీఎం ఉడా పరిధిలో అనధికార లేఅవుట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణంగా తెలు స్తోంది. రాజధాని ఏర్పాటులో సమస్యలు ఏర్పడరాదనే ఉద్దేశంతో ల్యాండ్ కన్వర్షన్, లే అవుట్లకు అనుమతి నిలుపుదల చేసిన ప్రభుత్వం, రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించకపోవడంతో అక్రమ లే అవుట్లు పెరుగుతున్నాయనే అభిప్రాయం వినపడుతోంది. వీటి నియంత్రణకు ఉడాలో సిబ్బంది లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. కొత్త రాజధాని మొదటి నుంచి వీజీటీఎం ఉడా పరిధిలో ఏర్పాటవుతుం దనే ప్రచారం జరిగింది. దీంతో జిల్లాలో తాడేపల్లి, మంగళగిరి, కాజ, పెదకాకాని, గుంటూరు రూరల్, తాడికొండ, ప్రత్తిపాడు, చిలకలూరిపేటల్లోని వ్యవసాయ భూములకు డిమాండ్ ఏర్పడింది. * ఈ ప్రాంతాల్లో అప్పటికే రియల్ ఎస్టేట్ రంగం విస్తరించి ఉండటంతో రియల్టర్లు ఉడా నుంచి అనుమతులు తీసుకోకుం డానే వ్యవసాయ భూములను స్థలాలుగా విభజించి అక్కడి ఏజెంట్ల సాయంతో అమ్మకాలు ప్రారంభించారు. * ఈ నేపథ్యంలోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట స్థలంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ విజయవాడ-గుంటూరు మధ్యనే కొత్త రాజధాని ఏర్పాటు కానున్నట్టు ప్రకటన చేశారు.- ఇక అప్పటి నుంచి ఇతర ప్రాంతాల రియల్ ఎస్టేట్ కంపెనీలు సైతం ఇక్కడ వాలిపోయాయి. పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కొనుగోలు చేశాయి. *ఇవన్నీ లేఅవుట్ల అనుమతి కోరుతూ ఉడాకు దరఖాస్తు చేసు కున్నాయి. వీటిని పరిశీలించే సమయంలోనే ల్యాండ్ కన్వర్షన్లు, లే అవుట్లకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. *దీంతో పెద్ద కంపెనీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఉడా నుంచి లే అవుట్లకు అనుమతి లేకుండానే స్థలాలను అమ్మడం ప్రారంభించాయి. *జిల్లాలో మూడువేల వరకు అనధికార లేఅవుట్లు ఉన్నట్టు ఉడా టౌన్‌ప్లానింగ్, జిల్లా పంచాయతీ, రెవెన్యూ శాఖలు ఒక అంచనాకు వచ్చాయి. *రెండు ఎకరాల నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ లేఅవుట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ లోపభూయిష్టంగా ఉండటంతో కొనుగోలుదారులు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది. *ముఖ్యంగా వీటికి ల్యాండ్ కన్వర్షన్ లేదు. రహదారులకు 20 అడుగుల మించి స్థలం కేటాయించలేదు. మౌలిక సదుపాయా ల ఊసేలేదు. నాన్‌స్టాఫ్ రిజిస్ట్రేషన్లు ... కొత్త రాజధాని ఏర్పాటులో సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు ల్యాండ్ కన్వర్షన్, లే అవుట్లకు అనుమతులు నిలిపివేసిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల నిలుపుదలపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. * ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో నిషేధం విధించలేదని, దీని వల్ల అక్రమ లే అవుట్లు పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు. సిబ్బంది కొరత, అలసత్వం ... * అక్రమ లే అవుట్ల సంఖ్య పెరగడానికి ఉడాలోని సిబ్బంది కొరత, అవినీతి, అలసత్వాన్ని ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు. * ఉడా టౌన్‌ప్లానింగ్‌లో సర్వేయర్ల కొరత వెన్నాడుతోంది. గత ప్రభుత్వం సిబ్బంది సంఖ్య పెంపుదలకు సూత్రపాయంగా అంగీకారం తెలిపినా, కార్య రూపం దాల్చలేదు. * కాంట్రాక్టు విధానంలోనూ సిబ్బందిని నియమించకపోవడంతో అనధికార లే అవుట్లలో స్థలాల కొనుగోళ్లు జరుగుతున్నాయి. * భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కొనుగోలుదారులకు ఎదురుకానుంది. -
ఉడా కన్ను
సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలో అనధికార లేఅవుట్లు పుట్టగొడుగులుగా విస్తరిస్తున్నాయి. అన్నిప్రాంతాల్లో స్థలాల ధరలకు రెక్కలు రావటంతో పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. తాజాగా రాష్ట్రవిభజన జరిగిన క్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా లేఅవుట్లు వేస్తున్నారు. వాటిలో ఎక్కువ లేఅవుట్లకు ఉడా నుంచి అనుమతులు లేవు. దీంతో ఉడా అనధికార లేఅవుట్లపై దృష్టి నిలిపింది. ముఖ్యంగా గడిచిన ఆరేళ్లలో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లపై దృష్టిసారించి సమగ్ర వివరాలను తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఐదు వేల ఎకరాల్లో... ఉడా పరిధిలో రెండు జిల్లాల్లో సుమారు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల్లో అనధికార లేఅవుట్లు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉడా పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాలో విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలతో పాటు తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి. 2012 ముందు వరకు ఉడా పరిధి కేవలం విజయవాడ, గుంటూరు తెనాలి ప్రాంతాలకే పరిమితమై 1945 చదరపు కిలోమీటర్లు మాత్రమే పరిధి ఉండేది. 2012లో అదనంగా రెండు జిల్లాల్లో 8 మున్సిపాలిటీలు ఉడా పరిధిలోకి రావటంతో విస్తీర్ణం 7095 చదరపు కిలోమీటర్లకు పెగింది. దీంతోపాటు ఉడా పరిధిలోకి సుమారు 1600 గ్రామాలు వచ్చాయి. దీంతో ఉడా పరిధి భారీగా పెరిగింది. దానికనుగుణంగా ఉడాలో సిబ్బంది మాత్రం లేకపోవటంతో అనధికార లేఅవుట్లపై చర్యలు పూర్తిస్థాయిలో తీసుకోలేకపోయారు. కేవలం ఫిర్యాదులు వచ్చిన లేఅవుట్లు, ఉడా సిబ్బంది గుర్తించిన వాటిపైనే చర్యలు తీసుకున్నారు. దీంతో అనధికార లేఅవుట్లు వేల ఎకరాల్లోకి చేరాయి. ఈ క్రమంలో ఉడా పరిధి పెరిగిన తర్వాత పంచాయతీల అనుమతులు ఉన్న లేఅవుట్లు మినహా మిగిలిన వాటిపై దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా మంగళగిరి, విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్లు ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు పెరిగిన పరిధి నేపథ్యంలో నూజివీడు, గుడివాడ, సత్తెనపల్లి, పొన్నూరు ప్రాంతాల్లో కూడా అనధికార లేఅవుట్లు ఉన్నట్లు గుర్తించారు. సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్ మరోవైపు ఉడా మాస్టర్‌ప్లాన్ సిద్ధమవుతోంది. మాస్టర్‌ప్లాన్ అమలులోకి వస్తే అనధికార లేవుట్లకు ప్రారంభ దశలో అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. దీంతో మాస్టర్‌ప్లాన్ వచ్చాక చర్యలు తీసుకుందామని ఉడా భావించినా రాజధాని నేపథ్యంలో ముందే చర్యలకు ఉపక్రమిస్తే సంస్థకు ఆదాయం పెరుగుతుందని భావించారు. దీంతో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది సాయంతో... ఉడాను దశాబ్దాలపాటు సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. కేవలం 120 రెగ్యులర్ పోస్టులకు గాను ప్రస్తుతం 58 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఉడా సిబ్బంది నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనధికార లేఅవుట్లను గుర్తించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది సాయంతో ప్రస్తుతం అనధికార లేఅవుట్లపై కొంతమేరకు చర్యలు తీసుకుంటున్నారు. అయితే పూర్తిస్థాయిలో మాత్రం చర్యలు లేకపోవటంతో ఎటువంటి ఫలితం ఉండటం లేదు. గ్రామాల్లో గ్రామకార్యదర్శుల ద్వారా అక్రమాలను గుర్తించి సంబంధిత భూయజమానికి నోటీసుల జారీ, సదరు రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రెండు నెలల క్రితం రెండు జిల్లాల కలెక్టర్ల సమావేశాన్ని ఉడా నిర్వహించింది. అనధికార లేఅవుట్లను నిరోధించటానికి ఉడాకు రెవెన్యూ యంత్రాంగం సహకరించాలని కోరింది. గ్రామాల్లో నూతనంగా వేసే వెంచర్లను ఆయా గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు పరిశీలించి ఉడా అనుమతులు లేనివి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, తద్వారా వారి నుంచి ఉడా సమాచారం తీసుకొని చర్యలు తీసుకోవటానికి వీలుంటుందని దీనికి సహకరించాలని కోరింది. దీనికి రెండు జిల్లాల కలెక్టర్లు అంగీకారం తెలిపారు. దీంతో ఉడా అనధికార లేఅవుట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.