ఉడా కన్ను | uda focus on layouts | Sakshi
Sakshi News home page

ఉడా కన్ను

Published Wed, May 28 2014 2:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:56 AM

ఉడా కన్ను

ఉడా కన్ను

 సాక్షి, విజయవాడ : వీజీటీఎం ఉడా పరిధిలో అనధికార లేఅవుట్‌లు పుట్టగొడుగులుగా విస్తరిస్తున్నాయి. అన్నిప్రాంతాల్లో స్థలాల ధరలకు రెక్కలు రావటంతో పొలాలు రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారుతున్నాయి. తాజాగా రాష్ట్రవిభజన జరిగిన క్రమంలో కృష్ణా, గుంటూరు జిల్లాల్లో భారీగా లేఅవుట్‌లు వేస్తున్నారు. వాటిలో ఎక్కువ లేఅవుట్‌లకు ఉడా నుంచి అనుమతులు లేవు. దీంతో ఉడా అనధికార లేఅవుట్‌లపై దృష్టి నిలిపింది. ముఖ్యంగా గడిచిన ఆరేళ్లలో వేసిన రియల్ ఎస్టేట్ వెంచర్లపై దృష్టిసారించి సమగ్ర వివరాలను తెప్పించుకునే పనిలో నిమగ్నమయ్యారు.
 
 ఐదు వేల ఎకరాల్లో...

 ఉడా పరిధిలో రెండు జిల్లాల్లో సుమారు నాలుగు నుంచి ఐదు వేల ఎకరాల్లో అనధికార లేఅవుట్‌లు ఉన్నట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఉడా పరిధిలోని కృష్ణా, గుంటూరు జిల్లాలో విజయవాడ, గుంటూరు నగరపాలక సంస్థలతో పాటు తొమ్మిది మున్సిపాలిటీలు ఉన్నాయి. 2012 ముందు వరకు ఉడా పరిధి కేవలం విజయవాడ, గుంటూరు తెనాలి ప్రాంతాలకే పరిమితమై 1945 చదరపు కిలోమీటర్లు మాత్రమే పరిధి ఉండేది. 2012లో అదనంగా రెండు జిల్లాల్లో 8 మున్సిపాలిటీలు ఉడా పరిధిలోకి రావటంతో విస్తీర్ణం 7095 చదరపు కిలోమీటర్లకు పెగింది. దీంతోపాటు ఉడా పరిధిలోకి సుమారు 1600 గ్రామాలు వచ్చాయి.
 
 దీంతో ఉడా పరిధి భారీగా పెరిగింది. దానికనుగుణంగా ఉడాలో సిబ్బంది మాత్రం లేకపోవటంతో అనధికార లేఅవుట్‌లపై చర్యలు పూర్తిస్థాయిలో తీసుకోలేకపోయారు. కేవలం ఫిర్యాదులు వచ్చిన లేఅవుట్‌లు, ఉడా సిబ్బంది గుర్తించిన వాటిపైనే చర్యలు తీసుకున్నారు. దీంతో అనధికార లేఅవుట్‌లు  వేల ఎకరాల్లోకి చేరాయి. ఈ క్రమంలో ఉడా పరిధి పెరిగిన తర్వాత పంచాయతీల అనుమతులు ఉన్న లేఅవుట్‌లు మినహా మిగిలిన వాటిపై దృష్టి కేంద్రీకరించారు. ముఖ్యంగా మంగళగిరి, విజయవాడ నగర పరిసర ప్రాంతాల్లో అనధికార లేఅవుట్‌లు ఎక్కువగా ఉన్నాయి. వీటితోపాటు పెరిగిన పరిధి నేపథ్యంలో నూజివీడు, గుడివాడ, సత్తెనపల్లి, పొన్నూరు ప్రాంతాల్లో కూడా అనధికార లేఅవుట్‌లు ఉన్నట్లు గుర్తించారు.
 
 సిద్ధమవుతున్న మాస్టర్ ప్లాన్
 మరోవైపు ఉడా మాస్టర్‌ప్లాన్ సిద్ధమవుతోంది. మాస్టర్‌ప్లాన్ అమలులోకి వస్తే అనధికార లేవుట్‌లకు ప్రారంభ దశలో అడ్డుకట్ట పడే అవకాశం ఉంటుంది. దీంతో మాస్టర్‌ప్లాన్ వచ్చాక చర్యలు తీసుకుందామని ఉడా భావించినా రాజధాని నేపథ్యంలో ముందే చర్యలకు ఉపక్రమిస్తే సంస్థకు ఆదాయం పెరుగుతుందని భావించారు. దీంతో ఉడా చైర్మన్ వణుకూరి శ్రీనివాసరెడ్డి ఈ దిశగా కసరత్తు సాగిస్తున్నారు.
 
 రెవెన్యూ సిబ్బంది సాయంతో...
ఉడాను దశాబ్దాలపాటు సిబ్బంది కొరత పట్టిపీడిస్తోంది. కేవలం 120 రెగ్యులర్ పోస్టులకు గాను ప్రస్తుతం 58 మంది మాత్రమే పనిచేస్తున్నారు. దీంతో ఉడా సిబ్బంది నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి అనధికార లేఅవుట్‌లను గుర్తించిన దాఖలాలు లేవు. ఈ క్రమంలో రెవెన్యూ సిబ్బంది సాయంతో ప్రస్తుతం అనధికార లేఅవుట్‌లపై కొంతమేరకు చర్యలు తీసుకుంటున్నారు.

అయితే పూర్తిస్థాయిలో మాత్రం చర్యలు లేకపోవటంతో ఎటువంటి ఫలితం ఉండటం లేదు. గ్రామాల్లో గ్రామకార్యదర్శుల ద్వారా అక్రమాలను గుర్తించి సంబంధిత భూయజమానికి నోటీసుల జారీ, సదరు రియల్ ఎస్టేట్ సంస్థ నిర్వాహకులకు నోటీసులు జారీ చేస్తున్నారు. రెండు నెలల క్రితం రెండు జిల్లాల కలెక్టర్ల సమావేశాన్ని ఉడా నిర్వహించింది. అనధికార లేఅవుట్‌లను నిరోధించటానికి ఉడాకు రెవెన్యూ యంత్రాంగం సహకరించాలని కోరింది.
 
గ్రామాల్లో నూతనంగా వేసే వెంచర్లను ఆయా గ్రామస్థాయి రెవెన్యూ అధికారులు పరిశీలించి ఉడా అనుమతులు లేనివి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని, తద్వారా వారి నుంచి ఉడా సమాచారం తీసుకొని చర్యలు తీసుకోవటానికి వీలుంటుందని దీనికి సహకరించాలని కోరింది. దీనికి రెండు జిల్లాల కలెక్టర్‌లు అంగీకారం తెలిపారు. దీంతో ఉడా అనధికార లేఅవుట్ నిర్వాహకులకు నోటీసులు జారీ చేసేందుకు కసరత్తు చేస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement