‘రియల్’ మాయ | real estate bhoom in district | Sakshi
Sakshi News home page

‘రియల్’ మాయ

Published Wed, Sep 10 2014 12:00 AM | Last Updated on Sat, Sep 2 2017 1:07 PM

real estate bhoom in district

సాక్షి ప్రతినిధి, గుంటూరు: నెల రోజుల నుంచి వీజీటీఎం ఉడా పరిధిలో అనధికార లేఅవుట్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ప్రభుత్వ విధానాలే ఇందుకు కారణంగా తెలు స్తోంది. రాజధాని ఏర్పాటులో సమస్యలు ఏర్పడరాదనే ఉద్దేశంతో ల్యాండ్ కన్వర్షన్, లే అవుట్లకు అనుమతి నిలుపుదల చేసిన ప్రభుత్వం, రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించకపోవడంతో అక్రమ లే అవుట్లు పెరుగుతున్నాయనే అభిప్రాయం వినపడుతోంది.
 
వీటి నియంత్రణకు ఉడాలో సిబ్బంది లేకపోవడం మరో కారణంగా చెబుతున్నారు. కొత్త రాజధాని మొదటి నుంచి వీజీటీఎం ఉడా పరిధిలో ఏర్పాటవుతుం దనే ప్రచారం జరిగింది. దీంతో జిల్లాలో తాడేపల్లి, మంగళగిరి, కాజ, పెదకాకాని, గుంటూరు రూరల్, తాడికొండ, ప్రత్తిపాడు, చిలకలూరిపేటల్లోని వ్యవసాయ భూములకు డిమాండ్ ఏర్పడింది.
 
* ఈ ప్రాంతాల్లో అప్పటికే రియల్ ఎస్టేట్ రంగం విస్తరించి ఉండటంతో  రియల్టర్లు ఉడా నుంచి అనుమతులు తీసుకోకుం డానే వ్యవసాయ భూములను స్థలాలుగా విభజించి అక్కడి ఏజెంట్ల సాయంతో అమ్మకాలు ప్రారంభించారు.
* ఈ నేపథ్యంలోనే ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఎదుట స్థలంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తూ విజయవాడ-గుంటూరు మధ్యనే కొత్త రాజధాని ఏర్పాటు కానున్నట్టు ప్రకటన చేశారు.- ఇక అప్పటి నుంచి ఇతర ప్రాంతాల రియల్ ఎస్టేట్ కంపెనీలు సైతం ఇక్కడ వాలిపోయాయి. పెద్ద ఎత్తున వ్యవసాయ భూములు కొనుగోలు చేశాయి.
*ఇవన్నీ లేఅవుట్ల అనుమతి కోరుతూ ఉడాకు దరఖాస్తు చేసు కున్నాయి. వీటిని పరిశీలించే సమయంలోనే ల్యాండ్ కన్వర్షన్లు, లే అవుట్లకు అనుమతి ఇవ్వవద్దని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
*దీంతో పెద్ద కంపెనీలు కూడా తప్పనిసరి పరిస్థితుల్లో ఉడా నుంచి లే అవుట్లకు అనుమతి లేకుండానే స్థలాలను అమ్మడం ప్రారంభించాయి.
*జిల్లాలో మూడువేల వరకు అనధికార లేఅవుట్లు ఉన్నట్టు ఉడా టౌన్‌ప్లానింగ్, జిల్లా పంచాయతీ, రెవెన్యూ శాఖలు ఒక అంచనాకు వచ్చాయి.
*రెండు ఎకరాల నుంచి 50 ఎకరాల విస్తీర్ణంలో ఈ లేఅవుట్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఇవన్నీ లోపభూయిష్టంగా ఉండటంతో కొనుగోలుదారులు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తోంది.
*ముఖ్యంగా వీటికి ల్యాండ్ కన్వర్షన్ లేదు. రహదారులకు  20 అడుగుల మించి స్థలం కేటాయించలేదు. మౌలిక సదుపాయా ల ఊసేలేదు.
 
నాన్‌స్టాఫ్  రిజిస్ట్రేషన్లు ... కొత్త రాజధాని ఏర్పాటులో సమస్యలు ఏర్పడకుండా ఉండేందుకు ల్యాండ్ కన్వర్షన్, లే అవుట్లకు అనుమతులు నిలిపివేసిన ప్రభుత్వం రిజిస్ట్రేషన్ల నిలుపుదలపై చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.
 
* ప్రభుత్వానికి ఆదాయం వస్తుందనే ఉద్దేశంతో నిషేధం విధించలేదని, దీని వల్ల అక్రమ లే అవుట్లు పెరుగుతున్నాయని రియల్ ఎస్టేట్ రంగానికి చెందిన నిపుణులు చెబుతున్నారు.
 
 సిబ్బంది కొరత, అలసత్వం ...
* అక్రమ లే అవుట్ల సంఖ్య పెరగడానికి ఉడాలోని సిబ్బంది కొరత, అవినీతి, అలసత్వాన్ని ప్రధాన కారణంగా పేర్కొంటున్నారు.
* ఉడా టౌన్‌ప్లానింగ్‌లో సర్వేయర్ల కొరత వెన్నాడుతోంది. గత ప్రభుత్వం సిబ్బంది సంఖ్య పెంపుదలకు సూత్రపాయంగా అంగీకారం తెలిపినా, కార్య రూపం దాల్చలేదు.
* కాంట్రాక్టు విధానంలోనూ సిబ్బందిని నియమించకపోవడంతో అనధికార లే అవుట్లలో స్థలాల కొనుగోళ్లు జరుగుతున్నాయి.
*  భవిష్యత్‌లో భారీ మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి కొనుగోలుదారులకు ఎదురుకానుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement