View stocks
-
స్టాక్స్ వ్యూ
బజాజ్ ఫైనాన్స్ బ్రోకరేజ్ సంస్థ: ఐసీఐసీఐ డైరెక్ట్ ప్రస్తుత ధర: రూ. 1,047, టార్గెట్ ధర: రూ. 1,300 ఎందుకంటే: బ్యాంకేతర ఆర్థిక సంస్థల్లో అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఫలితాలు అంచనాలను మించాయి. రుణ వృద్ధి ఆరోగ్యకరంగా ఉండటంతో నికర లాభం రూ.556 కోట్లకు పెరిగింది. నికర వడ్డీ ఆదాయం 27 శాతం వృద్ధితో రూ.1,547 కోట్లకు చేరింది. నిర్వహణ ఆస్తులు 33 శాతం వృద్ధితో రూ.57,605 కోట్లకు చేరాయి. స్థూల మొండి బకాయిలు 1.47 శాతంగా ఉన్నాయి. చిన్న మొత్తాల్లో రుణాలివ్వడం, జీవన శైలి ఉత్పత్తులకు రుణాలివ్వడం, మన్నికైన వినియోగవస్తువులకు రుణాలు అందించడం, రుణాల్లో వివిధీకరణ తదితర కారణాల వల్ల అగ్రగామి ఎన్బీఎఫ్సీల్లో ఒకటిగా నిలిచింది. ఈ కారణాల వల్లే 2011–16 మధ్య కాలంలో నిర్వహణఆస్తులు 42 శాతం, నికర లాభం 39 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధించాయి. పలు ఎన్‌బీఎఫ్‌సీల స్థూల మొండి బకాయిలు 2.5 శాతానికి మించి ఉండగా, ఈ కంపెనీ స్థూల మొండి బకాయిలు 1.2 శాతం రేంజ్‌లోనే ఉన్నాయి. గత ఆరేళ్ల కాలంలో రుణ నాణ్యత బాగా మెరుగుపడింది. జీవన శైలి ఉత్పత్తులకు, మన్నికైన వినియోగవస్తువులకు రుణాలు అందించే అంశంలో ఈ కంపెనీకి పోటీ తక్కువగా ఉండడం వల్ల వృద్ధి అవకాశాలు అధికంగా ఉన్నాయి. నిర్వహణ పనితీరు నిలకడగా ఉండడం, మార్జిన్లు, వృద్ధి పటిష్టంగా ఉండడం, రుణ నాణ్యతపై నియంత్రణ తదితర అంశాల కారణంగా రెండేళ్లలో నికర లాభం 34 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి చెందగలదని భావిస్తున్నాం. అలాగే రిటర్న్ ఆన్ ఆసెట్ 3.3 శాతంగానూ, రిటర్న్ ఆన్ ఈక్విటీ 23 శాతంగానూ ఉండొచ్చని అంచనా. రెండేళ్ల కాలంలో నిర్వహణ ఆస్తులు 32 శాతం చక్రగతి వృద్ధితో రూ.76,777 కోట్లకు పెరుగుతాయని భావిస్తున్నాం. టెక్ మహీంద్రా బ్రోకరేజ్ సంస్థ: ఏంజెల్ బ్రోకింగ్ ప్రస్తుత ధర: రూ. 481, టార్గెట్ ధర: రూ. 600 ఎందుకంటే: మహీంద్రా గ్రూప్‌కు చెందిన ఈ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలను మించాయి. ఆదాయం 13 శాతం పెరిగింది. గత క్యూ3లో రూ.751 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ3లో 13 శాతం వృద్ధితో రూ.856 కోట్లకు పెరిగింది. క్వార్టర్ ఆన్ క్వార్టర్ ప్రాతిపదికన చూస్తే 31 శాతం వృద్ధి నమోదైంది. పన్ను వ్యయాలు 25 శాతం తగ్గడంతో ఈ క్యూ3లో మంచి నికర లాభం సాధించింది. గత క్యూ3లో 11.5 శాతంగా ఉన్న ఇబిటా ఈ క్యూ3లో 12.4 శాతానికి పెరిగింది. ఈ క్యూ3లో కొత్తగా 19 క్లయింట్లను సాధించింది. దీంతో కంపెనీ మొత్తం క్లయింట్ల సంఖ్య 837కు చేరింది. ఆదాయం, డీల్స్ పరంగా కమ్యూనికేషన్స్ విభాగం మంచి పనితీరు కనబరుస్తోంది. బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా, ఆరోగ్య సంరక్షణ, తయారీ, రిటైల్ రంగాల నుంచి ఐటీ, సంబంధిత సేవలకు డిమాండ్ పెరుగుతుందని, వాటిని అందిపుచ్చుకోగలమని కంపెనీ ధీమాగా ఉంది. గతంలో సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసింది. ఇటీవలనే ఎల్సీసీ, సాఫ్ట్జెన్లను చేజిక్కించుకుంది. మరిన్ని కంపెనీలను కొనుగోలు చేసి, విలీనం చేసుకోవడం ద్వారా వృద్ధిని పెంచుకుంటోంది. చిన్న, మధ్య స్థాయి కంపెనీలను కొనుగోలు చేసి విలీనం చేసుకోవడంతో పాటు ఆర్డర్లు కూడా జోరుగా ఉంటుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరం చివరికల్లా కంపెనీ ఆదాయం డాలర్ల పరంగా 11 శాతంగా, రూపాయిల పరంగా 12% చక్రగతి వృద్ధి ఉండగలదని అంచనా వేస్తున్నాం. 2009లో సమస్యల్లో ఉన్న సత్యం కంప్యూటర్స్‌ను కొనుగోలు చేసి 2014 కల్లా టర్న్ అరౌండ్‌ను సాధించింది. అలాగే ఇటీవల కొనుగోలు, విలీనం చేసుకున్న కంపెనీల పనితీరు మెరుగుపరచి భవిష్యత్తులో 20% ఇబిటా సాధించగలదన్న అంచనాలున్నాయి. -
స్టాక్స్ వ్యూ
అతుల్ ఆటో బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.565 టార్గెట్ ధర: రూ.625 ఎందుకంటే: త్రి చక్రవాహనాల సెగ్మెంట్లో అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి. వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో కూడా ఇది ఒకటి. మూడు చక్రాల వాహన కేటగిరిలో ప్రయాణికుల వాహనాల నుంచి సరుకులు రవాణా చేసే వాహనాల వరకూ మొత్తం 45 రకాల మోడళ్లను అందిస్తోంది. శక్తి, స్మార్ట్, జెమ్, జెమిని వంటి కీలకమైన బ్రాండ్లతో వ్యాపారాన్ని సాగిస్తోంది. గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక ప్లాంట్ ఉంది. అహ్మదాబాద్‌లో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. 200 మంది ప్రైమరీ డీలర్లతో, 120 మంది సబ్-డీలర్లతో డీలర్ నెట్వర్క్ పటిష్టంగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో క్వార్టర్లో కంపెనీ నికర అమ్మకాలు 9 శాతం వృద్ధితో రూ.143 కోట్లకు, నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.13 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.15కోట్లుగా ఉన్న స్థూల లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో 35 శాతం వృద్ధితో రూ.20 కోట్లకు పెరిగింది. ఇదే జోరు రానున్న క్వార్టర్లలోనూ కొనసాగనున్నదని భావిస్తున్నాం. 2014 సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి ఈ కంపెనీ మొత్తం 19,521 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ వాహన విక్రయాలు 6 శాతం వృద్ధితో 20,763కు పెరిగాయి. రెండేళ్లలో నికర అమ్మకాలు 12 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.625 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు. ట్యూబ్ ఇన్వెస్ట్మెంట్స్ బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డెరైక్ట్ ప్రస్తుత మార్కెట్ ధర: రూ.428 టార్గెట్ ధర: రూ.599 ఎందుకంటే: చోళ మండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఈ కంపెనీ తనకున్న 74 శాతం వాటాలో 14 శాతం వాటాను రూ.900 కోట్లకు భాగస్వామ్య సంస్థ మిత్సుసుమిటొమోకు విక్రయించింది. దీంతో చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ విలువ 6,300 కోట్లుగా అంచనా వేస్తున్నాం. ఈ 14 శాతం ఈ వాటా విక్రయంతో లభించిన నిధులతో రూ.1,400 కోట్లుగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోనున్నది. దీంతో రూ.70 కోట్ల వడ్డీ చెల్లింపుల భారం తగ్గి కంపెనీ నికర లాభం పెరగనున్నది. ఈ సాధారణ బీమా వ్యాపారంలో తన వాటాను మరింతగా విక్రయించనున్నది. ఈ కంపెనీకి చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 46 శాతం వాటా(విలువ రూ.4,800 కోట్లు), చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 60 శాతం వాటా(రూ.3,800కోట్లు), శాంతి గేర్స్‌లో 70 శాతం వాటా(రూ.600 కోట్లు)లు ఉన్నాయి. మార్కెట్ విలువ ప్రకారం ఈ వాటాల విలువ రూ.9,200 కోట్లుగా ఉంది. అయితే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,500 కోట్లుగానే ఉంది. సాధారణ బీమా వ్యాపారంలో ప్రీమియమ్‌లు పెరుగుతుండడం, లాభాలు అధికంగా వచ్చే రిటైల్ సెగ్మెంట్‌పై చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రధానంగా దృష్టిసారించడం సానుకూలాంశాలు. రెండేళ్లలో స్థూల ప్రీమియమ్‌లు 15 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాధారణ బీమా వ్యాపారం రూ.200 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని అంచనా. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే. -
స్టాక్స్ వ్యూ
భారతీ ఇన్ఫ్రాటెల్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్ రీసెర్చ్ ప్రస్తుత ధర: రూ.396 టార్గెట్ ధర: రూ.450 ఎందుకంటే: వెర్లైస్ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకు అవసరమైన టెలికాం టవర్ల ఏర్పాటు, నిర్వహణ, ఇతర టెలికాం మౌలిక సదుపాయాలను అందజేస్తోంది. ఈ తరహా సేవలను అందిస్తున్న అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి. వివిధ మొబైల్ ఆపరేటర్లకు(ఆదాయం పరంగా టాప్ త్రీ పొజిషన్లలో ఉన్న భారతీ ఎయిర్టెల్, వొడాఫోన్, ఐడియా సెల్యులర్లకు) కమ్యూనికేషన్ స్ట్రక్చర్స్‌ను, టెలికాం టవర్లమౌలిక సదుపాయాలను దేశవ్యాప్తంగా అందిస్తోంది. కంపెనీ 87వేలకు పైగా టెలికాం టవర్లను నిర్వహిస్తోంది. వీటిల్లో ఈ కంపెనీ సొంతానివి 37వేలకు పైగా ఉండగా, మిగతావి ఈ కంపెనీకి 42 శాతం వాటా ఉన్న ఇంటస్ టవర్స్ కంపెనీవి. తన కార్యకలాపాల్లో అధిక భాగం పర్యావరణ అనుకూల విధానాలనే పాటిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక ఆర్థిక ఫలితాలు అంచనాలకు అనుగుణంగానే ఉన్నాయి. గత క్యూ2లో రూ. 2,930 కోట్లుగా ఉన్న ఆదాయం ఈ క్యూ2లో 4 శాతం వృద్ధితో రూ.3,037 కోట్లకు పెరిగింది. ఇబిటా రూ.1,328 కోట్ల నుంచి 14 శాతం వృద్ధితో రూ.1,516 కోట్లకు ఎగసింది. నికర లాభం రూ.465 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో రూ.579 కోట్లకు పెరిగింది. గత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.5,773 కోట్లుగా ఉన్న ఈ కంపెనీ ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో రూ.6,053 కోట్లకు పెరిగాయి. కంపెనీ ఇదే జోరును రానున్న క్వార్టర్లలో కూడా కొనసాగించవచ్చు. ప్రస్తుత ధరకు, పుస్తక ధరకు మధ్య ఉన్న నిష్పత్తి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 3.83కు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో 3.43కు తగ్గుతుందని అంచనా. రెండేళ్లలో నికర అమ్మకాలు 7 శాతం, నికర లాభం 26 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా. మధ్య నుంచి దీర్ఘకాలానికి రూ.450 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు. బ్రిటానియా ఇండస్ట్రీస్ : కొనొచ్చు బ్రోకరేజ్ సంస్థ: షేర్‌ఖాన్ ప్రస్తుత ధర: రూ.2,936 టార్గెట్ ధర: రూ.3,650 ఎందుకంటే: ఈ ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల కాలంలో అమ్మకాలు రెండంకెల వృద్ధిని సాధించాయి.ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ 4 శాతం పెరిగి 15 శాతానికి చేరింది. ఇదే జోరు ఈ ఆర్థిక సంవత్సరం మిగిలిన ఆర్నెళ్లలో కూడా కొనసాగించగలమని కంపెనీ ధీమాగా ఉంది. ఈ ఆర్నెళ్లలో అమ్మకాలు 8-10 శాతం వృద్ధి చెందుతాయని కంపెనీ అంచనా వేస్తోంది. ముడి పదార్ధాల ధరలు తక్కువ స్థాయిల్లో ఉండడం, వివిధ వ్యయ నియంత్రణ పద్ధతుల కారణంగా మార్జిన్లు 14 శాతం రేంజ్లో ఉండొచ్చని భావిస్తోంది. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందితే ఈ కంపెనీకి భారీగా ప్రయోజనం కలుగనున్నది. గత ఒక నెల కాలంలో ఈ షేర్ ధర 11 శాతం వరకూ తగ్గింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత ధరలో ఈ షేర్ కొనుగోళ్లకు ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. మంచి వృద్ధి అవకాశాలున్న ఈ షేర్‌ను రూ.3,650 టార్గెట్ ధరగా కొనుగోలు చేయవచ్చని సూచిస్తున్నాం. టైగర్ బ్రాండ్‌ను మళ్లీ మార్కెట్లోకి తేనున్నది. రస్క్, కేకుల వంటి స్నాక్‌ల మార్కెట్లోకి మరింతగా విస్తరించనున్నది. 75 దేశాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్నప్పటికీ కంపెనీకి వస్తోన్న అంతర్జాతీయ ఆదాయం మొత్తం ఆదాయంలో 6 శాతంగానే ఉంది. కొత్త ఉత్పత్తులతో, నెట్వర్క్ ఇస్తరణతో దీనిని నాలుగేళ్లలో 20 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. బిస్కెట్ల కంటే మార్జిన్లు అధికంగా ఉండే కేక్‌లు, రస్క్‌ల అమ్మకాలను పెంచుకోవాలని యోచిస్తోంది. వినూత్నమైన, విభిన్నమైన రుచులు గల ఉత్పత్తులను అభివృద్ధి చేయడానికి రూ.65 కోట్లతో రీసెర్చ్ సెంటర్‌ను ఏర్పాటు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో రూ.7,858 కోట్లుగా ఉన్న కంపెనీ నికర అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.8,836 కోట్లకు, వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.10,312 కోట్లకు పెరుగుతాయని అంచనా. గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.