స్టాక్స్ వ్యూ | Stocks View | Sakshi
Sakshi News home page

స్టాక్స్ వ్యూ

Published Mon, Jan 4 2016 1:15 AM | Last Updated on Sun, Sep 3 2017 3:01 PM

Stocks View

అతుల్ ఆటో
బ్రోకరేజ్ సంస్థ: ఫస్ట్‌కాల్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.565
టార్గెట్ ధర: రూ.625
ఎందుకంటే: త్రి చక్రవాహనాల సెగ్మెంట్లో అగ్రశ్రేణి కంపెనీల్లో ఒకటి.  వేగంగా వృద్ధి చెందుతున్న కంపెనీల్లో కూడా ఇది ఒకటి.  మూడు చక్రాల వాహన కేటగిరిలో  ప్రయాణికుల వాహనాల నుంచి సరుకులు రవాణా చేసే వాహనాల వరకూ మొత్తం 45 రకాల మోడళ్లను అందిస్తోంది. శక్తి, స్మార్ట్, జెమ్, జెమిని వంటి కీలకమైన బ్రాండ్లతో వ్యాపారాన్ని సాగిస్తోంది.

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో ఒక ప్లాంట్ ఉంది. అహ్మదాబాద్‌లో మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయనున్నది. 200 మంది ప్రైమరీ డీలర్లతో, 120 మంది సబ్-డీలర్లతో డీలర్ నెట్‌వర్క్ పటిష్టంగా ఉంది. గత ఏడాది సెప్టెంబర్ 30తో ముగిసిన రెండో క్వార్టర్లో కంపెనీ నికర అమ్మకాలు 9 శాతం వృద్ధితో రూ.143 కోట్లకు, నికర లాభం 23 శాతం వృద్ధితో రూ.13 కోట్లకు పెరిగాయి. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో రూ.15కోట్లుగా ఉన్న స్థూల లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ2లో 35 శాతం వృద్ధితో రూ.20 కోట్లకు పెరిగింది.

ఇదే జోరు రానున్న క్వార్టర్లలోనూ కొనసాగనున్నదని భావిస్తున్నాం. 2014 సంవత్సరం ఏప్రిల్-సెప్టెంబర్ కాలానికి ఈ కంపెనీ మొత్తం 19,521 వాహనాలను విక్రయించింది. గత ఏడాది ఇదే కాలానికి కంపెనీ వాహన విక్రయాలు 6 శాతం వృద్ధితో 20,763కు పెరిగాయి. రెండేళ్లలో నికర అమ్మకాలు 12 శాతం, నికర లాభం 20 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని అంచనా.  మధ్య కాలం నుంచి దీర్ఘకాలానికి రూ.625 టార్గెట్ ధరగా ప్రస్తుత ధరలో ఈ షేర్‌ను కొనుగోలు చేయవచ్చు.
 
ట్యూబ్ ఇన్వెస్ట్‌మెంట్స్
బ్రోకరేజ్ సంస్థ: యాక్సిస్ డెరైక్ట్
ప్రస్తుత మార్కెట్ ధర: రూ.428
టార్గెట్ ధర: రూ.599
ఎందుకంటే: చోళ మండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌లో ఈ కంపెనీ తనకున్న 74 శాతం వాటాలో 14 శాతం వాటాను రూ.900 కోట్లకు భాగస్వామ్య సంస్థ మిత్సుసుమిటొమోకు విక్రయించింది. దీంతో చోళమండలం ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్  విలువ 6,300 కోట్లుగా అంచనా వేస్తున్నాం. ఈ 14 శాతం ఈ వాటా విక్రయంతో లభించిన నిధులతో రూ.1,400 కోట్లుగా ఉన్న రుణ భారాన్ని తగ్గించుకోనున్నది.

దీంతో రూ.70 కోట్ల వడ్డీ చెల్లింపుల భారం తగ్గి కంపెనీ నికర లాభం పెరగనున్నది. ఈ సాధారణ బీమా వ్యాపారంలో తన వాటాను మరింతగా విక్రయించనున్నది. ఈ కంపెనీకి చోళమండలం ఇన్వెస్ట్‌మెంట్స్‌లో 46 శాతం వాటా(విలువ రూ.4,800 కోట్లు), చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్‌లో 60 శాతం వాటా(రూ.3,800కోట్లు), శాంతి గేర్స్‌లో 70 శాతం వాటా(రూ.600 కోట్లు)లు ఉన్నాయి.

మార్కెట్ విలువ ప్రకారం ఈ వాటాల విలువ రూ.9,200 కోట్లుగా ఉంది. అయితే ఈ కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,500 కోట్లుగానే ఉంది. సాధారణ బీమా వ్యాపారంలో ప్రీమియమ్‌లు పెరుగుతుండడం, లాభాలు అధికంగా వచ్చే రిటైల్ సెగ్మెంట్‌పై చోళ ఎంఎస్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ ప్రధానంగా దృష్టిసారించడం సానుకూలాంశాలు. రెండేళ్లలో స్థూల ప్రీమియమ్‌లు 15 శాతం చొప్పున చక్రగతిన వృద్ధి సాధిస్తాయని, వచ్చే ఆర్థిక సంవత్సరంలో సాధారణ బీమా వ్యాపారం రూ.200 కోట్ల నికర లాభాన్ని ఆర్జిస్తుందని అంచనా.
 
గమనిక: ఈ కాలమ్‌లో షేర్లపై ఇచ్చిన సలహాలు, సూచనలు, వివిధ బ్రోకరేజి సంస్థలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు మాత్రమే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement