
సాక్షి, న్యూఢిల్లీ : రిలయన్స్ ఇండస్ర్టీస్ లిమిటెడ్ (ఆర్‌ఐఎల్) పూర్తిస్థాయిలో సామర్థ్యం కనబరిచే సమయం ఇంకా రాలేదని బ్రోకింగ్ సంస్థలు అంచనా వేస్తున్నాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో మెరుగైన ఫలితాలు ప్రకటించినా మున్ముందు ఆర్‌ఐఎల్ పూర్తిస్థాయిలో సత్తా చాటుతుందని ఆశాభావం వ్యక్తం చేశాయి. జియో రాబడులు ఆశించిన మేర రాకున్నా కంపెనీ పెట్రోకెమికల్ సామర్థ్యం మెరుగ్గా ఉండటంతో 2017-18 ఆర్థిక సంవత్సరంలో ఆర్‌ఐఎల్ ఫలితాలు ఆశాజనకంగా ఉన్నాయని హెచ్‌ఎస్‌బీసీ పేర్కొంది.
గోల్డ్‌మాన్ శాక్స్..
పెట్రోకెమికల్ డివిజన్ నుంచే ఆర్‌ఐఎల్ సత్తా చాటిందని ప్రతి క్వార్టర్‌లో 10 శాతం వృద్ధి కనబరుస్తూ రిఫైనింగ్ రాబడిని మించి అతిపెద్ద రాబడి ఆర్జించే విభాగంగా పెట్రోకెమికల్ ఎదిగిందని గోల్డ్‌మాన్ శాక్స్ పేర్కొంది. రిటైల్ బిజినెస్ నుంచి మెరుగైన వృద్ధితో రిఫైనింగ్ మార్జిన్లపై అంచనాలు తప్పాయని పేర్కొంది. ఇక ప్రతి యూజర్‌పై సగటు రాబడి (ఏఆర్‌పీయూ) తగ్గినా సబ్‌స్ర్కైబర్ల సంఖ్య గణనీయంగా పెరగడంతో జియో రాబడి అంచనాలకు అనుగుణంగానే ఉందని గోల్డ్‌మన్ శాక్స్ తెలిపింది. ఆర్‌ఐఎల్ షేర్లు పెరుగుతున్నా ఇంతకుమించి పెరగవని ఇన్వెస్టర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఆర్‌ఐఎల్ మెరుగైన ప్రదర్శన ఇంకా మొదలు కాలేదని పేర్కొంది.
మోర్గాన్‌స్టాన్లీ..
ఆర్‌ఐఎల్ ఇంధన రాబడులు అంతర్జాతీయ కంపెనీలతో పోలిస్తే అత్యంత నిలకడగా ఉన్నాయి. వృద్ధి పరంపరను కొనసాగించే సంకేతాలు పంపుతున్నాయి. ఇక రిటైల్, టెలికాం విభాగాలు రాబడులను మెరుగుపరుస్తాయి. డేటా యూసేజ్ ఇతర యూజర్ల తరహాలోనే ఉంది.
బ్యాంక్ ఆఫ్ అమెరికా
ఆర్‌ఐఎల్ నాలుగో క్వార్టర్‌లో రిఫైనింగ్ రాబడులను (రూ 6400 కోట్లు) పెట్రోకెమికల్ బిజినెస్ రూ(7700 కోట్లు) అధిగమించింది. జియో కేవలం టెలికాం రంగానికే పరిమితం కాదని ఇది డిజిటల్ సేవల వ్యాపారంలో భాగమని ఆర్‌ఐఎల్ ప్రస్తావించడం గమనార్హం. రానున్న రోజుల్లో జియో దశల వారీగా ఫైబర్ టూ హోం సేవలను ప్రారంభించనుంది.
కొటాక్ సెక్యూరిటీస్
జియో ఊపందుకునే వరకూ ఆర్‌ఐఎల్ వృద్ధి పరంపర మందగమనంలో ఉండే అవకాశం ఉంది. పెట్రోకెమికల్ ప్రాజెక్టులు పూర్తిస్ధాయిలో ఉపయోగంలోకి వచ్చిన అనంతరం మెరుగైన వృద్ధిని అంచనా వేయవచ్చు.
డచ్ బ్యాంక్..
రాబోయే ఆరు నెలల్లో ఇంధన రంగంలో నూతన ప్రాజెక్టుల ఆరంభం, జియో నుంచి రాబడులతో ఆర్‌ఐఎల్ మెరుగైన సామర్థ్యం కనబరిచే అవకాశం ఉంది. 2018-20 ఆర్థిక సంవత్సరాల్లో ఆర్‌ఐఎల్ రాబడులు 24 శాతం మేర వృద్ధి సాధించవచ్చు.