డబుల్స్ చాంప్స్ విఘ్నేశ్-వినాయక్
న్యూఢిల్లీ: ఫెనెస్టా జాతీయ ఓపెన్ టెన్నిస్ చాంపియన్‌షిప్‌లో పురుషుల డబుల్స్ టైటిల్‌ను హైదరాబాద్‌కు చెందిన పి.సి.విఘ్నేశ్-కాజా వినాయక్ శర్మ జోడీ సొంతం చేసుకుంది. ఇక్కడి ఆర్కే ఖన్నా స్టేడియంలో శుక్రవారం జరిగిన ఫైనల్లో విఘ్నేశ్-వినాయక్ ద్వయం 6-3, 6-2తో నితిన్ కీర్తనే (మహారాష్ట్ర)-సౌరవ్ సుకుల్ (పశ్చిమ బెంగాల్) జంటపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో ఢిల్లీ కుర్రాడు సిద్ధార్థ్ రావత్‌తో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ అమీతుమీ తేల్చుకుంటాడు.
సెమీఫైనల్లో విష్ణు 6-3, 6-7 (4/7), 6-4తో రోనిత్ బిష్త్‌పై, సిద్ధార్థ్ 6-1, 6-1తో టాప్ సీడ్ కరుణోదయ్ సింగ్‌పై గెలిచారు. మహిళల సింగిల్స్ విభాగంలో హైదరాబాద్ అమ్మాయి పెద్దిరెడ్డి వైష్ణవి రెడ్డి పోరాడి ఓడిపోయింది. కర్మాన్ కౌర్‌తో జరిగిన సెమీఫైనల్లో వైష్ణవి తొలి సెట్‌ను 6-4తో నెగ్గి, రెండో సెట్‌ను 1-6తో కోల్పోయింది. మూడో సెట్లో స్కోరు 0-3తో ఉన్న దశలో వైష్ణవి గాయం కారణంగా మ్యాచ్ నుంచి వైదొలిగింది.