తప్పుకోలేదు... తప్పించారు
‘‘నిర్మాణ సంస్థలకు నా నుంచి సరైన మద్దతు లభించదనే నెపంతో నన్ను ఓ సినిమా నుంచి హీరోయిన్గా తొలగించారు’’ అని వాపోయారు అమలా పాల్. విజయ్ సేతుపతి హీరోగా విజయ్ కృష్ణన్ దర్శకత్వంలో చంద్ర ఆర్ట్స్ పతాకంపై తమిళంలో ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో తొలుత హీరోయిన్గా అమలా పాల్‌ను ఎంపిక చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె స్థానంలో హీరోయిన్గా మేఘా ఆకాష్‌ను తీసుకున్నారు. అమలా పాల్ భారీ పారితోషికం డిమాండ్ చేయడంవల్లే ఆమెను ఈ సినిమా నుంచి తొలగించారనే వార్తలు ప్రచారంలోకొచ్చాయి.
ఈ వివాదం గురించి అమలా పాల్ తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ‘‘ప్రొడక్షన్ హౌస్‌లకు నా వంతుగా సపోర్ట్ చేస్తున్నానా? లేదా? అనే విషయంలో ఆత్మశోధన చేసుకునే ప్రక్రియలో భాగంగా ఈ పోస్ట్ పెడుతున్నాను. దశాబ ్దకాలంగా నేను ఇండస్ట్రీలో కొనసాగుతున్నాను. నా పరిచయస్తులు, నా సహనటీనటులు ఇప్పటివరకు నాపై ఎటువంటి ఆరోపణలు చేయలేదు. నేను నిర్మాణ సంస్థలకు చాలా సపోర్టివ్‌గా ఉంటాను. ఇందకు కొన్ని ఊదాహరణలు చెప్పదలచుకున్నాను. ‘భాస్కర్ ఒరు రాస్కెల్’ సినిమా ప్రొడ్యూసర్ నాకు ఇవ్వాల్సిన పారితోషకాన్ని ఇవ్వడంలో విఫలమయ్యారు.
కానీ ఆయన ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకుని నా డబ్బులు నాకు ఇచ్చే తీరాలని ఆయన్ను ఒత్తిడి చేయలేదు. అలాగే నేను నటించి రిలీజ్‌కు సిద్ధమైన ‘అదో అంద పరవై పోల’ షూటింగ్ సమయంలో నాకు ఓ చిన్న గ్రామంలో వసతి ఏర్పాటు చేశారు. కావాలనుకుంటే సిటీలో హోటల్ రూమ్ బుక్ చేయమని నేను అడగొచ్చు. కానీ చిత్రబృందం సమయం, డబ్బులు వృథా కాకూడదని నేను అడ్జస్ట్ అయ్యానే. అంతేకాదు నేను ఇచ్చిన డేట్స్ కన్నా ఇంకా సమయం కేటాయించాల్సి వచ్చింది. పైగా క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదని ఈ సినిమా లాస్ట్ డే షూటింగ్ ఖర్చులన్నీ నేనే భరించాను.
ఇక ‘ఆడై’ (తెలుగులో ‘ఆమె’) సినిమాని సాలరీ కమ్ ప్రాఫిట్ షేర్ బేసిస్ మీద కమిటై చేశాను. కేవలం అడ్వాన్స్ మాత్రమే తీసుకుని ఈసినిమా షూటింగ్‌ను పూర్తి చేశాను. ఇలా నేను చేస్తున్న సినిమాల నిర్మాణ æసంస్థలకు మొదటి ప్రాధాన్యత ఇస్తూ, నా అవసరాలకు రెండోప్రాధాన్యతను ఇస్తున్నాను. ఇప్పుడు కూడా చంద్ర ఆర్ట్స్ నిర్మాణ సంస్థ తెరకెక్కించనున్న సినిమాలోని నా పాత్ర కోసం నా సొంత ఖర్చులతో కాస్ట్యూమ్స్ కొనడానికి ముంబై వచ్చాను. ఈ సంస్థ ఎప్పుడూ ఆర్థికపరమైన వివాదాల్లో నిలుస్తూనే ఉంటుంది. నేను ఊటీలో ఏవేవో సౌకర్యాలు అడిగానని, తమ నిర్మాణసంస్థకు నేను సరిపోనని చెప్పి నన్ను హీరోయిన్గా తొలగించారు.
కనీసం ఈ విషయం గురించి నాతో సరైనచర్చలు జరపకుండానే వారు ఈ నిర్ణయం తీసుకున్నారు. కానీ నేను భారీ పారితోషికం డిమాండ్ చేశానని ఆరోపించారు. ‘ఆడై’ టీజర్ రిలీజ్ తర్వాత నన్ను తప్పించారు. ఇలాంటి నిర్మాణ సంస్థల ఆలోచనా ధోరణిలో మార్పు రావాల్సిన అవసరం ఉంది’’ అని చెప్పుకొచ్చారు అమలాపాల్. ఇంకా చెబుతూ – ‘‘విజయ్ సేతుపతిగారికి నేను పెద్ద అభిమానిని. ఆయనతో వర్క్ చేయాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నాను. ఇప్పుడు ఇలా ఈ అవకాశం చేజారింది. చంద్ర ప్రొడక్షన్స్ వల్ల ఇండస్ట్రీలో వత్తిపరంగా నా నడత గురించి వినిపిస్తున్న పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టేందుకే నేను ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది’’ అని పేర్కొన్నారు అమలా పాల్.