Vijay TV
-
వరదలు : తమిళ మీడియా సంస్థలు, నటుల ఔదార్యం
చెన్నై: ప్రకృతి బీభత్సంతో విలవిల్లాడుతున్న కేరళను ఆదుకునే విషయంలో తమిళనాడు ప్రజలు, నటులు, మీడియా సంస్థలు తమ ఔదార్యాన్ని ప్రదర్శించాయి. పొరుగు రాష్ట్రం కేరళ మద్దతుగా స్పందిస్తున్నాయి. అక్కడి సహాయ, రక్షణ,పునారవాస కార్యక్రమాల్లో అనేకమంది ప్రజలు నిమగ్నమయ్యారు. అలాగే కోట్ల రూపాయలు విరాళాలతో ఆపదలో ఆపన్నహస్తమవుతున్నారు. ముఖ్యంగా సన్‌టీవీ కోటి రూపాయల విరాళమిస్తున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు కోటి రూపాయలను కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు అందించారు. అలాగే తమిళనాట మరో ప్రముఖ టీవీ విజయ్ టీవీ కూడా 25లక్షల రూపాయలను ప్రకటించింది. ఇప్పటికే తమిళ సినీహీరో విశాల్ భారీ విరాళం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. అలాగే కేరళ ప్రజలను ఆదుకోవాల్సిందిగా ట్విటర్ ద్వారా విజ్ఞప్తి చేశారు. అలాగే మరో హీరో సిద్దార్థ్ ట్విటర్లో కేరళ డొనేషన్ చాలెంజ్‌ను ప్రారంభించారు. దీనికి భారీ స్పందన లభిస్తోంది. సినీ నటుడు, లీడర్ కమల్‌హాసన్ రూ. 25లక్షలు, తమిళ హీరోలు సూర్య, కార్తి 25లక్షలు విరాళమిచ్చారు. మరోవైపు తమిళనటులతో పాటు మలయాళం నటుడు మోహన్ లాల్, మమ్ముట్టి, దుల్కర్ సాల్మన్ కేరళ వదరబాధితులకు తమ వంతు సహాయాన్ని ప్రకటించారు. దీంతోపాటు అసోసియేషన్ ఆఫ్ మలయాల మూవీ ఆర్టిస్ట్స్ (అమ్మా) 10కోట్ల రూపాయలను సీఎం సహాయ నిధికి విరాళమిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే టాలీవుడ్ హీరోలు అల్లు అర్జున్ విజయ్ దేవర్ కొండ భారీ విరాళాలను ప్రకటించారు. Sun TV has donated One Crore Rupees to the Kerala Chief Minister’s Disaster Relief Fund towards the Kerala Government’s flood relief works. pic.twitter.com/sF5T6Gtvn1 — Sun TV (@SunTV) August 17, 2018 -
కేసు నమోదు : చిక్కుల్లో బిగ్‌బాస్ 2!
చెన్నై : రాజకీయ ప్రత్యర్ధి ఎవరన్నది నిర్ణయించుకునే సమయం అసన్నమైందని ఇటీవల వ్యాఖ్యానించిన మక్కళ్ నీది మయం పార్టీ అధ్యక్షుడు, నటుడు కమల్ హాసన్ చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న తమిళ బిగ్‌బాస్-2 రియాల్టీ షోపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో కమల్ హాసన్, బిగ్‌బాస్ 2 నిర్వాహకులతో పాటు షోను ప్రసారం చేస్తున్న విజయ్ టీవీలపై చెన్నై నగర పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు అందింది. ఉద్దేశపూర్వకంగానే కమల్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఇటీవల ప్రసారమైన ఓ ఎపిసోడ్లో వీక్లీ టాస్క్ జరిగింది. ఆ ఎసిసోడ్‌లో బిగ్‌బాస్ హౌస్ కంటెస్టెంట్ ఒకరు నియంతగా వ్యవహరించాల్సి వచ్చింది. తర్వాతి ఎపిసోడ్లో హోస్ట్ కమల్ ఆ టాస్క్ గురించి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని నియంతలా పాలిస్తే నేతలకు ఎలాంటి గతి పడుతుందో అందరూ చూశారని పేర్కొన్నారు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే నాయకురాలు జయలలితను నియంతగా చూపించే యత్నం జరిగిందని ఆరోపిస్తూ దీనిపై చర్యలు తీసుకోవాలని లూయిసాల్ రమేష్ అనే న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. రియాల్టీ షో అయినందున కమల్ హాసన్, బిగ్‌బాస్ 2 తమిళ్ నిర్వాహకులు, షో ప్రసారం చేస్తున్న విజయ్ టీవీ ఛానల్లపై చర్యలు తీసుకోవాలని రమేష్ తన ఫిర్యాదులో కోరారు. కాగా, ఇలాంటి రియాల్టీ షోలు తమిళ సంస్కృతి, సంప్రదాయాలకు విరుద్ధమని కొందరు సామాజికవేత్తలు ఇటీవల విజయ్ టీవీ ఛానల్ ఆఫీసు ముందు పెద్ద ఎత్తున ధర్నాకు దిగారు. తమిళ ఆచారాలను మంటగలుపుతున్నారని విమర్శిస్తూ.. బిగ్‌బాస్ తమిళ రియాల్టీ షోపై నిషేధం విధించాలని హిందూ మక్కల్ కట్చి (హెచ్ఎంకే) పార్టీ పలుమార్లు హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో షో మరో కొత్త వివాదంలో చిక్కుకుంది. -
27న ఇసైజ్ఞానికి అభినందనోత్సవం
వెయ్యి చిత్రాలు, 5 వేల పాటలకు సంగీతం అందించడం అసాధారణం అని చెప్పకతప్పదు. అలాంటి సాధనను ఆలవోకగా అధిగమించిన సంగీత జ్ఞాని ఇళయరాజా. ఒక భారతీయుడిగా మనందరం గర్వించే ఓ అద్భుత వ్యక్తి ఇళయరాజా. పలు భాషల్లో తన సంగీత ప్రవాహంతో ఖండాంతర ఖ్యాతి గాంచిన ఇళయరాజా సాధనకుగానూ ఆయనకు ఈ నెల 27న బ్రహ్మాండ అభినందనోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఇళయరాజా మ్యూజిక్ మేనేజ్మెంట్, విజయ్ టీవీ సంయుక్తంగా నిర్వహించనున్న ఆ కార్యక్రమం చెన్నైలో జరగనుంది. ఆ వేదికపై ఇళయరాజా సంగీతం అందించిన ఆణిముత్యాలాంటి పాటల గానాంమృతం కార్యక్రమం ఆయనకు కానుకగా సమర్పించడానికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ పాల్గొననున్నట్లు, కనీవినీ ఎరుగని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. వెయ్యి చిత్రాలన్నది ఒక లెక్కకే ఇళయరాజా మాట్లాడుతూ వెయ్యి చిత్రాలకు సంగీతం అందించానన్నది తనకు సంబంధించినంత వరకూ అది ఒక లెక్కకేనని పేర్కొన్నారు. దీంతో తాను గర్వపడడం లేదన్నారు. సంగీతం తన జీవితం, శ్వాస. తన అభిమానుల కరతాళ ధ్వనులే తనకు అభినందనలు. నా జీవితానికి అర్థం, పరమార్థం అవేనని పేర్కొన్నారు. తనకు అభినందన అనడం ఆ సంగీతాన్ని తనకిచ్చిన భగవంతునికే అభినందనగా భావిస్తూ తానా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు. జగ్జిత్సింగ్ మెమోరియల్ అవార్డు ఈ ఇసైజ్ఞానికి మరో అరుదైన అవార్డు వరించినుందన్నది తాజా అంశం. మన జాతి రత్నాల్లో జగ్జిత్సింగ్ ఒకరని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన పేరుతో ప్రతి ఏడాది వివిధ రంగాల్లో సాధించిన వారికి జగ్జిత్ ఫైండేషన్ జగ్జిత్ మెమోరియల్ అవార్డును అందించి గౌరవిస్తూ వస్తోంది. ఈ ఫైండేషన్ 75వ వార్షికం సందర్భంగా 2016వ ఏడాదికిగాను ఆ అవార్డుతో సంగీత జ్ఞానిని సత్కరించనున్నట్లు ఆ ఫైండేషన్ చైర్మన్ చిత్రాసింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ నెల 7,8 తేదీల్లో ముంబైలో నిర్వహించనున్న జగ్జిత్సింగ్ మ్యూజిక్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఇళయరాజాకు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంగీత కళాకారులు ఉస్తాద్ జకీర్ హుస్సేన్, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ బిర్జు మహరాజ్, సోనూనిగమ్, సురేశ్ వడ్కర్, హరిహరన్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.