27న ఇసైజ్ఞానికి అభినందనోత్సవం
వెయ్యి చిత్రాలు, 5 వేల పాటలకు సంగీతం అందించడం అసాధారణం అని చెప్పకతప్పదు. అలాంటి సాధనను ఆలవోకగా అధిగమించిన సంగీత జ్ఞాని ఇళయరాజా. ఒక భారతీయుడిగా మనందరం గర్వించే ఓ అద్భుత వ్యక్తి ఇళయరాజా. పలు భాషల్లో తన సంగీత ప్రవాహంతో ఖండాంతర ఖ్యాతి గాంచిన ఇళయరాజా సాధనకుగానూ ఆయనకు ఈ నెల 27న బ్రహ్మాండ అభినందనోత్సవ కార్యక్రమం జరుగనుంది. ఇళయరాజా మ్యూజిక్ మేనేజ్‌మెంట్, విజయ్ టీవీ సంయుక్తంగా నిర్వహించనున్న ఆ కార్యక్రమం చెన్నైలో జరగనుంది.
ఆ వేదికపై ఇళయరాజా సంగీతం అందించిన ఆణిముత్యాలాంటి పాటల గానాంమృతం కార్యక్రమం ఆయనకు కానుకగా సమర్పించడానికి చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ పాల్గొననున్నట్లు, కనీవినీ ఎరుగని విధంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.
వెయ్యి చిత్రాలన్నది ఒక లెక్కకే
ఇళయరాజా మాట్లాడుతూ వెయ్యి చిత్రాలకు సంగీతం అందించానన్నది తనకు సంబంధించినంత వరకూ అది ఒక లెక్కకేనని పేర్కొన్నారు. దీంతో తాను గర్వపడడం లేదన్నారు. సంగీతం తన జీవితం, శ్వాస. తన అభిమానుల కరతాళ ధ్వనులే తనకు అభినందనలు. నా జీవితానికి అర్థం, పరమార్థం అవేనని పేర్కొన్నారు. తనకు అభినందన అనడం ఆ సంగీతాన్ని తనకిచ్చిన భగవంతునికే అభినందనగా భావిస్తూ తానా కార్యక్రమంలో పాల్గొననున్నట్లు ఇళయరాజా పేర్కొన్నారు.
జగ్జిత్‌సింగ్ మెమోరియల్ అవార్డు ఈ ఇసైజ్ఞానికి మరో అరుదైన అవార్డు వరించినుందన్నది తాజా అంశం. మన జాతి రత్నాల్లో జగ్జిత్‌సింగ్ ఒకరని గర్వంగా చెప్పుకోవచ్చు. ఆయన పేరుతో ప్రతి ఏడాది వివిధ రంగాల్లో సాధించిన వారికి జగ్జిత్ ఫైండేషన్ జగ్జిత్ మెమోరియల్ అవార్డును అందించి గౌరవిస్తూ వస్తోంది. ఈ ఫైండేషన్ 75వ వార్షికం సందర్భంగా 2016వ ఏడాదికిగాను ఆ అవార్డుతో సంగీత జ్ఞానిని సత్కరించనున్నట్లు ఆ ఫైండేషన్ చైర్మన్ చిత్రాసింగ్ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ఈ నెల 7,8 తేదీల్లో ముంబైలో నిర్వహించనున్న జగ్జిత్‌సింగ్ మ్యూజిక్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఇళయరాజాకు అవార్డును ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రఖ్యాత సంగీత కళాకారులు ఉస్తాద్ జకీర్ హుస్సేన్, పండిత్ హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ బిర్జు మహరాజ్, సోనూనిగమ్, సురేశ్ వడ్కర్, హరిహరన్ పాల్గొననున్నట్లు పేర్కొన్నారు.