సౌత్ ఇండియా స్టార్ హీరో విజయ్ నటించిన గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) చిత్రం నుంచి రెండో సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ పాటలో దివంగత సింగర్ భవతారిణి వాయిస్ కోసం ఏఐ టెక్నాలజీ ఉపయోగించారు. వెంకట్ ప్రభు దర్శకత్వంలో భారీ బడ్జెట్‌తో ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ చిత్రంలో నటుడు ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, స్నేహా, లైలా, మీనాక్షీ చౌదరి వంటి పలువురు ప్రముఖులు ముఖ్యపాత్రలు పోషించారు. షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా దీనికి యువన్‌శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు.
తాజాగా విడుదలైన రెండో సాంగ్ గురించి యువన్‌శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు. ఈ పాట తనకెంతో ప్రత్యేకమంటూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ చేశారు. 'మొదటి పాటలాగే ఈ పాటను కూడా విజయ్ పాడారు. కానీ ఇందులో నా సోదరి దివంగత భవతారిణి వాయిస్ కూడా ఉంది. ఈ పాట నాకు చాలా ప్రత్యేకమైనది. ఈ అనుభూతిని వర్ణించడానికి నా వద్ద మాటలు కూడా లేవు. బెంగళూరులో ఈ పాటను నేను మొదట కంపోజ్ చేస్తున్నప్పుడు.. దీనికి నా సోదరి వాయిస్ అయితే బాగుంటుందని భావించాను.
ఆమెతోనే ఈ పాటను పాడించాలని బలంగా కోరుకున్నాను. ఆమె ఆరోగ్యం బాగుపడి ఆసుపత్రి నుంచి రాగానే రికార్డ్ చేయవచ్చు అనుకున్నాను. కానీ, అదే సమయంలో ఒక గంట తర్వాత ఆమె ఇక లేదనే వార్త వచ్చింది. అప్పుడు నా గుండె ముక్కలైంది. నేను ఆమె వాయిస్‌ని ఇలా ఏఐ టెక్నాలజీ ద్వారా ఉపయోగిస్తానని ఎప్పుడూ ఊహించలేదు. ఆమె వాయిస్‌ను మరోసారి వినిపించేలా కష్టపడిన నా సంగీత బృందానికి, ఇందులో భాగమైన వ్యక్తులందరికీ నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్పాలనుకుంటున్నాను. ఇది నాకు చాలా చేదు తీపి క్షణం.' అని యువన్‌శంకర్ రాజా ఎమోషనల్ అయ్యారు.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా వారుసురాలు, గాయనీ, సంగీతదర్శకురాలు భవతారిణి కొద్దిరోజుల క్రితం అనారోగ్యంతో కన్నుమూసిన విషయం తెలిసిందే. ఆమెకు ఇద్దరు సోదరులు యువన్ శంకర్‌రాజా, కార్తిక్ రాజాలాగే భవతారణి కూడా తండ్రి ఇళయరాజా వారసత్వాన్ని కొనసాగించారు. మ్యూజిక్ డైరెక్టర్‌గానే కాకుండా సింగర్‌గా కూడా తనదైన ముద్ర ఆమె వేశారు. తాజాగా విజయ్ సినిమాలో ఏఐ టెక్నాలజీ ఉపయోగించి ఆమె వాయిస్‌ను మరోసారి అభిమానులకు అందించారు యువన్‌శంకర్ రాజా. సెప్టెంబరు 5న ప్రేక్షకుల ముందుకు ఈ సినిమా రానుంది.
Comments
Please login to add a commentAdd a comment