
లవ్‌టుడే హీరో ప్రదీప్ రంగనాథన్ 'రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్' చిత్రం (Return of the Dragon Movie)తో ప్రేక్షకుల్ని పలకరించేందుకు సిద్ధమయ్యాడు. ఈ మూవీలో అనుపమ పరమేశ్వరన్‌తో పాటు కయాడు లోహర్ (Kayadu Lohar) కథానాయికగా నటిస్తోంది. ఫిబ్రవరి 21న విడుదలవుతున్న ఈ మూవీ కోసం చిత్రయూనిట్ ప్రమోషన్స్ బాగానే చేసింది. అందులో భాగంగా హీరోహీరోయిన్లు ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. అక్కడ ఓ ఆసక్తికర విషయం జరిగింది.
లవ్ టుడే సీన్ రీక్రియేట్
యాంకర్ మంజూష.. ప్రదీప్, కయాడు లోహర్‌లతో లవ్ టుడే సీన్‌ను రీక్రియేట్ చేసింది. ఇద్దరినీ ఫోన్లు మార్చుకోమంది. లోలోపల భయంగా ఉన్నా పైకి మాత్రం ఇద్దరూ సరేనంటూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించారు. ఒకరి ఫోన్ మరొకరి చేతిలో పడ్డాక అసలు కథ మొదలైంది. కయాడు లోహర్ ఫోన్‌లో మీమ్ క్రియేషన్ యాప్ ఉందన్న విషయం బయటపెట్టాడు ప్రదీప్. దీంతో కంగుతిన్న హీరోయిన్ ఇంకా ఎక్కువ చూడొద్దని అడిగింది.

తనపై తనే మీమ్ వేసుకున్న బ్యూటీ
కానీ ప్రదీప్ దొరికిందే ఛాన్స్ అన్నట్లుగా ఏం మీమ్స్ ఉన్నాయో చూడాలని తహతహలాడాడు. అందులో భాగంగా ఓ మీమ్‌ను బయటపెట్టాడు. తెలుగులో నెక్స్ట్ టాప్ హీరోయిన్ కయాడు లోహర్ అని తనపై తనే మీమ్ వేసుకుందని చెప్పాడు. కయాడు ఏకంగా ప్రదీప్ వాట్సాప్ ఓపెన్ చేసింది. కేవలం నాకు మాత్రమే మీమ్స్ పంపుతానని చెప్పాడు. కానీ చూస్తే వేరే హీరోయిన్లకు కూడా పంపాడు అని చెప్పింది. దీంతో నీళ్లు నమిలిన ప్రదీప్ మమిత, అనుపమ.. ఇలా కొందరికి పంపుతూ ఉంటానని చెప్పాడు.
భయపడిపోయిన హీరో
ఇక భయపడిపోయిన ప్రదీప్.. దీన్ని ఇంతటితో ఆపేద్దామంటూ వెంటనే ఫోన్ లాగేసుకున్నాడు. కయాడు లోహర్ తెలుగులో ఇదివరకే 'అల్లూరి' సినిమాలో నటించింది. కానీ అంత గుర్తింపు రాలేదు. టాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుని అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఆశిస్తోంది. ఆమె కల, ప్రయత్నాలు ఏమేరకు నెరవేరతాయో చూడాలి!
Comments
Please login to add a commentAdd a comment