
ఐటం సాంగ్స్‌లో నటించడానికి నటీమణులకు నిర్మాతలు భారీ మొత్తం చెల్లిస్తుంటారు. అందుకు ఉదాహరణ నటి తమన్నా. ఈమె చాలా చిత్రాల్లో ఐటమ్ సాంగ్స్ చేశారు. తాజాగా నటి త్రిష గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైం) చిత్రంలో ప్రత్యేక పాటలో మెరవనున్నారు. దీని గురించి చాలా కాలంగా ప్రచారం జరుగుతున్నా, చిత్ర వర్గాలు గోప్యంగా ఉంచినట్లు సమాచారం. విజయ్ కథానాయకుడిగా ద్విపాత్రాభినయం చేసిన చిత్రం గోట్. వెంకట్‌ప్రభు దర్శకత్వంలో ఎజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నిర్మించిన ఇందులో ప్రశాంత్, ప్రభుదేవా, అజ్మల్, మైక్ మోహన్, ప్రేమ్‌జీ, నటి మీనాక్షీ చౌదరి, స్నేహ, లైలా తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు.

యువన్‌శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకుని సెప్టెంబరు 5న భారీ ఎత్తున్న విడుదలకు సిద్ధం అవుతోంది. విశేషం ఏమిటంటే ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇంత వరకూ నిర్వహించ లేదు. కారణం ఇంతకు ముందు విజయ్ నటించిన చిత్రాల ఆడియో విడుదల వేడుకల సమయంలో పలు సమస్యలు ఎదురు కావడమే కావచ్చు. అయితే గోట్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించేదీ, లేనిదీ త్వరలోనే వెల్లడిస్తామని క్రియేటివ్ నిర్మాత అర్చన ఇటీవల పేర్కొన్నారు. అయితే దాని గురించి ఇప్పటి వరకూ తెలపలేదు. ఇప్పటికే ఈ చిత్రంలోని మూడు పాటలు, టీజర్ విడుదలై గోట్ చిత్రంపై అంచనాలను పెంచేశాయి.

తాజాగా నాలుగో పాటను త్వరలోనే విడుదల చేయనున్నట్లు దర్శకుడు వెంకట్ ప్రభు తెలిపారు. విజయ్‌తో నటి త్రిష నటించిన ప్రత్యేక పాటనే అయ్యి ఉంటుందనే ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. దీనికి సంబంధించి త్వరలోనే స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కాగా గోట్ చిత్రంలోని నాలుగవ పాట విడుదల కోసం విజయ్ అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటివరకు త్రిష మరే సినిమాలోనూ ఐటం సాంగ్ చేయలేదు. విజయ్‌పై అభిమానంతో గోట్ సినిమాలో ప్రత్యేకమైన సాంగ్ చేసేందకు గ్రీన్ ఇచ్చిందని కోలివుడ్‌లో ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment