‘ఘణపురా’నికి రాజకీయ గ్రహణం
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: నిధులు మూలుగుతున్నా ఘణపురం ప్రాజెక్టు కాల్వలు మరమ్మతుకు నోచుకోవడం లేదు. కాంట్రాక్టు ఎవరికి దక్కాలనే అంశంపై నెలకొన్న వివాదంతో రూ.24.85 కోట్ల జపాన్ బ్యాంక్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ లిమిటెడ్(జైకా) పనులకు రాజకీయ గ్రహణం పట్టింది. కాంట్రాక్టు కాల పరిమితి గడువు సమీపిస్తుండటంతో నిధులు వెనక్కి వెళ్తాయని ఆయకట్టు రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టు నిండా నీళ్లున్నా మరమ్మతులకు నోచుకోక 21 వేల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందని పరిస్థితి నెలకొంది.
మంజీరా నదిపై 1905లో నిర్మించిన ఘణపురం ప్రాజెక్ట్‌కు మహబూబ్‌నహర్, ఫతేనహర్ కెనాళ్లు ఉన్నాయి. వీటి కింద మెదక్, పాపన్నపేట, కొల్చారం మండలాల రైతులు లబ్ధిపొందుతున్నారు. వందేళ్ల క్రితం నిర్మించిన ఈ కాల్వలు ఇంత వరకు మరమ్మతుకు నోచుకోలేదు. కాల్వల ఆధునికీకరణ కోసం జైకా కింద రూ.24.85 కోట్లు మంజూరయ్యాయి.
వీటి ద్వారా మహబూబ్‌నహర్ కెనాల్ 34 కిలోమీటర్లు. ఫతేనహర్కెనాల్ 19కిలో మీటర్ల మేర మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌కు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ పనులు చేజిక్కించుకొని ఫిబ్రవరి 2012లో అగ్రిమెంట్ కుదుర్చుకుంది. రెండేళ్ల కాలపరిమితిలో కాల్వల లైనింగ్, పూడిక తీత, జంగిల్ కటింగ్ తదితర పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఈ మేరకు 2012 ఏప్రిల్‌లో పనులు ప్రారంభించిన కాంట్రాక్టు సంస్థ కేవలం ఆరు శాతం మాత్రమే పనులు పూర్తి చేశారు. తీరా పనులు నిలిచిపోవడంతో కాల్వలు పూర్వపు స్థితికి చేరుకున్నాయి.
కాంట్రాక్టర్‌పై ఒత్తిళ్లు?
జైకా పనులు దక్కించుకునేందుకు టెండర్ దశలో రాఘవ కన్‌స్ట్రక్షన్స్‌తోపాటు మరో కంపెనీ పోటీ పడింది. అయితే జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ముఖ్యనేత ఆశీస్సులున్న కంపెనీకి టెండరు దక్కలేదు. దీంతో సదరు నేత మరమ్మతు పనులు అడ్డుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతో టెండర్ దక్కించుకున్న రాఘవ కన్స్ట్రక్షన్స్ పనులు పూర్తిచేసినా రూ.1.27కోట్లకు సంబంధించి బిల్లులు చెల్లించడంలో అధికారులు ఇబ్బందులు సృష్టిస్తున్నట్లు సమాచారం.
అధికారుల తీరుతో విసుగు చెందిన కాంట్రాక్టర్ ఏకంగా కోర్టును ఆశ్రయించి ఇప్పటి వరకు తాను చేసిన పనులకు సంబంధించి బిల్లులు చెల్లించేలా మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు. మరోవైపు ఇసుక రవాణా విషయంలో నెలకొన్న అస్పష్టత కూడా మరమ్మతు పనుల ఆలస్యానికి కారణమవుతోంది. నిజామాబాద్ జిల్లా యాస్గి నుంచి ఇసుక తెచ్చుకునేలా ఒప్పంద పత్రంలో నిర్దేశించారు. అయితే ఇసుక రీచ్ మహారాష్ట్ర సరిహద్దులో ఉండటంతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
ఈ యేడాది ఫిబ్రవరి 23న మీడియం ఇరిగేషన్ విభాగం చీఫ్ ఇంజినీర్ విజయప్రకాశ్ మెదక్ మండలం నాగ్సాన్పల్లిలో మరమ్మతు పనులు పరిశీలించారు. ఇసుక వివాదాన్ని పరిష్కరించేలా చూడాల్సిందిగా నిజామాబాద్ జిల్లా కలెక్టర్‌కు మెదక్ జిల్లా కలెక్టర్ లేఖ రాశారు. ప్రతిష్టంభన తొలగాలంటే నిజామాబాద్ జిల్లాలోని కిష్టాపూర్, బీర్కూర్, బరంగడి ప్రాంతాల నుంచి ఇసుక రవాణాకు అనుమతించాల్సిందిగా ఇరిగేషన్ అధికారులు కూడా లేఖలు రాశారు. అటు బిల్లులు మంజూరు కాక, ఇటు ఇసుక తరలింపుపై స్పష్టత లేక కాంట్రాక్టు సంస్థ పనులు నిలిపివేసింది. అధికారులు ఘణపురం ప్రాజెక్టు కింద రిజిస్టర్డు ఆయకట్టు ఆయకట్టు 25వేల ఎకరాలు. కాల్వల మరమ్మతు లేక 12వేల ఎకరాలకు మించి కాల్వల ద్వారా సాగునీరు అందడం లేదు.