vijayendra boyi
-
మేడమ్.. అలా వచ్చారు.. ఇలా మార్చారు..!
హిమాయత్‌నగర్: ప్రభుత్వ ఆస్పత్రుల గేటు తట్టాలంటేనే అదో రకమైన భయం. గేటు వద్ద నుంచే పారిశుద్ధ్య లోపం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంటుంది. లైట్లు ఉండవు, ఎటువైపు ఏ బిల్డింగో తెలియదు. ఇక లోపల సిబ్బంది రోగులను కనీసం మనుషులుగా చూడకుండా దురుసు ప్రవర్తించడం వంటివి ఎన్నో ప్రభుత్వ ఆస్పత్రుల్లో కనిపిస్తుంటాయి. అటువంటి నిందా ఆరోపణలన్నింటికీ ఆమె చెక్ పెట్టారు. కేవలం వారం రోజుల్లో ఆస్పత్రి రూపురేఖలను మార్చేశారు. లైట్ల వద్ద నుంచి పారిశుద్ధ్యం, రోడ్లు, కరెంట్ ఇలా ప్రతి ఒక్కటీ నూతనంగా ఏర్పాటు చేసి తనకు తానే సాటిగా నిలుస్తూ కింగ్‌కోఠి జిల్లా ఆస్పత్రిపై ప్రజల్లో నమ్మకం కలిగేలా చేస్తున్నారు ఆస్పత్రి స్పెషల్ ఆఫీసర్(రవాణ అండ్ ఆర్అండ్బీ స్పెషల్ ఆఫీసర్) విజయేంద్ర బోయి. అంధకారం నుంచి వెలుగులోకి... కింగ్‌కోఠి ప్రభుత్వ ఆస్పత్రి ముఖద్వారం నుంచి పాత, కొత్త బిల్డింగ్ అంతా కూడా లైట్లు వెలగక చిమ్మచీకట్లు అలుముకుని ఉంది. గత ఏడాది కోవిడ్ ప్రారంభమైనప్పటి నుంచి ఈ ఆస్పత్రి పరిస్థితి ఇలాగే ఉంది. వారం రోజుల క్రితం స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన విజయేంద్ర బోయి మొట్టమొదటగా ఆస్పత్రిలో లైట్లు ఏర్పాటు చేయించారు. ముఖద్వారం నుంచి ఆస్పత్రికి ఇరువైపులా హైమాస్ట్ లైట్లు, అదేవిధంగా ఆస్పత్రి వార్డుల్లో కూడా వెలుగులు నింపారు. దీంతో పాటు ఆక్సిజన్ ఫిల్లింగ్ ట్యాంక్ వైపు వెళ్లే రోడ్డు అంతా గతుకుల మయంగా ఉండటంతో.. ఒక్కరోజులో ఆ రోడ్డును తారు రోడ్డుగా మార్చారు. వ్యాక్సిన్ వద్ద తోపులాట, గందరోగళం పరిస్థితి నెలకొంది. ఈ విషయమై పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా పోలీసుల సాయంతో కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లను వేర్వేరుగా వేసేలా ఏర్పాటు చేయించారు. కోవిడ్ టెస్టుల వద్ద చకాచకా పనులు జరిగేలా సిబ్బందిని అప్రమత్తం చేశారు. ఇంకా చేయాల్సినవి.. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వస్తున్న వారికి పలు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఒక అడ్మిషన్ చేసేందుకు సుమారు అరగంట నుంచి 45 నిమిషాల సమయం పడుతుంది. దీని పరిష్కారానికి చొరవ చూపించాలి. కోవిడ్ టెస్టుల వద్ద వచ్చిన వారంతా గంటల కొద్ది నిలబడుతూ సొమ్మసిల్లి పడిపోతున్నారు. ఈ ప్రాంతంలో టెంట్ ఏర్పాటు చేసి కుర్చీలు వేయాలి. ఎమర్జెన్సీలో భాగంగా వచ్చిన వారిని స్ట్రెచర్, వీల్‌చైర్‌లో లోపలికి తీసుకెళ్లేందుకు సిబ్బంది తక్కువగా ఉన్నారు. ఈ కారణంగా అంబులెన్స్‌లో నుంచి స్ట్రెచర్‌పైకి ఎక్కించే క్రమంలో రోగులు కిందపడిపోతున్నారు. కాబట్టి సిబ్బందిని కూడా కొంత పెంచాల్సి ఉంది. అడ్మిషన్, రిజిస్ట్రేషన్ వద్ద గందర గోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఎవరు ఏ పని చేస్తున్నారనేది స్పష్టత లేదు. దీంతో రోగుల సహాయకులు ఇటూ..అటూ.. తిరగడంలోనే సమయం వృథా అవుతుంది. ఆస్పత్రి బోర్డులు, సీసీ కెమెరాలు కనిపించకుండా చెట్ల కొమ్మలు దట్టంగా పెరిగాయి. దీనివల్ల ఏవైనా సంఘటనలు జరిగితే ఆ కెమెరాల్లో రికార్డ్ కాలేని పరిస్థితి ఉంటుంది. అడ్డుగా ఉన్న కొమ్మలను తొలగించాలని నారాయణగూడ పోలీసులు నెలా పదిరోజుల క్రితం సంబంధిత శాఖకు లేఖ రాశారు. వాళ్లు ఇంతవరకు పట్టించుకోలేదు. గత ఏడాది ఆస్పత్రి ముఖద్వారానికి ఇరువైపులా చాలా విశాలంగా.. పచ్చదనంగా ఉండేది. ఇప్పుడు తోపుడు బళ్లు అధికంగా ఉండటం వల్ల జనాలు గుమిగూడుతున్నారు. వైద్యులతో విజయేంద్ర బోయి ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్న వారు ముఖద్వారాన్ని చూసి ముచ్చటపడేలా ఉండాలి. అందుకు లైట్లు.. చెత్తాచెదారం లేకుండా నీటిగా ఉండటమే. ప్రైవేటు ఆసుపత్రులు ఎంత క్లీన్‌గా ఉంటున్నాయో.. అంతకంటే క్లీన్‌గా కింగ్‌కోఠి ఆసుపత్రి ఉండాలనేది నా ఆకాంక్ష. అందుకు వైద్యులు, సిబ్బంది సహకారం నాకు చాలా అవసరం. ప్రతిఒక్కరూ నాతో పాటు అడుగు వేస్తే కింగ్‌కోఠి ఆసుపత్రిని అభివృద్ధి పథంలో తీసికెళ్తా. ఇక్కడకు వచ్చే రోగులకు మీరంతా ధైర్యం నింపే వారు కావాలి. -
సేవలు సద్వినియోగం చేసుకోవాలి
రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి పెద్దపెండ్యాల(ధర్మసాగర్ ): అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్న సేవలను శిశువుల తల్లిదండ్రులు, గర్భిణులు సద్వినియోగిం చుకోవాలని రాష్ట్ర శిశుసంక్షేమ శాఖ డైరెక్టర్ విజయేంద్ర బోయి అన్నారు. మండలంలోని పెద్దపెండ్యాల అంగన్వాడీ కేంద్రంలో శనివారం జరిగిన హరితహారం కార్యక్రమం లో ఆమె పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్ర భవనాలు ఉన్న చోట పెద్దఎత్తున మెుక్కలను నాటాలని సూచించారు. అనంరతం స్థానిక అంగన్వాడీ సెంటర్లలో అందుతున్న సేవలను పిల్లల తల్లులను అడిగి తెలుసుకున్నారు. భవనాల్లో మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజాప్రతినిధులను కో రారు. గర్భిణీ, బాలింతలకు ఆమె మొక్కలు పంపిణీ చేశారు. సర్పంచ్ తోట స్రవంతి, ఎంపీటీసీ సభ్యురాలు శిఖ వసంత, ఉపసర్పంచ్ సమ్మిరెడ్డి, ఐసీడీఎస్ పీడీ శైలజ, సీడీపీఓలు జయంతి, సబిత, ఏసీడీపీవో బాల త్రిపురసుందరి, ప్రేమలత, సూపర్వైజర్లు ఆర్.రమాదేవి, బి.రమాదేవి, పుణ్యవతి, ఛాయాదేవి తదితరులు పాల్గొన్నారు.