అనుమానం పెనుభూతమై..
=భార్యను కడతేర్చిన భర్త
=ఆలస్యంగా వెలుగు చూసిన ఘటన
=నిందితుడు పరార్
నారాయణవనం, న్యూస్‌లైన్: కంటికి రెప్పలా కాపాడుకోవాల్సిన భర్తే కాల యముడయ్యాడు. అనుమానంతో భార్యను కడతేర్చాడు. ఆపై తనకేమీ తెలియనట్లు వ్యవహరించాడు. తీరా విషయం బయటపడే సరికి పరారయ్యాడు. ఈ ఘటన నారాయణవనం మండలంలో ఆలస్యంగా ఆదివారం వెలుగు చూసింది. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. గోవిందప్పనాయుడు కండ్రిగ దళితవాడకు చెందిన బాలయ్య తన కుమార్తె గీత(25)కు సోదరి కుమారుడైన సుబ్రమణ్యంతో వివాహం చేశాడు.
ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు. ఎద్దుల బండి తోలుకుంటూ వీరు జీవిస్తున్నారు. అయితే గీతపై సుబ్రమణ్యం అనుమానం పెంచుకున్నాడు. గ్రామానికి చెందిన విజయేంద్రనాయుడు చెరుకును పొలం నుంచి రోడ్డుకు చేర్చడానికి గత సోమవారం గీతతో కలిసి బండిని తీసుకువచ్చాడు. మధ్యాహ్నం చెరుకు తోటలోకి భార్యను తీసుకెళ్లిన సుబ్రమణ్యం కొంతసేపటి తర్వాత ఒంటరిగా బయటకు వచ్చాడు. అప్పటి నుంచి గీత కనిపించ లేదు. గీత సోదరుడు వెంకటేష్ పోలీసులకు శనివారం ఫిర్యాదు చేశాడు.
అదేరోజు తమ పార విషయమై విజయేంద్ర నాయుడు సోదరుడు రాఘవనాయుడు సుబ్రమణ్యాన్ని ప్రశ్నించాడు. అతను పొలం వద్ద ఉందని చెప్పడంతో వెళ్లి పరిశీలించాడు. నల్లమట్టి ఉన్న తమ పొలంలో పనిచేస్తే పారకు ఎర్రమట్టి ఎలా అంటుకుందన్న అనుమానం రాఘవనాయుడికి కలిగింది. దీంతో తన పొలానికి సమీపంలో ఆదివారం ఉదయం పరిశీలించాడు. కిలారి చెంగయ్య వేరుశెనగ పొలంలో పోతమట్టిని గుర్తించాడు. ఇంతలో కుక్క వాసన పసిగట్టి తవ్వడంతో గీత కాలు బయటపడింది.
సమాచారం అందుకున్న పోలీసులు వీఆర్వో మునిరత్నం ఫిర్యాదు మేరకు మృతదేహాన్ని వెలికి తీశారు. పుత్తూరు సీఐ చంద్రశేఖర్, తహశీల్దార్ విజయసింహారెడ్డి సమక్షంలో డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించారు. మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. పుత్తూరు సీఐ విచారణ చేపట్టారు. విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు. ఇదిలావుండగా భార్యపై అనుమానం పెంచుకున్న సుబ్రమణ్యం తరచూ గొడవకు దిగేవాడని తెలిసింది. ఈ క్రమంలోనే ఆమెను హత మార్చినట్లు తెలుస్తోంది. గుడ్డతో గీత మెడకు ఉరి బిగించి చంపినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. ఆపై మృతదేహాన్ని పాత గుడ్డలో చుట్టి పొలంలో పూడ్చిపెట్టాడు.