vikarabad constituency
-
నడిరోడ్డులో శిలాఫలకం
సాక్షి, వికారాబాద్ అర్బన్: పట్టణంలోని రాజీవ్ గృహకల్పలో నడిరోడ్డులోనే శిలాఫలకం ఉండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలనీకి కొత్తగా వాహనాలపై వచ్చే వారు ప్రమాదాలకు గురవుతున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు శిలాఫలకాన్ని రోడ్డుపై నుంచి తొలగించి పక్కకు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. -
వీడని సస్పెన్స్!
సాక్షి, వికారాబాద్: వికారాబాద్ నియోజకవర్గ టీఆర్ఎస్ అభ్యర్థి ఖరారుపై సస్పెన్స్ కొనసాగుతోంది. కొంతకాలంగా తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావుకు టికెట్ రాదనే ప్రచారం జోరుగా సాగింది. ఇదే విషయాన్ని నిజం చేస్తూ పార్టీ అధినేత కేసీఆర్ ప్రకటించిన అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో ఎమ్మెల్యేకు చోటు దక్కలేదు. ఈ స్థానాన్ని పెండింగ్‌లో పెట్టిన అధిష్టానం ఇప్పటికీ టికెట్‌ను ఎవరికీ ఖరారు చేయలేదు. దీంతో వికారాబాద్ నుంచి ఎవరు పోటీచేస్తారనే విషయంలో సందిగ్ధం వీడలేదు. ఎమ్మెల్యే అభ్యర్థిగా ఎవరి పేరు ప్రకటిస్తారోననే ఉత్కంఠ పార్టీ శ్రేణుల్లో రోజురోజుకూ పెరుగుతోంది. ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో గెలుపు గుర్రాలపై గులాబీ ప్రముఖులు దృష్టిసారించినట్లు సమాచారం. నాకే ఇవ్వాలి... త్వరలో జరిగే ఎన్నికల్లో టీఆర్ఎస్ తరఫున పోటీచేసే అభ్యర్థుల జాబితాలో తన పేరు లేకపోవడంతో ఖంగుతిన్న తాజా మాజీ ఎమ్మెల్యే సంజీవరావు మొదటి మూడు రోజుల పాటు స్తబ్దుగా ఉన్నారు. దీంతో ఆయనపై నాయకులు, కార్యకర్తల్లో సానుభూతి వ్యక్తమైంది. జాబితాలో పేరు లేనప్పటికీ ఇతరులకు టికెట్ కేటాయించకపోవడంతో ప్రయత్నాలు ముమ్మరం చేద్దామని అనుచరులు, అభిమానులు పేర్కొనడంతో.. పార్టీలోని ప్రముఖులను కలుస్తూ తనకే అవకాశమివ్వాలని అభ్యర్థిస్తున్నారు. నాలుగు రోజులక్రితం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తన మద్దతుదారులు, పార్టీ నేతలతో సమావేశమై అధిష్టానంపై ఒత్తిడి పెంచాలని తీర్మానించారు. మరుసటి రోజునే సంజీవరావు తన మద్దతుదారులతో కలిసి టీఆర్ఎస్ అగ్రశ్రేణి నేతలు కేటీఆర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి తదితరులను కలిసి విన్నవించారు. పార్టీకి చెందిన నియోజకవర్గ నాయకులంతా తన వెంటే ఉన్నారని, కార్యకర్తల అండదండలు కూడా తనకే ఉన్నాయని ఆయన చెప్పినట్లు సమాచారం. టికెట్ విషయంలో సంజీవరావుకు అధిష్టానం ఇప్పటికీ హామీ ఇవ్వలేదు. గెలుపు గుర్రాల కోసం గులాబీ పార్టీ అన్వేషణ తీవ్రతరం చేసినట్లు వినికిడి. టికెట్ ఎవరికి ఇవ్వాలనే విషయంలో పార్టీ అధిష్టానం మల్లగుల్లాలు పడుతున్నట్లు సమాచారం. ఆశావహుల ప్రయత్నాలు... వికారాబాద్ టీఆర్ఎస్ టికెట్ విషయంలో సస్పెన్స్, థ్రిల్లింగ్ కొనసాగుతుండగా ఆశావహులు తమతమ స్థాయిల్లో పైరవీలు ముమ్మరం చేశారు. దాదాపు ఏడుగురికి పైగానే ఈ స్థానానికి పోటీ పడుతున్నారు. చేవెళ్ల టికెట్ కోసం పోటీపడి భంగపడిన మాజీ ఎమ్మెల్యే రత్నం పేరు కూడా పార్టీ తరఫున ప్రచారంలో ఉన్నప్పటికీ.. తాను టీఆర్ఎస్ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు బుధవారం ప్రకటించారు. మర్పల్లి మండలానికి చెందిన మదుగు రామేశ్వర్ పేరు సైతం వినిపిస్తోంది. ఈయన 1994 నుంచి రాజకీయాల్లో ఉన్నారు. టీడీపీలో పనిచేసిన రామేశ్వర్ 2002లో టీఆర్ఎస్లో చేరి క్రియాశీల రాజకీయాల్లో చురుగ్గా పనిచేస్తున్నారు. టీఆర్ఎస్లో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ప్రస్తుతం మర్పల్లి మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఈయన ఇటీవలే స్థానిక నేతలతో వెళ్లి ఆపద్ధర్మ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ సనగారి కొండల్‌రెడ్డిని కలిసి తనకు పోటీచేసే అవకాశం ఇస్తే ఎంతైనా సరే ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉన్నానని పేర్కొన్నట్లు తెలుస్తోంది. దీంతో అధిష్టానం రామేశ్వర్ పేరును కూడా పరిశీలిస్తున్నట్లు సమాచారం. అదే విధంగా టీఆర్ఎస్ కార్మిక విభాగం నాయకులు భూమనోళ్ల కృష్ణయ్య, స్థానిక వైద్యులు సబితాఆనంద్, విద్యాసాగర్, టి.ఆనంద్, టీచర్ దేవదాస్, కౌన్సిలర్ రమేష్ తదితరులు ఎవరికి తోచిన రీతిలో వారు ప్రయత్నాలు వేగవంతం చేశారు. కాగా పార్టీ టికెట్ ఎవరికి కేటాయించినా గెలిపించడానికి సిద్ధంగా ఉన్నామని, వికారాబాద్‌లో టీఆర్ఎస్ విజయం ఖాయమని గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ సనగారి కొండల్‌రెడ్డి పేర్కొంటున్నారు. అధిష్టానానికి ఇప్పటికే తమ నిర్ణయాన్ని తెలియజేశామని, ఒకటి రెండు రోజుల్లో నిర్ణయం వెలువడే అవకాశముందని ఆయన చెప్పారు. -
‘దేశం’ డీలా!
చుక్కానిలేని నావలా.. వికారాబాద్ నియోజకవర్గం ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. ఇక్కడి నుంచి డాక్టర్ ఏ.చంద్రశేఖర్ సుదీర్ఘకాలం ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేశారు. 2004లో ఆయన టీడీపీకి రాజీనామా చేసి అనంతరం టీఆర్ఎస్లో చేరారు. చంద్రశేఖర్ రాజీనామా టీడీపీపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటి నుంచి ఒడిదుడుకులు ఎదుర్కొంటున్న పార్టీని సంజీవరావు (నియోజకవర్గ ఇన్చార్జి) సమర్థంగా నడిపించలేకపోయారు. ఆయన కూడా 2012లో వైఎస్సార్ సీపీలో చేరడంతో ‘దేశం’ పరిస్థితి చుక్కానిలేని నావలా తయారైంది. ఈ క్రమంలోనే విజయ్‌కుమార్‌ను నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించినా పార్టీకి పూర్వవైభవం దక్కలేదు. ఈ తరుణంలో కొత్త నేతను ఇక్కడి నుంచి బరిలో నిలపాలని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ను ఢీకొనేందుకు సమర్థ అభ్యర్థి వెతుకులాటలో తలమునకలవుతోంది. అందులో భాగంగా టీడీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు శ్రీశైలం మాదిగ పేరును తీవ్రంగా పరిశీలిస్తోంది. ఆర్థికంగా స్థితిమంతుడు కూడా కావడంతో ప్రసాద్‌కు చెక్‌పెట్టవచ్చని అంచనా వేస్తోంది. చంద్రశేఖర్ టీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో నియోజకవర్గంలో టీ ఆర్ఎస్ బలహీనంగా తయారుకావడం తమకు కలిసివస్తుందని టీడీపీ అధినాయకత్వం భావిస్తోంది. వలస నేతలపైనే ఆశలు ఎమ్మెల్యే, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పి.మహేందర్‌రెడ్డి రాజీనామాతో తాండూరులో ఆ పార్టీ పరిస్థితి మరింత తీసికట్టుగా మారింది. నియోజకవర్గంలో గతంలో ఒక వెలుగువెలిగిన పార్టీ ప్రస్తుతం కొత్త నాయకుల కోసం ఎదురుచూస్తోంది. మహేందర్‌రెడ్డి బలమైన నాయకుడు కావడం, దిగువ శ్రేణి నాయకులు కూడా ఆయన బాటలోనే గులాబీ గూటికి చేరిన నేపథ్యంలో టీడీపీ ఇక వలస నేతలపైనే గంపెడాశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే ఇటీవల చంద్రబాబును కలిసిన మాజీ మంత్రి స్వర్గీయ ఎం. చంద్రశేఖర్ కుమారుల్లో ఒకరికి టికెట్ ఖరారు చేయాలని ‘దేశం’ భావిస్తోంది. ఇక్క డ బలంగా ఉన్న కాంగ్రెస్ ఓటు బ్యాంకును దెబ్బతీయడానికి వీరి చేరిక లాభిస్తుందని అంచనా వేస్తోంది. బలమైన నేతలు దొరక్కపోతే ఈ సీటును సర్దుబాటులో భాగంగా బీజేపీ కేటాయించి చేతులు దులుపుకోవాలని అనుకుం టోంది. మాజీ మంత్రి సబిత సోదరుడు నరసింహారెడ్డి బీజేపీ పంచన చేరనున్న నేపథ్యం లో కాంగ్రెస్‌ను దెబ్బతీయవచ్చని, అదేసమయంలో సమీప బంధువైన మహేందర్‌రెడ్డి వర్గంలోనూ చీలిక ఏర్పడుతుందని టీడీపీ ఆశి స్తోంది. బీజేపీతో పొత్తు కుదిరితే తాండూరు లో విజయావకాశాలు మెరుగవుతాయని అం చనా వేస్తోంది. ఈ క్రమంలో కమలానికి ఈ సీటును వదిలేందుకు సైతం ‘సై’ అంటోంది. ఆకర్ష్ ఫలిస్తే.. చేవెళ్ల ఎమ్మెల్యే కేఎస్ రత్నం గుడ్‌బై చెప్పడం తెలుగుదేశం పార్టీని ఆత్మరక్షణలో పడేసింది. ఎన్నికల వేళ ఆయన అనూహ్యంగా టీఆర్ఎస్లోకి జంప్ చేయడంతో కంగుతున్న తమ్ముళ్లు.. అభ్యర్థి అన్వేషణలో తలమున కలయ్యారు. రిజర్వ్డ్ సీటు కావడం, నిర్దేశిత సామాజికవర్గం నాయకులు ఆర్థికంగా స్థితిమంతులు కాకపోవడంతో కొత్త వారిపైనే పార్టీ నమ్మకం పెట్టుకుంది. ఈ క్రమంలో ఇక్కడి నుంచి స్థానిక నేతలకు ఛాన్స్ ఇచ్చేది అనుమానంగానే కనిపిస్తోంది. సొంత పార్టీలో సమర్థ అభ్యర్థులు లేకపోవడంతో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తోంది. ప్రధానంగా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మాజీ మంత్రి చంద్రశేఖర్, ఎస్సీ సెల్ కన్వీనర్ వెంకటస్వామిపై కన్నేసింది. కాంగ్రెస్ టికెట్ లభించకపోతే తమ గూటికి చేరేలా వారితో సంప్రదింపులు జరుపుతోంది. కాంగ్రెస్ టికెట్లు ఖరారయితే తప్ప.. ఇక్కడి నుంచి టీడీపీ తరుఫున ఎవరు బరిలో ఉంటారనేది స్పష్టం కాని పరిస్థితి. బీసీ నేతలపై గురి! 2009లో పార్టీ తరఫున ఇక్కడి నుంచి గెలుపొందిన హరీశ్వర్‌రెడ్డి టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం, ఎన్నికల వేళ ఎమ్మెల్సీ నరేందర్‌రెడ్డి అన్నబాటనే అనుసరించడంతో పరిగిలో ‘దేశం’ పరిస్థితి దిగజారింది. ఇద్దరు ముఖ్యనేతలు కారెక్కడంతో నైరాశ్యంలో కూరుకుపోయిన పార్టీ శ్రేణులు కూడా పక్కచూపులు చూస్తున్నాయి. ఈ తరుణంలో వచ్చే ఎన్నికల్లో పార్టీ తరుఫున పోటీకి నాయకుల కొరత ఏర్పడింది. దీంతో వలస నేతలపైనే ఆశలు పెట్టుకుంది. బలమైన సామాజికవర్గానికి చెందిన ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు.. బీసీ అస్త్రాన్ని ప్రయోగించాలని యోచిస్తోంది. ఈ నేపథ్యంలోనే బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్యతోపాటు, జెడ్పీ మాజీ చైర్మన్ కాసాని జ్ఞానేశ్వర్లకు వల విసురుతోంది. ప్రస్తుతం కాంగ్రెస్‌లో కొనసాగుతున్న జ్ఞానేశ్వర్ సైకిలెక్కెందుకు అంగీకరిస్తే పరిగి పగ్గాలను అప్పగిస్తామని హామీ ఇస్తోంది. నియోజకవర్గ అభ్యర్థుల గెలుపోటములను నిర్ధేశించేస్థాయిలో కాసాని ఉండడంతో ఎలాగైనా ఆయన్ని పార్టీలోకి తేవాలని అధినాయకత్వం విశ్వప్రయత్నాలు చేస్తోంది.