రూ.500 కోసం గొడవ..జీవితకాలం శిక్ష
-రూ. 2000 జరిమానా..
-వికారాబాద్ కోర్టులో వెలువడిన తీర్పు
పరిగి: రూ. 500 ల కోసం పెట్టుకున్న గొడవ ఓ యువకుడిని జీవితాంతం జైలుకే పరిమితం చేసింది. యువకుడికి శిక్ష తో పాటు రూ.2000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పును వెలవరించింది. రంగారెడ్డి జిల్లా వికారాబాద్ సెషన్స్ కోర్టులో జిల్లా అడిషనల్ సెషన్ జడ్జ్ కే.రంగారావ్ ఈ శిక్ష ఖరారు చేస్తూ గురువారం తీర్పు వెలువరించారు. ఈ కేసుకు సంబందించిన వివరాలు.. జిల్లాలోని పరిగి మండల పరిధిలోని గోవిందాపూర్‌కు చెందిన పిచ్చకుంట్ల మల్లేశ్(25) తనకు ఇవ్వాల్సిన రూ.500 అప్పు తీర్చాలంటూ అదే గ్రామానికి చెందిన పిచ్చకుంట్ల హన్మంతుతో గొడవకు దిగాడు.
ఈ క్రమంలో చెలరేగిన గొడవలో మల్లేశ్ హన్మంతును కత్తితో పొడవగా అతను మృతి చెందాడు. కుటుంబీకుల ఫిర్యాదు మేరకు 2011 ఆగస్టు 10వ తేదీ కేసు నమోదు చేసుకుని, అప్పటి సీఐ మోహన్‌రెడ్డి, ఎస్ఐ రాజయ్యలు దర్యాప్తు ప్రారంభించారు. చార్జిషీట్ దాఖలు చేశారు. నాలుగు సంవత్సరాలుగా కేసుకు సంబందించి ట్రాయల్స్ జరగగా వాదనలు ముగిసి నేరం రుజువు కావటంతో గురువారం తీర్పును వెలువరించారు. మల్లేశ్ కు యావజ్జీవ శిక్షతో పాటు రూ. 2000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు వెలువరించారు.