అవాక్కయిన అధికారులు!
నాగ్పూర్: మహారాష్ట్రలో జరగబోయే శాసన మండలి ఎన్నికల్లో పోటీచేస్తున్న అభ్యర్థి ఒకరు ధరావతులో రూ.8,500ను రూపాయి నాణాల్లో సమర్పించడంతో ఎన్నికల అధికారులు అవాక్కయ్యారు. గడ్చిరోలి జిల్లాకు చెందిన విలాస్ శంకర్రావ్ బలంవార్ అనే వ్యక్తి నాగ్పూర్ డివిజన్ ఉపాధ్యాయుల నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్నారు. మంగళవారం రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తూ రూ.10 వేల ధరావతులో రూ.8,500ను రూపాయి నాణాల రూపంలో సమర్పించారు.
నాలుగు సంచుల్లో తెచ్చిన ఆ నాణాలను లెక్కపెట్టడానికి సిబ్బందికి కొన్ని గంటలు పట్టింది. ధరావతును అలా రూపాయి నాణాల్లో చెల్లించడం వెనక ఉన్న కారణం గురించి అడిగినపుడు..తన నియోజక వర్గంలోని 8,500 నాన్ఎయిడెడ్ స్కూలు టీచర్ల నుంచి ఆ నాణాలు సేకరించానని, మిగతా రూ.1500ను సొంతంగా భరించినట్లు చెప్పారు. నాన్ ఎయిడెడ్ స్కూలు టీచర్ల డిమాండ్ల పట్ల ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని, వారి కోసమే ఈ ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు బలంవార్ చెప్పారు. ఫిబ్రవరి 3న ఈ పోలింగ్ జరగుతుంది. ఫలితాలు 6వ తేదీన వెల్లడవుతాయి.